చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ మళ్లీ చేతులు మారింది. రవీంద్ర జడేజా కెప్టెన్సీని తిరిగి మహేంద్ర సింగ్ ధోనికి అందించాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్  యాజమాన్యం అధికారికంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. తన వ్యక్తిగత ఆటతీరును మెరుగు పరుచుకునేందుకు జడేజా ఈ నిర్ణయం తీసుకున్నాడని, మహేంద్ర సింగ్ ధోని కూడా జడేజా నిర్ణయానికి అంగీకరించి తిరిగి పగ్గాలు అందుకుంటున్నాడని చెన్నై తన ప్రకటనలో పేర్కొంది.


రవీంద్ర జడేజా నాయకత్వంలో చెన్నై ఈ సీజన్‌లో ఎనిమిది మ్యాచ్‌లు ఆడగా... కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. మిగతా ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి ఎదురైంది. దీంతో పాటు వ్యక్తిగతంగా కూడా జడేజా పెద్దగా మెరుపులు మెరిపించలేదు. బ్యాటింగ్‌లో కానీ, బౌలింగ్‌లో కానీ పెద్దగా రాణించలేకపోయాడు. ఆటగాడిగా విఫలం అవుతుండటంతో జడేజా ఈ నిర్ణయం తీసుకున్నాడు.


ఈ సీజన్‌లో చెన్నై ఇంకా ఆరు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉంటే చెన్నై ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కెప్టెన్ జడేజా అయినా ధోని ఇన్‌పుట్స్ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు పూర్తిస్థాయి కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు స్వీకరించడంతో చెన్నై అవకాశాలు ఎలా ఉంటాయో చూడాలి.