ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ఓటమి ఎదురైంది. ఆదివారం రాత్రి లక్నోతో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 24 పరుగులతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 154 పరుగులకు పరిమితం అయింది. ఈ విజయం రాజస్తాన్ రెండో స్థానానికి చేరుకుంది.


ఆరంభంలోనే ఎదురుదెబ్బ
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్తాన్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫాంలో ఉన్న ఓపెనర్ జోస్ బట్లర్ (2: 6 బంతుల్లో)... అవేష్ ఖాన్ బౌలింగ్‌లో ర్యాంప్ షాట్‌కు ప్రయత్నించి క్లీన్ బౌల్డయ్యాడు. కానీ యశస్వి జైస్వాల్ (41: 29 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్)4, కెప్టెన్ సంజు శామ్సన్ (32: 24 బంతుల్లో, ఆరు ఫోర్లు) వేగంగా ఆడుతూ రన్‌రేట్ తగ్గనివ్వలేదు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 40 బంతుల్లోనే 64 పరుగులు జోడించారు.


అయితే సంజు శామ్సన్, యశస్వి జైస్వాల్ ఇద్దరూ రెండు పరుగుల వ్యవధిలోనే అవుటయ్యారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన దేవ్‌దత్ పడిక్కల్ (39: 18 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు) కాసేపు విధ్వంసం సృష్టించాడు. ఉన్నది కాసేపే అయినా ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన దేవ్‌దత్ పడిక్కల్... కృనాల్ పాండ్యా చేతికి చిక్కాడు.


ఆ తర్వాత రియాన్ పరాగ్ (17: 16 బంతుల్లో, ఒక సిక్సర్), జిమ్మీ నీషం (14: 12 బంతుల్లో, రెండు ఫోర్లు) ఆశించినంత వేగంగా ఆడకపోయినా ఆఖర్లో ట్రెంట్ బౌల్ట్ (17 నాటౌట్: 9 బంతుల్లో, రెండు ఫోర్లు) చిన్నపాటి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో రాజస్తాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ట్రెంట్ బౌల్ట్ ఐపీఎల్ కెరీర్‌లో మొదటి ఫోర్ ఈ మ్యాచ్‌లోనే కొట్టాడు. గతంలో తన ఖాతాలో ఒక సిక్సర్ మాత్రమే ఉంది.  రాజస్తాన్ తరఫున ఏకంగా ఎనిమిది మంది బౌలింగ్ చేశారు. రవి బిష్ణోయ్ రెండు వికెట్లు తీయగా... అవేష్ ఖాన్, జేసన్ హోల్డర్, అయుష్ బదోనిలకు తలో వికెట్ దక్కింది.


విఫలమైన లక్నో టాప్ ఆర్డర్
179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలం అయింది. ఓపెనర్లు క్వింటన్ డికాక్ (7: 8 బంతుల్లో, ఒక ఫోర్), కేఎల్ రాహుల్ (10: 19 బంతుల్లో, ఒక సిక్సర్), వన్‌డౌన్ బ్యాటర్ అయుష్ బదోని (0: 1 బంతి) ఫెయిల్ కావడంతో లక్నో 29 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.


ఈ దశలో దీపక్ హుడా (59: 39 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు), కృనాల్ పాండ్యా (25: 23 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) లక్నోను ఆదుకున్నారు. దీపక్ హుడా వేగంగా ఆడినా... కృనాల్ పాండ్యా క్రీజులో కొంచెం ఇబ్బంది పడటంతో సాధించాల్సిన రన్‌రేట్ పెరుగుతూ పోయింది. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 65 పరుగులు జోడించారు. కృనాల్‌ను అవుట్ చేసిన ప్రసీద్ కృష్ణ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ తర్వాత కాసేపటికే హుడా కూడా అవుటయ్యాడు. దీంతో లక్నో కథ ముగిసింది.


ఆ తర్వాత మార్కస్ స్టోయినిస్ (27: 17 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) వేగంగా ఆడే ప్రయత్నం చేసినా తనకు మరో ఎండ్ నుంచి సహకారం లభించలేదు. దీంతో లక్నో 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 154 పరుగులకు పరిమితం అయింది. రాజస్తాన్ బౌలర్లలో ఒబెడ్ మెకాయ్, ప్రసీద్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్‌లు చెరో వికెట్ తీసుకున్నారు.