LSG vs RCB, Eliminator: ఐపీఎల్‌ 2022లో రెండో నాకౌట్‌ గేమ్‌కు అంతా రెడీ! ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగే ఎలిమినేటర్‌ మ్యాచులో లక్నో సూపర్‌ జెయింట్స్‌ (LSG), రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) తలపడుతున్నాయి. ఓడిపోతే మరో ఛాన్స్‌ ఉండదు కాబట్టి రెండు జట్లూ నువ్వా నేనా అన్నట్టుగా బరిలోకి దిగుతాయి. మరి వీరిలో గెలిచేదెవరు? తుది జట్లలో ఎవరుంటారు? పైచేయి ఎవరిది?


LSG స్వేచ్ఛగా ఆడితేనే!


ఎలిమినేటర్‌ అంటేనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది! దానిని చక్కగా ఎదుర్కొన్న వారే విజయం అందుకుంటారు. లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఈ విషయంలో కాస్త వీక్‌గా ఉంది. ఆల్‌రౌండర్లతో కూడిన ఆ జట్టు ఛేదనలో బోల్తా పడుతోంది. ఛేజింగ్‌కు దిగిన చివరి ఆరు లీగు మ్యాచుల్లో కేవలం రెండింట్లోనే గెలిచారు. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (48.8 సగటుతో 537 పరుగులు), క్వింటన్‌ డికాక్‌ (38.6 సగటుతో 502 పరుగులు), దీపక్‌ హుడా (31.2 సగటుతో 406 పరుగులు) కీలకంగా ఉన్నారు. మిగతా వాళ్లు కొట్టింది 17.2 సగటుతో 789 మాత్రమే. అందుకే ఈ మ్యాచులో టాప్‌-3 కచ్చితంగా రాణించాలి. మార్కస్‌ స్టాయినిస్‌, జేసన్‌ హోల్డర్‌ మెరుపులు మెరిపించాలి. మిడిలార్డర్‌ వీక్‌గా ఉన్నా లక్నో ప్లేఆఫ్స్‌ చేరిందంటే బలమైన బౌలింగ్‌ లైనప్‌ ఉండటమే. గాయంతో దూరమైన కృనాల్‌ వస్తే జట్టు మరింత బలపడుతుంది. ఈడెన్‌ పిచ్‌పై మెంటార్‌ గౌతమ్‌ గంభీర్‌ వ్యూహాలు కీలకంగా మారతాయి.


RCBలో కోహ్లీ, మాక్సీ కీలకం!


ప్లేఆఫ్స్‌ చేరుకొనేందుకు ఆర్సీబీ ఇతర జట్లపై ఆధారపడింది. దిల్లీ ఓటమి పాలవ్వడంతో నాకౌట్‌కు వచ్చింది. ఇక నుంచి తమను తామే నమ్ముకోవాలి. కింగ్‌ విరాట్‌ కోహ్లీ ఫామ్‌లోకి రావడం శుభసూచకం. కెప్టెన్‌ డుప్లెసిస్‌, మాక్స్‌వెల్‌, దినేశ్‌ కార్తీక్‌ బ్యాటింగ్‌లో రాణిస్తే తిరుగుండదు. బౌలింగ్‌ పరంగా జోష్‌ హేజిల్‌వుడ్‌, మహ్మద్‌ సిరాజ్‌ ఇంకా మెరుగ్గా ఆడాలి. స్పిన్‌ డిపార్ట్‌ మెంట్‌ బలంగా ఉంది. మాక్స్‌వెల్‌కు ఫింగర్‌ స్పిన్నర్ల వీక్‌నెస్‌ ఉంది. అతడిపై కృనాల్‌ను ప్రయోగించే అవకాశం ఉంది. చేతి గాయంతో ఉన్న హర్షల్‌ పటేల్‌ ఫిట్‌నెస్‌ సాధించాడని అంటున్నారు. లేదంటే ఆకాశ్‌ దీప్‌ ఆడాల్సి వస్తుంది. కేఎల్‌ రాహుల్‌పై మాక్సీకి మంచి రికార్డు ఉండటం సానుకూల అంశం. లీగ్‌ దశలో లక్నోను ఓడించడం మరో ప్లస్‌ పాయింట్‌.


Eden Gardensలో టాసే కింగ్‌!


ఈడెన్‌ గార్డెన్స్‌లో గత నాలుగేళ్లలో 16 ఐపీఎల్‌ మ్యాచులు జరిగాయి. టాస్‌ గెలిచిన ప్రతి కెప్టెన్‌ బౌలింగే ఎంచుకున్నాడు. అందులో తొమ్మిది మంది విజయాలు సాధించారు. తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 183. సెకండాఫ్‌లో డ్యూ వస్తుంది కాబట్టి బంతిపై గ్రిప్‌ దొరకదు. ఇది బౌలింగ్‌ జట్టుకు ప్రతికూలంగా మారనుంది. ఐపీఎల్‌ 2022 క్వాలిఫయర్‌ వన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ను ఇదే ఓడించింది. మంచి బౌలర్లు, భారీ టార్గెట్‌ ఉన్నా బంతిపై గ్రిప్‌ దొరకలేదు.


LSG vs RCB Probable XI


రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: డుప్లెసిస్‌, విరాట్‌ కోహ్లీ, రజత్‌ పాటిదార్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మహిపాల్‌ లోమ్రర్‌, దినేశ్‌ కార్తీక్‌, షాబాజ్‌ అహ్మద్‌, వనిందు హసరంగ, హర్షల్‌ పటేల్‌ / ఆకాశ్‌దీప్‌, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్‌ సిరాజ్


లక్నో సూపర్‌ జెయింట్స్‌: క్వింటన్ డికాక్‌, కేఎల్‌ రాహుల్‌, దీపక్‌ హుడా, కృనాల్‌ పాండ్య, ఆయుష్ బదోనీ, మార్కస్‌ స్టాయినిస్‌, జేసన్‌ హోల్డర్‌, ఆవేశ్ ఖాన్‌, దుష్మంత చమీరా, మొహిసిన్ ఖాన్‌, రవి బిష్ణోయ్‌