IPL 2022, KKR vs PBKS: ఐపీఎల్‌ 2022లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkata Kinightrieders) రెండో విజయం సాధించింది. 4 పాయింట్లతో నంబర్‌వన్‌ పొజిషన్‌కు చేరుకుంది. పంజాబ్‌ కింగ్స్‌ (Punjab Kings) ఇచ్చిన 138 పరుగుల టార్గెట్‌ను 6 వికెట్ల తేడాతో సింపుల్‌గా ఛేదించింది. ఆండ్రీ రసెల్‌ (Andre Russesll) (70*; 31 బంతుల్లో 2x4, 8x6) విధ్వసం సృష్టించాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (26; 15 బంతుల్లో 5x4) రాణించారు. అంతకు ముందు పంజాబ్‌లో రాజపక్స (31; 9 బంతుల్లో 3x4, 3x6), రబాడా (25; 16 బంతుల్లో 4x4, 1x6) ఫర్వాలేదనిపించారు.


రసెల్‌ మజిల్‌ పవర్‌తో గెలిచిన KKR 


ముందున్న టార్గెట్‌ తక్కువే కాబట్టి కోల్‌కతా 15 ఓవర్లలో ఛేదిస్తుందని అనుకున్నారు. ఆండ్రీ రసెల్‌ డిస్ట్రక్టివ్‌ బ్యాటింగ్‌తో అది సాధ్యమైంది. పంజాబ్‌ బౌలర్లు మొదట వికెట్లు తీసి పరుగులను నియంత్రించినా అతడి ముందు వారి ఆటలు సాగలేదు. జట్టు స్కోరు 14 వద్దే అజింక్య రహానె (12)ను రబాడా ఔట్‌ చేశాడు. మరికాసేపటికే వెంకటేశ్‌ అయ్యర్‌ (3)ను ఒడీన్‌ స్మిత్‌ పెవిలియన్‌కు పంపించాడు. అయితే కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ సునాయాసంగా బౌండరీలు బాదేసి 6 ఓవర్లకే స్కోరు 50 దాటించేశాడు. కానీ మరో పరుగుకే బాగా ఆడుతున్న అతడు లెగ్‌స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడబోయి ఔటయ్యాడు. మరో బంతి తేడాతో నితీశ్‌ రాణా (0) ఎల్బీ అయ్యాడు. కానీ సామ్‌ బిల్లింగ్స్‌ (24*; 23 బంతుల్లో 1x4, 1x6) అండతో కాసేపు నిలకడగా ఆడిన ఆండ్రీ రసెల్‌ ఆ తర్వాత రెచ్చిపోయాడు. వరుస సిక్సర్లు కొట్టి స్మిత్‌ వేసిన 12వ ఓవర్లో 30 పరుగులు సాధించాడు. దాంతో మ్యాచ్‌ కేకేఆర్‌ వైపు మళ్లింది. ఆ తర్వాత మరో 3 సిక్సర్లు కొట్టేసి 14.3 ఓవర్లకే మ్యాచ్‌ గెలిపించేశాడు.


ఆటాడుకున్న Umesh Yadav


వాంఖడే పిచ్‌లో తొలి బ్యాటింగంటే కష్టమే! పరిస్థితులను అనుకూలంగా మలుచుకొని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బౌలర్లు పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటర్లను వణికించారు. ముఖ్యంగా ఉమేశ్‌ యాదవ్‌ (4/23) స్పెల్‌ అద్భుతం. టిమ్‌సౌథీ (2/36)తో కలిసి అతడు ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. తొలి ఓవర్ ఆఖరి బంతికి మయాంక్‌ అగర్వాల్‌ (1)ను ఎల్బీ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చి హ్యాట్రిక్‌ సిక్సర్లు బాదిన భానుక రాజపక్స (31; 9 బంతుల్లో 3x4, 3x6)ను శివమ్‌ మావి పెవిలియన్‌ పంపించాడు. మరికాసేపటికే శిఖర్‌ ధావన్‌ (16)ను సౌథీ ఔట్‌ చేయడంతో పంజాబ్‌ కోలుకోలేదు. సగటున 10 పరుగులకు ఒక వికెట్‌ కోల్పోయింది. 


జట్టు స్కోరు 78 వద్ద లియామ్‌ లివింగ్‌స్టన్‌ (19)ను ఉమేశ్‌ ఔట్‌ చేశాడు. హర్‌ప్రీత్‌ బ్రార్‌ (14), రాహుల్‌ చాహర్‌ (0)ను ఔట్‌ చేసి డబుల్‌ వికెట్‌ మెయిడిన్‌తో అదరగొట్టాడు. ఆఖర్లో కాగిసో రబాడా (25; 16 బంతుల్లో 4x4, 1x6) బౌండరీలు కొట్టడంతో స్కోరు 120 దాటింది. జట్టు స్కోరు 137 వద్ద అతడిని రసెల్‌ ఔట్‌ చేశాడు. వెంటనే అర్షదీప్‌ (0) రనౌట్‌ అవ్వడంతో 18.2 ఓవర్లకే పంజాబ్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఒడీన్‌ స్మిత్‌ (9 నాటౌట్‌), షారుఖ్‌ (0) నిరాశపరిచారు.