IPL 2022 first time MS Dhoni will play for CSK without Suresh Raina Ravindra Jadeja : ఐపీఎల్ చరిత్రలోనే ఎంఎస్ ధోనీ (MS Dhoni) తొలిసారి ఓ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఇన్నాళ్లూ తనకెంతో అండగా నిలిచిన ఇద్దరు లేకుండా తొలిసారి మ్యాచ్ ఆడుతున్నాడు. చిన్న తలా అని పిలుచుకొనే సురేశ్ రైనా, కీలక ఆటగాడైన రవీంద్ర జడేజా లేకుండా తొలి మ్యాచ్ ఆడబోతున్నాడు.
ఐపీఎల్ 2022లో గురువారం డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ ఐదుసార్లు ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌తో తలపడుతోంది. వాంఖడే ఇందుకు వేదిక. ఇప్పటికే వరుస ఓటములతో చతికిల పడ్డ సీఎస్‌కేకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఇక నుంచి అన్ని మ్యాచులు గెలిస్తే ధోనీసేనకు టెక్నికల్‌గా ప్లేఆఫ్ అవకాశాలు ఉంటాయి. అలాంటి టైమ్‌లో రవీంద్ర జడేజా వంటి విలువైన ఆటగాడు ఆ జట్టుకు దూరమయ్యాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచులో ఫీల్డింగ్ చేస్తుండగా రవీంద్ర జడేజా అప్పర్ బాడీకి గాయమైంది. దాంతో ఆ తర్వాతి జరిగిన దిల్లీ మ్యాచులో అతడికి విశ్రాంతినిచ్చారు. రెండు మూడు రోజులుగా జడ్డూ గాయాన్ని సీఎస్‌కే వైద్యబృందం జాగ్రత్తగా పర్యవేక్షిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా గాయం నయం కాలేదు. దాంతో అతడిని ఐపీఎల్ 2022 నుంచి తప్పిస్తున్నట్టు సీఎస్‌కే అధికారికంగా ప్రకటించింది. ఈ సీజన్ వేలంలో సురేశ్ రైనాను ఆ జట్టు కొనుగోలు చేయలేదు. కొన్నేళ్లుగా సేవలందించిన అతడిని పక్కన పెట్టేసింది.
రైనా, జడ్డూ లేకుండా ధోనీ సీఎస్‌కేను నడిపిస్తుండటం ఇదేతొలిసారి. 2008 నుంచి రైనా జట్టుకు మూలస్తంభంగా మారిపోయాడు. మొదట రాజస్థాన్‌కు ఆడిన జడ్డూను కొంత కాలం తర్వాత ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. అప్పట్నుంచి వీరిద్దరూ జట్టులో కీలకంగా మారిపోయారు. ఎవరున్నా లేకపోయినా రైనా, జడ్డూను ధోనీ తీసుకుంటాడు. ఎప్పుడో ఒకసారి వీరిలో ఎవరో ఒకరు ఉండరు. 2020 సీజన్లో రైనా మొత్తంగా అందుబాటులో లేడు. అలాంటిది ఈ సీజన్లో ఒకే సారి ఇద్దరూ లేకుండా పోయారు.
గతేడాది చెన్నై సూపర్‌కింగ్స్ ఐపీఎల్ గెలవడంలో రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. 16 మ్యాచుల్లో 75 సగటు, 145 స్ట్రైక్‌రేట్‌తో 227 పరుగులు చేశాడు. అలాగే 26 సగటు, 7.06 ఎకానమీతో 13 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. 10 మ్యాచుల్లో 19 సగటు, 118 స్ట్రైక్‌రేట్‌తో 116 పరుగులు చేశాడు. బంతితోనూ రాణించలేదు. 5 వికెట్లే పడగొట్టాడు.