GT vs MI: ఐపీఎల్ 2022లో 51వ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) తలపడుతున్నాయి. బ్రబౌర్న్ మైదానం (Brabourne) ఇందుకు వేదిక. టేబుల్ టాపర్స్ టైటాన్స్‌లో ఫామ్ లేమి కనిపిస్తోంది. ఆఖర్లో నిలిచిన ముంబయి పరువు నిలుపుకోవాలన్న తాపత్రయంతో ఉంది. మరి వీరిలో ఏది మెరుగైన జట్టు? తుది జట్లలో ఎవరుంటారు? గెలిచేదెవరు?
వీళ్లు 1.. వాళ్లు 8
ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ అంచనాలను అధిగమించి టేబుల్ టాపర్‌గా నిలిచింది. 10 మ్యాచుల్లో 8 గెలిచి 2 మాత్రమే ఓడింది. 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌ను దాదాపుగా ఖాయం చేసుకుంది. ఇక ముంబయి ఇండియన్స్ 9 ఆడితే వరుసగా 8 ఓడిపోయింది. రీసెంటుగా 1 గెలిచి బోణీ కొట్టింది. ఇక ఆ జట్టు ఆడేది ఐదు మ్యాచులే. అన్నీ ఆడినా ప్లేఆఫ్స్ చేరుకోవడం కష్టం. అందుకే వీలైనంత వరకు అందరు ఆటగాళ్లను పరీక్షించే అవకాశం ఉంది.
హార్దిక్, గిల్ ఫామ్ కీలకం
గుజరాత్ టైటాన్స్ గెలుపునకు దాదాపుగా మిడిలార్డరే కారణం. ఆఖరి ఓవర్లలో మ్యాచులను ముగిస్తుండటం ప్లస్ పాయింట్. వాస్తవంగా టైటాన్స్ బ్యాటింగ్ డెప్త్‌లో కొన్ని వీక్‌నెస్‌లు కనిపిస్తున్నాయి. కెప్టెన్ హార్దిక్ పాండ్య, ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వరుసగా విఫలమవుతున్నారు. వీరిద్దరూ రాణించడం ముఖ్యం. వృద్ధిమాన్ సాహా దూకుడుగా ఆడుతుండటం శుభ పరిణామం. డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్ త్రయమే ఇప్పటి వరకు విజయాలు అందించింది. చివరి మ్యాచులో వీరిని పంజాబ్ అడ్డుకొని సక్సెస్ అయింది. గాయపడిన సాయి కిషోర్ స్థానంలో అభినవ్ మనోహర్ లేదా విజయ్ శంకర్ రావొచ్చు. టైటాన్స్ బౌలింగ్‌కు తిరుగులేదు.
సూర్య ఒక్కడే
ముంబయి ఇండియన్స్ ఓటములకు ప్రధాన కారణం బౌలింగ్ లోపాలే! జస్ప్రీత్ బుమ్రాకు అండగా ఎవ్వరూ నిలవడం లేదు. దాంతో ప్రత్యర్థులు అతడిని గౌరవిస్తూ మిగతా వాళ్లపై ఎదురుదాడి చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచుల్లో కనీసం రెండు ఓవర్లలో 20+ పరుగులు ఇచ్చారు. అవే ఓటములకు కారణంగా మారాయి. అందుకే బౌలింగ్‌లో ప్రయోగాలు చేయొచ్చు. ఓపెనర్ రోహిత్, ఇషాన్ కిషన్ రాణించాల్సిన అవసరం ఉంది. సూర్యకుమార్, తిలక్ వర్మ, నిలకడగా రాణిస్తున్నారు. మిగతా వాళ్లు స్థాయికి తగ్గట్టు ఆడాల్సి ఉంది.
GT vs MI Probable XI
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్య, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ షమి, ప్రదీప్ సంగ్వాన్ / యశ్ దయాల్
ముంబయి ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, డేనియెల్ సామ్స్, హృతిక్ షోకీన్, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తీకేయ, రిలే మెరిడీత్