ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ తడబడింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. రొవ్‌మన్ పావెల్ (43: 34 బంతుల్లో, ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా... రిషబ్ పంత్ (39: 33 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) తనకు సహకరించాడు. ముంబై విజయానికి 120 బంతుల్లో 160 పరుగులు కావాలి.


టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. స్కోరు బోర్డుపై 50 పరుగులు చేరే సరికి డేవిడ్ వార్నర్ (5: 6 బంతుల్లో, ఒక ఫోర్), మిషెల్ మార్ష్ (0: 1 బంతి), పృథ్వీ షా (24: 23 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), సర్ఫరాజ్ ఖాన్ (10: 7 బంతుల్లో) అవుటయ్యారు.


ఈ దశలో రిషబ్ పంత్, రొవ్‌మన్ పావెల్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 75 పరుగులు జోడించారు. ఆ తర్వాత ఇన్నింగ్స్ వేగాన్ని పెంచే క్రమంలో 18 పరుగుల వ్యవధిలోనే ఇద్దరూ అవుటయ్యారు. చివర్లో అక్షర్ పటేల్ సిక్సర్లతో చెలరేగడంతో ఢిల్లీ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో బుమ్రాకు మూడు వికెట్లు, రమణ్‌దీప్ సింగ్‌కు రెండు వికెట్లు దక్కగా... మర్కండే, డేనియల్ శామ్స్ చెరో వికెట్ తీసుకున్నారు.