KKR batter ajinkya rahane shines in csk match: ఐపీఎల్ 2022 సీజన్ (IPL 2022) తొలి మ్యాచులో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం అందుకుంది. ప్రత్యర్థి చెన్నై సూపర్‌కింగ్స్ (Chennai Super kings) నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఛేజింగ్‌లో కేకేఆర్ ఓపెనర్ అజింక్య రహానె (Ajinkya Rahane) చూపించిన తెగువ అందరికీ నచ్చింది. క్రీజులో ఉన్నంత సేపు అతడితో ఏదో కసి కనిపించింది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి!
వాంఖడే వేదికగా జరిగిన మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. మహేంద్ర సింగ్ ధోనీ (50 నాటౌట్: 38 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా 18.3 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి ఛేదించింది. కోల్‌కతా బ్యాటర్లలో అజింక్య రహానే (44: 34 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
చాలామంది అజింక్య రహానెను టెస్టు బ్యాటర్‌గా ముద్రవేస్తారు. అతడి బ్యాటింగ్‌లో దూకుడు ఉండదని భావిస్తారు. నిజానికి అతడికి దూకుడైన మనస్తత్వం! అది అతడి బాడీ లాంగ్వేజ్‌లో కనిపించదు. ఆడే షాట్లలో, పోరాడే మనస్తత్వంలో ఉంటుంది. ఈ సీజన్‌కు ముందు అతడు టీమ్‌ఇండియాలో చోటు కోల్పోయాడు. కొన్నేళ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్లో తీసుకోవడమే లేదు. ఇక ఈ సీజన్ వేలానికి ముందు అతడిని తీసుకోవడానికి ఎవరూ మొగ్గు చూపలేదు. కనీస ధరకు కోల్‌కతా దక్కించుకుంది.
ఈ సీజన్లో అజింక్య రహానెకు కలిసొచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మొదటిది అతడు ముంబయి నగరానికి చెందినవాడు. రంజీల్లో ముంబయికే ఆడతాడు. ఇక్కడి పరిస్థితులుపై పూర్తి అవగాహన ఉంది. రెండు వాంఖడే పిచ్ ఎప్పుడెలా ప్రవర్తిస్తుందో అతడికి బాగా తెలుసు. రెండో బ్యాటింగ్‌లో డ్యూ ఫ్యాక్టర్ ఉంటుందన్న సంగతి బాగా ఎరుకే. ఇక మూడోది టీ20 లేదా వన్డేల్లో అతడు ఓపెనింగ్‌ను ఇష్టపడతాడు. ఓపెనర్‌గా అతడికి బాగానే రికార్డులు ఉన్నాయి. ఇవన్నిటినీ మించి దూకుడుగా ఆడాలని కేకేఆర్ కోచ్ మెక్‌కలమ్ అందరికీ మెసేజ్ ఇచ్చాడు. పైగా తనను తాను నిరూపించుకోవాలన్న కసి ఎప్పట్నుంచో ఉంది. ఇప్పుడు అన్ని అవకాశాలు కలిసి రావడంతో రహానె బాగా ఉపయోగించుకున్నాడు. కసిగా పరుగులు చేశాడు. బౌండరీలు బాదాడు. ఈ సీజనంతా ముంబయి, పుణెలోనే మ్యాచులు జరుగుతాయి కాబట్టి అతడి బ్యాటు నుంచి మరిన్ని మెరుపుల్ని ఆశించొచ్చు.