KKR vs LSG Preview: ఐపీఎల్ 2022లో 66వ మ్యాచులో కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knightriders), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergiants) తలపడుతున్నాయి. డీవై పాటిల్ స్టేడియం (DY Patil Stadium) ఇందుకు వేదిక. ఈ సీజన్లో ఈ రెండు జట్లకు ఇదే చివరి లీగ్ మ్యాచ్. ఇందులో గెలిస్తే రాహుల్ సేన నేరుగా ప్లేఆఫ్స్ చేరుతుంది. అదే కేకేఆర్ గెలిస్తే ప్లేఆఫ్స్ సినారియో మరింత రసవత్తరంగా మారుతుంది. మరి వీరిలో ఎవరిది పైచేయి? తుది జట్లలో ఎవరుంటారు? గెలిచేదెవరు?
ఓడినా ఇబ్బందేం లేదు!
ఈ సీజన్లో 13 మ్యాచుల్లో 8 విజయాలు అందుకున్న లక్నో సూపర్‌జెయింట్స్ 16 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. నెట్ రన్‌రేట్ 0.262. కోల్‌కతా 13లో 6 గెలిచి 12 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. రన్‌రేట్ 0.106. ఈ మ్యాచులో గెలిస్తే రాహుల్ సేన 18 పాయింట్లతో ప్లేఆఫ్స్ చేరుకున్న రెండో జట్టుగా నిలుస్తుంది. ఒకవేళ ఓడిపోయినా ఫర్వాలేదు. అయితే నెట్ రన్‌రేటు తగ్గకుండా చూసుకోవాలి. అంటే 70 పరుగుల తేడాతో ఓడిపోకుంటే చాలు. తొలి 4లో ఉంటారు. శ్రేయస్ జట్టు పరిస్థితి అలా కాదు. ఇందులో గెలిచి 14 పాయింట్లు సాధించినా ప్లేఆఫ్స్ గురించి చెప్పలేం. ఇప్పటికే 14 పాయింట్లతో ఉన్న దిల్లీకి మెరుగైన రన్‌రేట్ ఉంది. ఇక కేకేఆర్‌తో ఆడిన తొలి మ్యాచులో లక్నో సూపర్ డూపర్ విక్టరీ అందుకుంది.
డిఫెన్సివ్ బ్యాటింగ్ వద్దు
మెరుగైన వనరులే ఉన్నా సద్వినియోగం చేసుకోలేక సూపర్ జెయింట్స్ ఇబ్బంది పడుతోంది. ఇన్‌స్వింగర్లకు ఇబ్బంది పడుతున్న కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) త్వరగా వికెట్ ఇచ్చేస్తున్నాడు. లేని ఒత్తిడిని కొని తెచ్చుకుంటున్నాడు. డికాక్ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. వీరిద్దరూ మంచి ఓపెనింగ్ ఇస్తే సూపర్‌జెయింట్స్‌కు విజయాలు లభిస్తున్నాయి. మిడిలార్డర్లో దీపక్ హుడా తప్ప మిగిలిన వాళ్లు ఫామ్‌లో లేరు. స్టాయినిస్ ఒకట్రెండు మ్యాచుల్లో బాగా ఆడాడు. బౌలింగ్ పరంగా మాత్రం లక్నో బాగుంది. ప్రత్యర్థిని చక్కగానే కంట్రోల్ చేస్తోంది. మొహిసిన్, అవేశ్ ఖాన్, దుష్మంత చమీరా, జేసన్ హోల్డర్ బౌలింగ్ అద్భుతంగా ఉంది. డిఫెన్సివ్ బ్యాటింగ్ అప్రోచ్ వారి కొంప ముంచుతోంది.
షార్ట్ లెంగ్త్‌కు బలి
ఈ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఏకంగా ఐదుసార్లు ఓపెనింగ్ జోడీని మార్చింది. మొదట్నుంచి ఒకే జోడీకి కట్టుబడితే బాగుండేది. ఇప్పుడు రహానె గాయపడటంతో మరొకరితో ప్రయోగం చేయక తప్పదు. కేకేఆర్ బ్యాటర్లంతా షార్ట్‌పిచ్, షార్ట్‌పిచ్ గుడ్‌లెంగ్త్ బంతులకు ఔటైపోతున్నారు. చివరి మ్యాచులో లక్నో ఇదే అస్త్రాన్ని ప్రయోగించింది. ఇప్పుడూ అదే చేయనుంది. వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా, శ్రేయస్ అయ్యర్ ఈ బంతుల్ని ఆడలేకపోతున్నారు. మిగతా బ్యాటర్లూ ఫామ్‌లో లేరు. రసెల్ కాసేపు భయపెడుతున్నా మ్యాచ్ విన్నింగ్ నాక్స్ రావడం లేదు. బౌలింగ్ మాత్రం చాలా బాగుంది. సౌథీ, ఉమేశ్, రసెల్ పేస్‌తో కట్టడి చేస్తున్నారు. చక్రవర్తి ఫామ్‌లో లేనప్పటికీ నరైన్ మాత్రం దుమ్మురేపుతున్నాడు.
KKR vs LSG Probable XI
కోల్‌కతా నైట్‌రైడర్స్: బీ ఇంద్రజిత్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, నితీశ్ రాణా, సామ్ బిల్లింగ్స్, రింకూ సింగ్, ఆండ్రీ రసెల్, సునిల్ నరైన్, ఉమేశ్ యాదవ్, టిమ్ సౌథీ, వరుణ్ చక్రవర్తి
లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్, దీపక్ హుడా, కృనాల్ పాండ్య, మార్కస్ స్టాయినిస్, ఆయుష్ బదోనీ, జేసన్ హోల్డర్, అవేశ్ ఖాన్, మొహిసిన్ ఖాన్, రవి బిష్ణోయ్, దుష్మంత చమీరా