CSK vs MI: ఈ సీజన్లో చతికిల పడింది గానీ ముంబయి ఇండియన్స్‌తో పెట్టుకుంటే ఎలాంటి జట్టైనా తలవంచాల్సిందే! తాజాగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌పై విజయంతో రోహిత్‌ సేన ఓ అద్భుతమైన, అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఐపీఎల్‌లో రెండు జట్లపై 20 సార్లు, అంతకన్నా ఎక్కువ విజయాలు అందుకున్న టీమ్‌గా చరిత్ర సృష్టించింది. ఇలాంటి రికార్డు మరెవ్వరికీ లేదు.


ఐపీఎల్‌ లీగులో కొన్ని జట్లకు కొంత మంది ప్రత్యర్థులంటే చాలా ఇష్టం! వాటిపైన ఆడేందుకు, గెలిచేందుకు ఎంతో ఇష్టపడతాయి. నువ్వా నేనా అన్నట్టుగా సాగినా, ప్రత్యర్థి ఎంత బలంగా పోటీ ఇచ్చినా ఆఖరికి గెలిచే తీరుతాయి. ఐదుసార్లు ముంబయి ఇండియన్స్‌ అలాంటిదే. నాలుగుసార్లు విజేత చెన్నై సూపర్‌కింగ్స్‌, రెండుసార్లు ఛాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అంటే రోహిత్‌ సేనకు ఒకరకమైన పిచ్చి! అందుకే వీరిద్దరిపైనా 20+ విజయాలు అందుకున్న ఏకైక జట్టుగా నిలిచింది.


చెన్నై సూపర్‌కింగ్స్‌పై ముంబయి ఇండియన్స్‌ ఇప్పటి వరకు 34 సార్లు ఆడింది. ఇందులో 20 సార్లు విక్టరీ అందుకుంది. కేవలం 14 సార్లే ఓడిపోయింది. విజయాల శాతం ఏకంగా 58.82 శాతం అన్నమాట. చివరిసారి తలపడ్డ 6 మ్యాచుల్లో 3-3తో సమానంగా ఉన్నాయి. ఈ సీజన్లో తలపడ్డ మొదటి మ్యాచులో ముంబయి త్రుటిలో విజయావకాశం కోల్పోయింది.


గురువారం నాటి మ్యాచులో మాత్రం ముంబయి ప్రతీకారం తీర్చుకుంది. తమతో పాటు సీఎస్‌కేనూ ఇంటికి తీసుకెళ్లింది. ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పైనా ముంబయిది తిరుగులేని ఆధిపత్యం. 31 సార్లు తలపడితే 22-9తో పైచేయి సాధించింది. విజయాల శాతం ఏకంగా 70.96. ముంబయి తర్వాత ఒక జట్టుపై అత్యధిక విజయాలు సాధించింది కోల్‌కతాయే. పంజాబ్‌ కింగ్స్‌పై 20 సార్లు గెలిచింది.


CSK vs MI మ్యాచ్ ఎలా సాగిందంటే?


ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 15.5 ఓవర్లలో 97 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ముంబై ఇండియన్స్ 14. ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.


98 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి కూడా ఆరంభంలో కష్టాలు ఎదురయ్యాయి. కేవలం 33 పరుగులకే ఎంఐ నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో తిలక్ వర్మ (34 నాటౌట్: 32 బంతుల్లో, నాలుగు ఫోర్లు), హృతిక్ షౌకీన్ (18: 23 బంతుల్లో, రెండు ఫోర్లు) ముంబైని ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 48 పరుగులు జోడించారు. విజయానికి కొద్ది దూరంలో షౌకీన్ అవుటయినా... టిమ్ డేవిడ్ (16 నాటౌట్: 7 బంతుల్లో, రెండు సిక్సర్లు) రెండు సిక్సర్లతో మ్యాచ్ ముగించాడు. చెన్నై బౌలర్లలో ముకేష్ చౌదరి మూడు వికెట్లు తీయగా... సిమర్ జిత్ సింగ్, మొయిన్ అలీలకు చెరో వికెట్ దక్కింది.