GT vs PBKS Highlights: ఐపీఎల్‌ 2022లో గుజరాత్‌ టైటాన్స్‌కు రెండో పరాజయం! మ్యాచ్ 48లో ఆ జట్టును పంజాబ్‌ కింగ్స్‌ 8 వికెట్ల తేడాతో ఓడించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 144 పరుగుల టార్గెట్‌ను మరో 4 ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ (62*; 53 బంతుల్లో 8x4, 1x6) అజేయ హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. అతడికి తోడుగా భానుక రాజపక్స (40; 28 బంతుల్లో 5x4, 1x6), లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (30*; 10 బంతుల్లో 2x4, 3x6) మెరుపు ఇన్నింగ్సులు ఆడారు. అంతకు ముందు టైటాన్స్‌లో సాయి సుదర్శన్‌ (64*; 50 బంతుల్లో 5x4, 1x6) విలువైన హాఫ్‌ సెంచరీ చేశాడు. వృద్ధిమాన్‌ సాహా (21; 17 బంతుల్లో 3x4, 1x6) ఫర్వాలేదనిపించాడు.  కాగిసో రబాడా (4/33) వారి జోరుకు అడ్డుకట్ట వేశాడు.


'గబ్బర్‌' అటాక్‌


ఎదురుగా మోస్తరు టార్గెట్టే ఉండటంతో పంజాబ్‌ కింగ్స్‌ కుదురుగా ఆడింది. ఎలాంటి రిస్కీ షాట్లకు వెళ్లలేదు. ఈసారి మయాంక్‌ అగర్వాల్‌కు బదులుగా జానీ బెయిర్‌స్టో (1) ఓపెనింగ్‌కు వచ్చాడు. ఎక్కువ పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. జట్టు స్కోరు 10 వద్ద మహ్మద్‌ షమీ అతడిని ఔట్‌ చేశాడు. ఆ తర్వాత పంజాబ్‌ కింగ్స్‌కు ఎదురే లేకుండా పోయింది. శిఖర్ ధావన్‌ అత్యంత అప్రమత్తంగా ఆడాడు. కట్టుదిట్టంగా వచ్చిన బంతుల్ని గౌరవించాడు. సింగిల్స్‌, డబుల్స్‌ తీస్తూ స్ట్రైక్‌ రొటేట్‌ చేశాడు. అందివచ్చిన బంతుల్ని మాత్రం శిక్షించాడు.


ఇక రాజపక్స్‌  మాత్రం తన స్టైల్లోనే దూకుడు ప్రదర్శించాడు. శిఖర్‌తో కలిసి రెండో వికెట్‌కు 59 బంతుల్లోనే 87 పరుగుల భాగస్వామ్యం అందించాడు. జట్టు స్కోరు 97 వద్ద అతడిని ఫెర్గూసన్‌ ఔట్‌ చేశాడు. కానీ అప్పటికే పంజాబ్‌ కంఫర్టబుల్‌ సిచ్యువేషన్‌లోకి వెళ్లిపోయింది. 38 బంతుల్లో హాఫ్‌ సెంచరీ అందుకున్న గబ్బర్‌.. లియామ్‌ లివింగ్‌ స్టన్‌తో కలిసి పంజాబ్‌కు ఐదో విజయం అందించాడు.


బతికించిన సాయి సుదర్శన్


టాస్‌ గెలిచిన హార్దిక్‌ పాండ్య మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. బహుశా తమ బ్యాటింగ్‌ డెప్తును పరిశీలించాలన్నది అతడి ఫీలింగేమో! ఏదేమైనా టైటాన్స్‌కు మంచి ఓపెనింగ్‌ లభించలేదు. 17 వద్ద శుభ్‌మన్‌ గిల్‌ (9) రనౌట్‌ అయ్యాడు. 34 వద్ద వృద్ధిమాన్‌ సాహాను రబాడా పెవిలియన్‌ పంపించాడు. ఆ తర్వాత టైటాన్స్‌ కోలుకోలేదు. 44 వద్ద హార్దిక్‌ పాండ్య (1)ను రిషి ధావన్‌ ఔట్‌ చేశాడు. ఈ సీజన్లో గుజరాత్‌కు అండగా నిలిచిన మిల్లర్‌ (11)ను లివింగ్‌స్టోన్‌ అడ్డుకోవడంతో 67కే 4 వికెట్లు నష్టపోయి టైటాన్స్‌ కష్టాల్లో పడింది.


ఈ క్రమంలో రాహుల్‌ తెవాతియా (11) అండతో సాయి సుదర్శన్‌ ఐదో వికెట్‌కు 30 బంతుల్లో 45 పరుగుల భాగస్వామ్యం అందించాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. అనవసర షాట్లకు పోలేదు. దాంతో 15.2 ఓవర్లకు టైటాన్స్‌ స్కోరు 100 దాటింది. తడబడుతున్న తెవాతియా షాట్లు కొట్టబోయి రబాడా వేసిన 16.2వ బంతికి ఔటయ్యాడు. ఆ తర్వాత బంతికే రషీద్‌ ఖాన్‌ (0) గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. సుదర్శన్‌ 42 బంతుల్లో హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. మరోవైపు వికెట్లు పడుతున్నా స్ట్రాంగ్‌గా నిలబడ్డాడు. జట్టు స్కోరును 143/8కి చేర్చాడు. అర్షదీప్‌, లివింగ్‌స్టోన్‌, రిషి ధావన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.