IPL 2022 Final: ఐపీఎల్ 2022 ఫైనల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తుండటంతో పటిష్ఠమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. వివిధ రాజకీయ కార్యక్రమాలు, ఫైనల్ నేపథ్యంలో అహ్మదాబాద్‌లో ఏకంగా 6000 మంది పోలీసులను మోహరిస్తున్నారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు పోలీసులు చాలా బిజీగా ఉండనున్నారు. వారితో పాటు రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ రిజర్వు పోలీస్ (SRP), ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF), ఇతర సెక్యూరిటీ ఏజెన్సీలను మోహరిస్తోంది. ఇప్పటికే కొన్ని పోలీస్ బృందాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి.
'శుక్రవారం నుంచి 17 మంది డీసీపీలు, నలుగురు డీఐజీలు, 28 మంది ఏసీపీలు, 51 మంది పోలీస్ ఇన్‌స్పెక్టర్లు, 268 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు, 5000 మందికి పైగా కాన్‌స్టేబుళ్లు, 1000 మందికి పైగా హోమ్ గార్డులు, మూడు కంపెనీల ఎస్‌ఆర్పీలు బందోబస్తులో ఉంటారు' అని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ సంజయ్ శ్రీవాత్సవ అన్నారు. ప్రధాని రాక నేపథ్యంలో మే28 మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 8 గంటల వరకు డ్రోన్లు ఎగరడాన్ని నిషేధిస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. పేలుడు పదార్థాలు, ఆయుధాలు, రాడ్లు, కర్రలు, కత్తులు, పదునైనా ఆయుధాలను నిషేధించారు.
ఐపీఎల్ మ్యాచుకు ముందు నగరంలోని కొందరు రౌడీ షీటర్లు, సంఘ విద్రోహ శక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 'సీఆర్పీసీ సెక్షన్ల కింద 38, పాసా చట్లం కింద 46 మందిని అదుపులోకి తీసుకున్నాం. చాంద్‌ఖేడా, సబర్మతి, మోతేరా ప్రాంతాల్లో పోలీసు పెట్రోలింగ్‌ను పెంచాం' అని శ్రీవాత్సవ తెలిపారు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ 2022 ఫైనల్‌ను నిర్వహించనున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అన్న సంగతి తెలిసిందే. రాత్రి 8 గంటలకు ఫైనల్ మొదలవుతుంది. క్వాలిఫయర్ 1 గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే మొతేరాకు చేరుకుంది. క్వాలిఫయర్ 2 కోసం రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిద్ధం అయ్యాయి. ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీసీసీఐ అధ్యక్ష కార్యదర్శులు సౌరవ్ గంగూలీ, జే షా ఇతర ప్రముఖులు వస్తున్నారు.