IPL Bubble breach protocols to attract serious sanctions: కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించేవారిపై బీసీసీఐ (BCCI) ఈ సారి కఠిన చర్యలు తీసుకోనుంది. ఆటగాళ్లపై ఒక మ్యాచ్ నిషేధం విధించడమే కాకుండా ఏడు రోజులు తిరిగి క్వారంటైన్‌కు (Re quarantine) పంపించనున్నారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులకూ ఈసారి శిక్షలున్నాయి. మార్చి 26 నుంచి ఐపీఎల్ 15వ సీజన్ మొదలవుతోంది. తొలి మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనున్న సంగతి తెలిసిందే.
ఏదైనా జట్టు ఉద్దేశపూర్వకంగా ఔట్‌సైడర్‌ను బయో బుడగలోకి (IPL bio secure bubble) అనుమతిస్తే తొలి తప్పిదం కింద కోటి రూపాయిలు జరిమానా విధిస్తారు. మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తే ఆ జట్టు పాయింట్లలో ఒకటి లేదా రెండు కోత విధిస్తారు. ఆటగాళ్లు, జట్టు అధికారులు, మ్యాచ్ అధికారులు టేబుల్ ఏలోని శిక్షలకు గురవుతారు. వీరిలో ఎవరైనా తొలిసారి తప్పు చేస్తే ఏడు రోజులు రీ క్వారంటైన్ విధిస్తారు. పైగా మిస్సైన మ్యాచులకు డబ్బులు చెల్లించరు. రెండోసారి తప్పు చేస్తే ఏడు రోజుల క్వారంటైన్ పూర్తయ్యాక ఒక మ్యాచ్ నుంచి సస్పెండ్ చేస్తారు. మూడోసారి అయితే జట్టు నుంచి తొలగిస్తారు. రీప్లేస్‌మెంట్ అనుమతించరు.
ఆటగాళ్లు, అధికారుల కుటుంబ సభ్యులకూ ఇలాంటి శిక్షలే ఉన్నాయి. ఐపీఎల్ 2022 బయో బబుల్‌ను అతిక్రమిస్తే కుటుంబ సభ్యులకు ఏడు రోజుల క్వారంటైన్ విధిస్తారు. సంబంధిత ఆటగాడు, అధికారికి కూడా క్వారంటైన్ తప్పదు. పైగా ఎలాంటి వేతనం చెల్లించరు. రెండోసారి తప్పు చేస్తే ఆ కుటుంబ సభ్యులను ఇకపై మళ్లీ బుడగలో అడుగుపెట్టనివ్వరు. సంబంధిత ఆటగాడికి రీక్వారంటైన్ తప్పదు.
ఐపీఎల్ ఫ్రాంచైజీలు క్వారంటైన్ పూర్తవ్వని వ్యక్తిని బయో బుడగలోకి అనుమతించి ఆటగాళ్లు, సహాయ బృందాన్ని కలవనివ్వడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. కరోనా టెస్టులకు హాజరవ్వకుండా తప్పించుకోవడమూ తప్పిదం కిందకే వస్తుంది. ఇలాంటప్పుడు మొదటి తప్పుకు ఆ ఫ్రాంచైజీ కోటి రూపాయిలు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. రెండోసారి ఒక పాయింటు, మూడోసారి, ఆ తర్వాత ప్రతిసారీ రెండు పాయింట్ల చొప్పున కోత విధిస్తారు.
ఆటగాళ్లు, కుటుంబ సభ్యులలో ఎవరైనా కొవిడ్ టెస్టులు మిస్సయితే తొలి తప్పిదం కింద హెచ్చరిస్తారు. రూ.75000 జరిమానా విధిస్తారు. మరోసారి టెస్టు చేసేంత వరకు స్టేడియం, సాధన శిబిరాలకు అనుమతించరు. గతేడాది బయో బబుల్ బ్రేకై కరోనా సోకడంతో ఈసారి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.