ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్... చెన్నై సూపర్ కింగ్స్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. మహేంద్ర సింగ్ ధోని (50 నాటౌట్: 38 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా 18.3 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి ఛేదించింది. కోల్‌కతా బ్యాటర్లలో అజింక్య రహానే (44: 34 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అదరగొట్టిన ధోని
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి శుభారంభం దక్కలేదు. ఫాంలో ఉన్న ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (0: 4 బంతుల్లో) మొదటి ఓవర్లోనే డకౌటయ్యాడు. క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బందిగా కనిపించిన డెవాన్ కాన్వే (3: 8 బంతుల్లో) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. దీంతో చెన్నై 28 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాత రాబిన్ ఊతప్ప (28: 21 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు), అంబటి రాయుడు (15: 17 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) కాసేపు నిలకడగా ఆడారు. కానీ వరుస ఓవర్లలో వీరిద్దరూ అవుటయ్యారు. ఆ తర్వాత ఇన్నింగ్స్ 11వ ఓవర్లో శివం దూబే కూడా అవుట్ కావడంతో చెన్నై 61 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ దశలో రవీంద్ర జడేజా (26 నాటౌట్: 28 బంతుల్లో, ఒక సిక్సర్), మహేంద్ర సింగ్ ధోని (50 నాటౌట్: 38 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) ఇద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. అయితే వీళ్లు మొదట్లో మరీ జాగ్రత్తగా ఆడటంతో రన్ రేట్ ఒక దశలో ఐదు కంటే తక్కువకు పడిపోయింది. అయితే స్లాగ్ ఓవర్లలో ధోని చెలరేగాడు. దీంతో చెన్నై చివరి మూడు ఓవర్లలో 41 పరుగులు చేసింది. చివరి ఓవర్లో ధోని అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 2019 తర్వాత ధోని ఐపీఎల్‌లో అర్థ శతకం సాధించడం ఇదే మొదటిసారి. 20 ఓవర్లలో చెన్నై ఐదు వికెట్లు నష్టపోయి 131 పరుగులు చేసింది. ధోని, జడేజా ఆరో వికెట్‌కు అభేద్యంగా 70 పరుగులు జోడించారు. కోల్‌కతా బౌలర్లలో ఉమేష్ రెండు వికెట్లు దక్కించుకోగా... వరుణ్ చక్రవర్తి, రసెల్‌లకు చెరో వికెట్ దక్కింది.
ఆడుతూ పాడుతూ...
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు లక్ష్య చేదనలో అడ్డంకులు ఎదురుకాలేదు. పవర్ ప్లేలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా కోల్‌కతా 43 పరుగులు చేసింది. ఓపెనర్లు అజింక్య రహానే (44: 34 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్), వెంకటేష్ అయ్యర్ (16: 16 బంతుల్లో, ఒక ఫోర్) చెన్నై బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు. అయితే ఏడో ఓవర్లో వెంకటేష్ అయ్యర్‌ను అవుట్ చేసి బ్రేవో చెన్నైకి తొలి వికెట్ అందించాడు.
లక్ష్యం ఎక్కువ లేకపోవడంతో కోల్‌కతాకు పెద్దగా ఒత్తిడి కూడా ఎదురవలేదు. నితీష్ రాణా (21: 17 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), శామ్ బిల్లింగ్స్ (25: 22 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) రాణించారు. చివర్లో శ్రేయస్ అయ్యర్ (20 నాటౌట్: 19 బంతుల్లో, ఒక ఫోర్) మ్యాచ్‌ను ముగించాడు. చెన్నై బౌలర్లలో బ్రేవోకు మూడు వికెట్లు దక్కగా... మిషెల్ శాంట్నర్ ఒక వికెట్ తీశాడు.