IPL 2022, Delhi capitals won by 4 wickets aganist Mumbai Indians: ఐపీఎల్‌ 2022లో దిల్లీ క్యాపిటల్స్‌ తొలి విజయం అందుకుంది. ముంబయి ఇండియన్స్‌ ఇచ్చిన 178 పరుగుల టార్గెట్‌ను 4 వికెట్ల తేడాతో ఛేదించింది. వికెట్లు పడి ఒత్తిడికి లోనైనా లలిత్‌ యాదవ్‌ (48; 38 బంతుల్లో 4x4, 2x6), అక్షర్‌ పటేల్‌ (38; 17 బంతుల్లో 2x3, 3x6) అద్భుతంగా ఆడారు. సిక్సర్లతో చెలరేగుతూ అజేయంగా నిలిచారు. అంతకు ముందు ముంబయిలో రోహిత్‌ శర్మ (41), ఇషాన్‌ కిషన్‌ (81) దుమ్మురేపారు. ఎంఐ ఎప్పటిలాగే ఫస్ట్‌ మ్యాచులో ఓడిపోయే ఆనవాయితీ కొనసాగించింది.




గెలుస్తుందా అన్న స్థితి నుంచి!


దిల్లీ క్యాపిటల్‌ ఛేజింగ్‌ మెరుపులతో మొదలైంది. టిమ్‌ సీఫెర్ట్‌ (21; 14 బంతుల్లో 4x4), పృథ్వీ షా (38) బౌండరీలు కొట్టడంతో 3 ఓవర్లకే స్కోరు 30 దాటేసింది. తెలివిగా ఆలోచించిన రోహిత్‌ స్పిన్నర్‌ మురుగన్‌ అశ్విన్‌కు బంతినిచ్చాడు. అతడు ఒకే ఓవర్లో సీఫెర్ట్‌, మన్‌దీప్‌ (0)ను ఔట్‌ చేశాడు. తర్వాత తైమల్‌ మిల్స్‌ ఓవర్లో  రిషభ్‌ పంత్‌ (1) పెవిలియన్‌ చేరాడు. కష్టాల్లో పడ్డ జట్టును లలిత్‌ యాదవ్‌తో (Lalit yadav) కలిసి పృథ్వీ షా (Prithivi Shaw) ఆదుకున్నాడు. బౌండరీలు కొడుతూ ముందుకు తీసుకెళ్లాడు. జట్టు స్కోరు 72 వద్ద షా, రోమన్‌ పావెల్‌ (0)ను బాసిల్‌ థంపీ ఔట్‌ చేయడంతో దిల్లీపై విపరీతమైన ప్రెజర్‌ పడింది. బౌండరీలు బాదుతూ కాసేపు ఆశలు రేపిన శార్దూల్‌ ఠాకూర్‌ (Shardhul Thakur) (22; 11 బంతుల్లో 4x4)ను 104 వద్ద థంపీనే ఔట్‌ చేశాడు. అప్పుడే అక్షర్‌ పటేల్ రావడంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది.  బుమ్రా వేసిన 16వ ఓవర్లో 15, థంపి వేసిన 17వ ఓవర్లో 13, సామ్స్‌ వేసిన 18వ ఓవర్లో 24 పరుగులు రాబట్టిన అక్షర్‌, లలిత్‌ జట్టుకు విజయం అందించేశారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 30 బంతుల్లో 75 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.




పేలిన పాకెట్‌ డైనమైట్‌


మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ముంబయి ఇండియన్స్‌ Mumbai Indians) దూకుడుగా ఆడింది. ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌ (Ishan kishan), రోహిత్‌ శర్మ (Rohit sharma) తొలి వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం అందించారు. వీరిద్దరూ ఒకరితో మరొకరు పోటీపడుతూ బౌండరీలు కొట్టారు. 8.2వ ఓవర్లో కుల్‌దీప్‌ (Kuldeep yadav) హిట్‌మ్యాన్‌ను ఔట్‌ చేసి బ్రేక్‌ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన అన్‌మోల్‌ ప్రీత్ సింగ్‌ (8)నీ అతడే పెవిలియన్‌ పంపించాడు. ఈ క్రమంలో హైదరాబాదీ తిలక్‌ వర్మ (22; 15 బంతుల్లో 3x4)తో కలిసి కిషన్‌ దుమ్మురేపాడు. 34 బంతుల్లో అర్ధశతకం అందుకున్నాడు. చక్కని షాట్లతో ఆకట్టుకున్న తిలక్‌ను ఖలీల్‌ అహ్మద్‌ ఔట్‌ చేశాడు. పొలార్డ్‌ (3)ను కుల్‌దీప్‌ పెవిలియన్‌ పంపించాడు. ఆఖర్లో టిమ్‌ డేవిడ్‌ (12), డేనియెల్‌ సామ్స్‌ (7*)తో కలిసి ఇషాన్‌ సిక్సర్లు, బౌండరీలు బాది ముంబయి స్కోరును  177-5కు చేర్చాడు.