WT20 Challenge 2022, SNO vs VEL: వుమెన్స్ టీ20 ఛాలెంజ్ 2022 రెండో మ్యాచులో వెలాసిటీ అద్భుత విజయం సాధించింది. సూపర్ నోవాస్ నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లకే 7 వికెట్ల తేడాతో ఛేదించింది. ఈ మ్యాచులో వెలాసిటీ తరఫున అరంగేట్రం చేసిన మిస్టరీ స్పిన్నర్ మాయా సొనావనె (Maya Sonawane) అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆమె బౌలింగ్ చాలా విచిత్రంగా ఉండటమే ఇందుకు కారణం. కొన్నేళ్ల క్రితం గుజరాత్ లయన్స్‌కు ఆడిన శివిల్ కౌషిక్, దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ పాల్ ఆడమ్స్‌ను ఆమె గుర్తుకు తెచ్చింది.
ఈ మ్యాచులో మాయ 2 ఓవర్లు వేసి 19 పరుగులు ఇచ్చింది. ఈ లెగ్ స్పిన్నర్ దేశవాళీ క్రికెట్లో మహారాష్ట్ర తరఫున ఆడుతుంది. ఈ సీజన్లో వెలాసిటీ తరఫున టీ20 క్రికెట్లో అరంగేట్రం చేసింది. టీమ్‌ఇండియాకు ఆడకుండానే వుమెన్స్ టీ20 ఛాలెంజ్ ఆడిన ఎనిమిదో అమ్మాయిగా రికార్డు సృష్టించింది. సీనియర్ వుమెన్స్ టీ20 టోర్నీలో ఆమె అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఎనిమిది మ్యాచుల్లో కేవలం 1 ఎకానమీ రేటుతో 11 వికెట్లు తీసింది. రెండుసార్లు నాలుగు వికెట్ల ఘనత అందుకుంది.
వెలాసిటీ తరఫున మొదటి బంతి వేయగానే ఆమె బౌలింగ్ యాక్షన్ విచిత్రంగా అనిపించింది. వికెట్ల నుంచి స్వల్ప దూరం నుంచే అడుగులు వేస్తూ తలను అడ్డంగా వంచుతూ 90 డిగ్రీల కోణంలో చేతిని తిప్పుడూ బంతిని స్పిన్ చేస్తోంది. బంతిని రిలీజ్ చేసేటప్పుడు ఆమె బంతిని చూడటమే లేదు. దాంతో బ్యాటర్ కన్ఫూజ్ అవుతున్నారు. వికెట్ ఇచ్చేస్తున్నారు. ఈ మ్యాచులో మాత్రం హర్మన్ భీకరమైన షాట్లు ఆడటంతో పరుగులు ఇచ్చాయి. మొత్తానికి తన బౌలింగ్ శైలితో మాయ ట్విటర్లో ట్రెండ్ అవుతోంది.