IPL 2022 lsg never win against rr, rcb, gt in league stage will they create new records: ఐపీఎల్ అంటేనే రికార్డులకు నెలవు! ప్రతి సీజన్లో ఎన్నో రికార్డులు బద్దలవుతుంటాయి. సరికొత్తగా పుట్టుకొస్తుంటాయి. బహుశా ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలోనే ఇలాంటి విచిత్రమైన పరిస్థితిని మాత్రం అభిమానులు ఊహించి ఉండరు. నాకౌట్ స్టేజ్‌కు చేరుకున్న నాలుగు జట్లలో ఒకటి లీగ్ స్టేజ్‌లో మిగిలిన ముగ్గురు ప్రత్యర్థులపై గెలవనే లేదు. అదే లక్నో సూపర్ జెయింట్స్! మరి లీగ్ స్టేజ్‌లో ఓటమి పాలైన రాహుల్ సేన నాకౌట్ స్టేజ్‌లో వారిని ఓడించి సరికొత్త ఘనత అందుకుంటుందా!!
ఐపీఎల్ 2022లో కొత్తగా వచ్చిన లక్నో సూపర్‌జెయింట్స్ 'సూపర్ డూపర్ హిట్' అయింది! గొప్ప జట్లను తోసిరాజని ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఐపీఎల్ 2022 మెగా వేలం నుంచే అంచనాలు పెంచేసింది. ప్రపంచ స్థాయి ఆల్‌రౌండర్లు, డిస్ట్రక్టివ్ ఓపెనింగ్ పెయిర్, తిరుగులేని బౌలింగ్ దళం ఉండటమే ఇందుకు కారణం. లీగ్ స్టేజ్‌లో 14 మ్యాచులాడితే 9 గెలిచి 18 పాయింట్లు సాధించింది. రాజస్థాన్‌తో పోలిస్తే నెట్ రేన్‌రేట్‌లో కాస్త వెనకబడటంతో మూడో స్థానంలో నిలిచింది. బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఈడెన్ గార్డెన్స్‌లో ఎలిమినేటర్లో తలపడుతోంది. వారిని ఓడించి మిగతా రెండు జట్లపై గెలిచి కప్ అందుకుంటే లక్నో సరికొత్త చరిత్రే సృష్టిస్తుంది.
ఐపీఎల్ 2022లో లక్నో సూపర్ జెయింట్స్ తన తొలి మ్యాచులో గుజరాత్ టైటాన్స్‌ను ఢీకొంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (0), డికాక్ (7) వెంటవెంటనే ఔటైనా 158 పరుగులు చేసింది. ప్రత్యర్థి 19.4 ఓవర్లకు లక్ష్యం ఛేదించడంతో 5 వికెట్ల తేడాతో ఓడింది. రెండో లీగ్‌లోనైతే మరీ ఘోరం! ఏకంగా 62 రన్స్ తేడాతో ఓడింది. ఇప్పుడు టైటాన్స్ ఫైనల్ చేరుకుంది.
నేడు ఎలిమినేటర్లో తలపడుతున్న రాయల్ ఛాలెంజర్స్ చేతిలోనూ సూపర్ జెయింట్స్ ఓటమి పాలైంది. డుప్లెసిస్ (96) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఆర్సీబీ 181 పరుగులు చేసింది. ప్రత్యర్థి తెలివిగా కట్టడి చేయడంతో లక్నో బదులుగా 163/8 పరుగులే చేసింది. 18 పరుగుల తేడాతో ఓడింది.
నాకౌట్ స్టేజ్‌కు కొన్నిరోజుల ముందు రాజస్థాన్ రాయల్స్‌తో లక్నో తలపడింది. మొదట రాయల్స్ 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఛేదనలో రాహుల్ సేన తడబడింది. 29 పరుగులకే టాప్3 వికెట్లను పోగొట్టుకొని కష్టాల్లో పడింది. 24 పరుగుల తేడాతో ఓడిపోయింది. క్వాలిఫయర్ 1లో గుజరాత్ చేతిలో ఓడిన రాజస్థాన్ క్వాలిఫయర్ 2 కోసం ఎదురు చూస్తోంది. అందుకే ఈ మూడు జట్లను ఓడించి కప్ గెలిస్తే లక్నో రికార్డును మరెవ్వరూ బద్దలుకొట్టలేరు!!
- రామకృష్ణ పాలాది