ఐపీఎల్ 2022లో చెన్నైకి వరుసగా మూడో ఓటమి ఎదురైంది. పంజాబ్ కింగ్స్ చేతిలో 54 పరుగుల తేడాతో చెన్నై చిత్తుగా ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం చెన్నై 18 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌట్ అయింది. అర్థ సెంచరీ చేయడంతో పాటు రెండు వికెట్లు కూడా తీసుకున్న లివింగ్‌స్టోన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.


ఆరంభం అరిపించినా...
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. కెప్టెన్, ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను (4: 2 బంతుల్లో, ఒక ఫోర్) ఇన్నింగ్స్ రెండో బంతికే ముకేష్ చౌదరి అవుట్ చేశాడు. ఇక ఫాంలో ఉన్న వన్‌డౌన్  బ్యాటర్ భనుక రాజపక్స (9: 5 బంతుల్లో, ఒక సిక్సర్) రెండో ఓవర్లో ధోని మార్కు మెరుపు రనౌట్‌కు పెవిలియన్ బాట పట్టాడు. దీంతో పంజాబ్ 14 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.


ఈ దశలో శిఖర్ ధావన్‌తో (33: 24 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) జత కలిసిన లియాం లివింగ్‌స్టోన్ (60: 32 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు) సిక్సర్లతో చెలరేగాడు. ముకేష్ చౌదరి వేసిన ఐదో ఓవర్లో లివింగ్ స్టోన్ కొట్టిన 108 మీటర్ల సిక్సర్ టోర్నమెంట్‌లోనే అతి పెద్దది. ఈ ఓవర్లో లివింగ్ స్టోన్ రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 26 పరుగులు పిండుకున్నాడు. వీరిద్దరూ 50 పరుగుల భాగస్వామ్యాన్ని కేవలం 27 బంతుల్లోనే అందుకున్నారు. మరో వైపు శిఖర్ కూడా వేగం పెంచడంతో పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ రెండు వికెట్ల నష్టానికి ఏకంగా 72 పరుగులు సాధించింది.


జడేజా బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్‌ను క్యాచ్‌ను రాయుడు వదిలేశాడు. ఆ తర్వాత కూడా లివింగ్ స్టోన్ సిక్సర్లతో చెలరేగాడు. మూడో వికెట్‌కు 52 బంతుల్లోనే 95 పరుగులు జోడించిన అనంతరం ఇన్నింగ్స్ 10వ ఓవర్లో బ్రేవో బౌలింగ్‌లో ధావన్ అవుటయ్యాడు. ప్రమాదకరంగా మారిన లివింగ్‌స్టోన్‌ను కూడా జడేజా అవుట్ చేయడంతో చెన్నై తిరిగి మ్యాచ్‌లోకి వచ్చింది.


ఆ తర్వాత చెన్నై పంజాబ్‌ను అస్సలు కోలుకోనివ్వలేదు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూనే ఉన్నారు. యువ ఆటగాడు జితేష్ శర్మ కాసిన్ని మెరుపులు మెరిపించాడు. అయితే డ్వేన్ ప్రిటోరియస్ తెలివైన బంతికి నిర్లక్ష్యమైన షాట్ ఆడి రాబిన్ ఊతప్ప చేతికి చిక్కాడు. తర్వాత వచ్చిన బ్యాటర్లలో ఎవరూ నిలదొక్కుకోలేకపోవడంతో ఒక దశలో 230 పరుగుల వరకు చేస్తుందనుకున్న పంజాబ్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 180 పరుగులకే పరిమితం అయింది. మొదటి 10 ఓవర్లలో 109 పరుగులు చేసిన పంజాబ్ కింగ్స్, చివరి 10 ఓవర్లలో కేవలం 71 పరుగులు మాత్రమే సాధించగలిగింది.


దూబే దమ్ము సరిపోలేదు...
ఇక 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి చెన్నై 27 పరుగులు మాత్రమే చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఎనిమిదో ఓవర్లో అంబటి రాయుడు (13: 21 బంతుల్లో, రెండు ఫోర్లు) కూడా అవుటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు కేవలం 36 పరుగులు మాత్రమే.


ఆ తర్వాత శివం దూబే (57: 30 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు), మహేంద్ర సింగ్ ధోని (23: 28 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) చెన్నైని ఆదుకున్నారు. ఈ దశలోనే శివం దూబే కేవలం 26 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు. ఆరో వికెట్‌కు 62 పరుగులు జోడించిన అనంతరం వేగంగా ఆడే ప్రయత్నంలో దూబే అవుటయ్యాడు.


ఆ తర్వాత డ్వేన్ బ్రేవో (0: 1 బంతి), డ్వేన్ ప్రిటోరియస్ (8: 4 బంతుల్లో, ఒక సిక్సర్) కూడా అవుట్ కావడంతో ఒత్తిడంతా ధోనిపై పడింది. వేగంగా ఆడబోయి రాహుల్ చాహర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. దీంతో చెన్నై పరాజయం దాదాపుగా ఖాయం అయింది. అదే ఓవర్లో క్రిస్ జోర్డాన్ (5: 5 బంతుల్లో) కూడా అవుట్ కావడంతో చెన్నై 18 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌట్ అయింది. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ మూడు వికెట్లు తీయగా... లియామ్ లివింగ్ స్టోన్, వైభవ్ అరోరా రెండేసి వికెట్లు తీశారు. రబడ, అర్ష్‌దీప్ సింగ్, ఒడియన్ స్మిత్‌లకు తలో వికెట్ దక్కింది.