IPL 2022 CSK Unfollow Ravindra Jadeja On Instagram Amid Rift Rumours Report : డిఫెండింగ్ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ (Chennai Superkings)లో ముసలం పుట్టింది! రవీంద్ర జడేజా (Ravindra Jadeja), ఎంఎస్‌ ధోనీ (MS Dhoni), ఫ్రాంచైజీ (CSK) మధ్యన విభేదాలు భగ్గుమన్నాయని సమాచారం. ఉద్దేశపూర్వకంగానే జడ్డూను ఐపీఎల్‌ నుంచి బయటికి పంపించారని అభిమానులు ఆరోపిస్తున్నారు. సీఎస్‌కే ఫ్రాంచైజీ ఇన్‌స్టాగ్రామ్‌లో జడేజాను అన్‌ఫాలో కావడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు.


ప్రపంచం మెచ్చిన ఆల్‌రౌండర్లలో రవీంద్ర జడేజా ఒకడు. పదేళ్లుగా అతడు చెన్నై సూపర్‌కింగ్స్‌కు సేవలు అందిస్తున్నాడు. రెండేళ్లుగా బ్యాటింగ్‌, బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. జట్టు విజయాల్లో కీలకంగా మారాడు. అలాంటిది అతడి నుంచి సీఎస్‌కే ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో అయిందన్న వార్తలు సంచలనంగా మారాయి. ఆటగాళ్లను ఎంతగానో నమ్మే, వెన్నుతట్టే యాజమాన్యం అతడిపై ఆగ్రహంగా ఉందా? విభేదాలు వచ్చాయా? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


ఈ సీజన్‌కు ముందు రవీంద్ర జడేజా సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. రూ.16 కోట్లకు అతడిని సీఎస్‌కే రీటెయిన్‌ చేసుకుంది. ఎంఎస్ ధోనీ ఐపీఎల్‌ కెరీర్‌ చరమాంకంలో ఉండటంతో భవిష్యత్తు సారథిగా జడ్డూపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సీజన్లో మహీ ఉంటాడు కాబట్టి వచ్చే సీజన్లో అతడిని కెప్టెన్‌గా ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. తొలి మ్యాచుకు రెండు రోజుల ముందుగా అతడిని కెప్టెన్‌గా ప్రకటించారు. ఈ సారి సరైన ఆటగాళ్లు లేకపోవడంతో జట్టు వరుసగా ఓటముల పాలైంది. మరోవైపు జడ్డూ రాణించలేదు. బౌలింగ్‌, బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు.


సగం సీజన్‌ ముగిసిన తర్వాత జడ్డూ కెప్టెన్సీని మహీకి తిరిగి అప్పగించాడని యాజమాన్యం ప్రకటించింది. తన ఆటపై శ్రద్ధ పెట్టేందుకు జడ్డూనే ఈ నిర్ణయం తీసుకున్నాడని వెల్లడించింది. అప్పుడే అందరికీ అనుమానాలు వచ్చాయి. సాధారణంగా క్రికెట్లో ఏ స్థాయిలోనూ జడేజా కెప్టెన్సీ చేయలేదు. అలాంటప్పుడు అతడికి ఒకట్రెండు సీజన్లు అవకాశం ఇవ్వడం ధర్మం! విఫలమయ్యే ఆటగాళ్లకే పదేపదే ఛాన్సులిచ్చే సీఎస్‌కే అతడిని తొలగించింది! ఇక బెంగళూరు మ్యాచులో ఫీల్డింగ్‌ చేస్తూ జడ్డూ గాయపడ్డాడు. తీవ్రత తగ్గకపోవడంతో ముందు జాగ్రత్తగా అతడిని ఐపీఎల్‌ నుంచి తప్పిస్తున్నామని బుధవారం సీఎస్‌కే ప్రకటించింది. గతంలో అంతకన్నా ప్రమాదకరమైన ఫీల్డింగ్‌ ఫీట్లు చేసినప్పడే ఇబ్బంది పడని జడ్డూ ఇప్పుడెలా గాయపడ్డాడని చాలా మంది సందేహించారు.


గురువారం జడ్డూను సీఎస్‌కే అన్‌ఫాలో చేసిందని వార్తలు రాగానే అనుమానాలు మరింత బలపడ్డాయి. 'సీఎస్‌కే యాజమాన్యం, ఎంఎస్‌ ధోనీ కలిసి జడేజాతో ఛీప్‌ పాలిటిక్స్‌ చేశారు. కెప్టెన్‌గా అతడిని బలిపశువును చేశారు. సీజన్లో ఘోర ప్రదర్శనకు కారణంగా మార్చారు. ఆ తర్వాత అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించారు. ఆ తర్వాత జడ్డూ కెప్టెన్సీని ధోనీ విమర్శించాడు. ఆ తర్వాత సీఎస్‌కే అతడిని అన్‌ఫాలో చేసింది. ఇప్పుడు ఆ బెస్ట్‌ ప్లేయర్‌పై వేటు వేసింది. ఇది కచ్చితంగా జడ్డూను అవమానించడమే' అని ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు. 


'ఎదగడానికి కొంత సమయం పడుతుంది. కెప్టెన్సీ విషయంలోనూ అంతే. సాధారణంగా జడేజా నేచురల్‌ కెప్టెన్‌ కాదు. ఆ తర్వాత అతడు గాయపడ్డ వార్తలు వచ్చాయి. అంతా మిస్టరీగా ఉంది' అని మరో యూజర్‌ పోస్టు చేశాడు. మున్ముందు ఎలాంటి విషయాలు తెలుస్తాయోనని సీఎస్‌కే, జడ్డూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.