డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Superkings)కు షాక్ తగిలింది. ఆ జట్టు ప్రధాన పేసర్ దీపక్ చాహర్ (Deepak Chahar) ఈ సీజన్ మొత్తానికీ దూరమయ్యాడు. వెన్నెముకకు గాయం కావడమే ఇందుకు కారణం. కోల్‌కతా యువ పేసర్ రసిక్ సలామ్ వెన్నెముక దిగువ భాగంలో గాయం కావడంతో అతడూ లీగుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో హర్షిత్ రాణాను కేకేఆర్ తీసుకుంది. దిల్లీకి చెందిన ఈ కుర్రాడిని రూ.20 లక్షల కనీస ధరతో తీసుకుంది.
సీఎస్‌కేలో దీపక్ చాహర్ ఎంట్రీ మరింత ఆలస్యం కానుంది. లేదా అస్సలు ఆడకనే పోవచ్చని కొన్ని రోజుల క్రితమే వార్తలు వచ్చాయి! బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో రిహబిలిటేషన్‌కు వెళ్లిన అతడికి మరో గాయమైంది. రిహబిలిటేషన్‌లో అతడి వెన్నెముకకు గాయమైంది. నెల రోజుల నుంచి దీపక్ చాహర్ ఎన్‌సీఏలోనే ఉంటున్నాడు. ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో టీ20 సిరీసు ఆడటేప్పుడు అతడి క్వాడ్రాసిప్స్‌లో చీలిక వచ్చింది. ఆ గాయం నుంచి కోలుకొనేందుకు దీపక్ ఎన్‌సీఏకు వెళ్లాడు. అతడి గాయం తీవ్రతను బట్టి ఎన్‌సీఏ ఫిజియోలు ఐపీఎల్ తొలి అర్ధభాగం వరకు చాహర్ అందుబాటులో ఉండకపోవచ్చని అంచనా వేశారు.
వేగంగా కోలుకుంటున్న దీపక్ చాహర్‌కు ఇప్పుడు మరో గాయం కావడం సీఎస్‌కే గెలుపు అవకాశాలను మరింత దెబ్బతీయనుంది. అతడు పూర్తిగా కోలుకోందే బయటకు పంపించకూడదని ఎన్‌సీఏ నిర్ణయించుకుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌నకు అతడిని ఫిట్‌గా ఉంచాలని బీసీసీఐ భావిస్తోంది.
దీపక్ చాహర్ బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తాడు. పవర్‌ప్లేలో వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బకొడతాడు. అంతేకాకుండా లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగుకు వచ్చి కీలక పరుగుల్ని చేస్తాడు. ఈ సీజన్లో అతడు లేకపోవడంతో చెన్నైకి ఇబ్బందిగా మారింది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచుల్లో పవర్‌ప్లేలో 24 ఓవర్లు వేసిన సీఎస్‌కే బౌలర్లు 8.62 ఎకానమీతో కేవలం 2 వికెట్లు తీశారు. డెత్‌లోనూ వారి బౌలింగ్ చెత్తగా ఉంటోంది.
ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 59 ఇన్నింగ్సుల్లో పవర్‌ప్లే ఓవర్లలో దీపక్ చాహర్ 7.61 ఎకానమీతో 42 వికెట్లు తీయడం గమనార్హం. ఐపీఎల్‌లో చాహర్ కోసం సీఎస్‌కే రూ.14 కోట్లు చెల్లించింది. కానీ అతడు లేకపోవడంతో ఆ స్థాయి దేశవాళీ బౌలర్ ఎవరూ సీఎస్‌కేకు దొరకడం లేదు. విదేశీ పేసర్లను ఉపయోగించుకోవడానికి కుదరడం లేదు.