GT vs RR, Qualifier 1 Highlights: గుజరాత్ టైటాన్స్ అద్భుతం చేసింది. టేబుల్ టాపర్‌గా నిలవడం గాలివాటం కాదని నిరూపించింది. ఐపీఎల్ 2022 ఫైనల్ చేరిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్ల తేడాతో ఛేదించింది. డేవిడ్ మిల్లర్ (68 నాటౌట్; 38 బంతుల్లో 3x4 5x6) కెప్టెన్ హార్దిక్ పాండ్య (40 నాటౌట్; 27 బంతుల్లో 5x4) అదరగొట్టారు. అంతకు ముందు రాజస్థాన్‌లో జోస్ బట్లర్ (89; 56 బంతుల్లో 5x4 3x6) దంచికొట్టాడు. కెప్టెన్ సంజు శాంసన్ (47; 26 బంతుల్లో 5x4 3x6), దేవదత్ పడిక్కల్ (28; 20 బంతుల్లో 2x4 2x6) రాణించారు.
గెలిపించిన కిల్లర్ హార్దిక్
కొత్తగా ఆడుతున్న పిచ్. ఎదురుగా 189 పరుగుల భారీ టార్గెట్. ఇన్నింగ్స్ రెండో బంతికే ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (0) ఔట్. ట్రెట్ బౌల్ట్ బంతిని చక్కగా స్వింగ్ చేస్తున్నాడు. అయినప్పటికీ గుజరాత్ టైటాన్స్ తలొగ్గలేదు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (35; 21 బంతుల్లో 5x4, 1x6), వన్‌డౌన్‌లో వచ్చిన మాథ్యూవేడ్ (35; 30 బంతుల్లో 6x4) నువ్వా నేనా అన్నట్టుగా ఆడారు. వరుస పెట్టి బౌండరీలు దంచారు. దాంతో పవర్ ప్లే ముగిసే సరికే స్కోరు 64/1కు చేరుకుంది. జోరుమీదున్న గిల్ అనవసర పరుగుకు ప్రయత్నించి జట్టు స్కోరు 72 వద్ద ఔటయ్యాడు. మరికాసేపటికే మెకాయ్ బౌలింగ్ పెద్ద షాట్ ఆడుతూ వేడ్ పెవిలియన్ చేరాడు.
ఈ సిచ్యువేషన్‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్య, కిల్లర్ మిల్లర్ జట్టును ఆదుకున్నారు. డ్యూ ఫ్యాక్టర్‌ను తమకు అనుకూలంగా మలుచున్నారు. వీరిద్దరూ 61 బంతుల్లోనే 106 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. దొరికిన బంతిని బౌండరీకి పంపిస్తూ రన్‌రేట్‌ను అదుపులో పెట్టారు. దాంతో 16.1 ఓవర్లలో గుజరాత్ 150కి చేరుకుంది. సమీకరణం ఆఖరి 12 బంతుల్లో 23 పరుగులుగా 19వ ఓవర్లో మెకాయ్ 7 పరుగులే ఇచ్చి టెన్షన్ పెట్టాడు. అయితే ప్రసిద్ధ్ వేసిన ఆఖరి ఓవర్లో కిల్లర్ మిల్లర్ హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. టైటాన్స్‌ను సగర్వంగా ఫైనల్ చేర్చేశాడు.
సంజు, బట్లర్ బాదుడు
కెప్టెన్ సంజు శాంసన్ టాస్ ఓడిపోవడంతో ఎప్పట్లాగే రాజస్థాన్ తొలుత బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చింది. ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ (3; 8 బంతుల్లో) జట్టు స్కోరు 11 వద్దే యశ్ దయాల్ బౌలింగ్‌లో పెవిలిన్‌కు వెళ్లాడు. మరోవైపు జోస్ బట్లర్ అత్యంత నెమ్మదిగా ఆడటంతో సంజు అగ్రెసివ్‌గా ఆడాడు. క్రీజులో నిలబడి అలవోకగా సిక్సర్లు, బౌండరీలు దంచాడు. రెండో వికెట్‌కు 47 బంతుల్లో 68 పరుగుల భాగస్వామ్యం అందించాడు దాంతో పవర్‌ప్లేలో రాజస్థాన్ 55 పరుగులు చేసింది. పదో ఓవర్ ఆఖరి బంతికి సంజూను సాయి కిషోర్ ఔట్ చేసి గుజరాత్‌కు బ్రేక్ ఇచ్చాడు. దూకుడుగా ఆడుతున్న దేవదత్ పడిక్కల్‌ను జట్టు స్కోరు 116 వద్ద హార్దిక్ పాండ్య బౌల్డ్ చేయడంతో స్కోరువేగం తగ్గింది. రషీద్ ఖాన్ అస్సలు బౌండరీలు కొట్టనివ్వలేదు. 16 ఓవర్లకు రాయల్స్ 127/3తో నిలిచింది. ఆ తర్వాత 2 ఓవర్లలో బట్లర్ 7 బౌండరీలు కొట్టడటంతో స్కోరు 159/3కి చేరింది. ఆ తర్వాతా అదే జోరు కొనసాగించడంతో రాజస్థాన్ 188/6కు చేరుకుంది.