IPL 2022: ఐపీఎల్‌ 2022లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే నాలుగు జట్లేవో శనివారంతో తేలిపోతుంది. ఇప్పటికే గుజరాత్‌ టైటాన్స్‌ (Gujarat Titans), లక్నో సూపర్‌ జెయింట్స్‌ (Lucknow Supergiants) అర్హత సాధించేశాయి. రాజస్థాన్‌ రాయల్స్‌ (Rajasthan Royals) దాదాపుగా క్వాలిఫైడ్‌ అని చెప్పాలి! దిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals), రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bangalore)ను చూస్తుంటే 'మాంత్రికుడి ప్రాణం చిలకలో' అనే డైలాగ్‌ గుర్తొస్తోంది. ఇక్కడ ముంబయి ఇండియన్స్‌ చిలకగా మారింది మరి!


ఈ ఏడాది ఎవరూ అంచనా వేయని విధంగా కొత్త జట్టు గుజరాత్‌ టైటాన్స్‌ 20 పాయింట్లతో నంబర్‌ వన్‌ పొజిషన్లో నిలిచింది. వారిని ఇప్పుడెవరూ అధిగమించలేరు. కోల్‌కతాపై థ్రిల్లింగ్‌ విక్టరీతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ 18 పాయింట్లు అందుకుంది. నాకౌట్‌కు చేరిన రెండో జట్టుగా రికార్డు సృష్టించింది. ఇక 13 మ్యాచుల్లో 8 గెలిచి 16 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌కు అత్యంత సమీపంలో నిలిచింది. నేడు చెన్నై సూపర్‌ కింగ్స్‌తో పోరు వారి భవితవ్యం తేలుస్తుంది. ఒకవేళ సంజూ సేన భారీ విక్టరీ సాధిస్తే మెరుగైన రన్‌రేట్‌ వల్ల రెండో స్థానంలోకి వెళ్తుంది. ఓడిపోతే యథావిధిగా మూడులోనే ఉంటుంది. మొత్తానికి వారికైతే ఎలాంటి టెన్షన్‌ లేదు.


ఇప్పుడు టెన్షన్‌ అంతా రెండు జట్లకే! అవే దిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు. గుజరాత్‌పై విక్టరీతో ఆర్సీబీ 16 పాయింట్లు సాధించింది. అయితే నెగెటివ్‌ రన్‌రేట్‌ (-0.253) వారికి గండంగా మారింది. అందుకే శనివారం ముంబయి ఇండియన్స్‌ చేతిలో దిల్లీ క్యాపిటల్స్‌ ఓడిపోవాలని కోరుకుంటోంది. ప్రస్తుతం పంత్ సేన 13 మ్యాచుల్లో 7 గెలిచి 14 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. +0.255 రన్‌రేట్‌ ఉండటం వారికి ఊపిరి పోస్తోంది. ఒకవేళ హిట్‌మ్యాన్‌ సేన చేతిలో గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్‌ చేరుకొనేందుకు ఇది దన్నుగా మారనుంది.


అంటే.. మొత్తానికి ఆర్సీబీ, డీసీ ప్రాణాలు ముంబయి ఇండియన్స్‌ చేతిలో ఉన్నాయి. వారు ఎవరి పార్టీని భగ్నం చేస్తారోనన్న సందిగ్ధం నెలకొంది. ముంబయి పంత్‌ సేనను ఓడించాలని ఆర్సీబీ అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు ముంబయిపై గెలిచి ప్లేఆఫ్స్‌ చేరుకోవాలని డీసీ ఫ్యాన్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు. ఏం జరుగుతుందో తెలియాలంటే శనివారం రాత్రి వరకు ఆగాల్సిందే!!