ఐదు రాష్ట్రాల ఫలితాలకు ముందు ఒక లెక్క ఆ తర్వాత ఒక లెక్క అన్నట్టు ఉంది నిజామాబాద్ జిల్లా రాజకీయాల పరిస్థితి. మొన్నటి వరకు కూల్‌గా ఉన్న పొలిటికల్ స్ట్రీట్ వెదర్ ఇప్పుడు క్రమంగా హీటెక్కుతోంది. ప్యూచర్ ప్లాన్స్‌లో లీడర్లు బిజీగా ఉంటున్నారు.
దేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కంగుతినటంతో లీడర్ల లెక్కలు మారిపోయాయి. మరింతగా వికసిస్తున్న కమలానికి చాలామంది నాయకులు ఆకర్షితులవుతున్నారు. కొత్త ఆలోచనలు చేస్తున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలను డెడ్‌లైన్‌గా పెట్టుకున్న కొందరు నేతలు ఇప్పుడు థింకింగ్ మొదలు పెట్టినట్టు సమాచారం.
గెలుస్తామా అనే సందేహం
బీజేపీలో చేరాల వద్దా అనే అంశంపై సన్నిహితులతో చర్చించుకుంటున్నారు. ఇప్పటికే గులాబీ పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. ఈ సారి మళ్లీ ప్రజలు ఆశీర్వదిస్తారో లేదో అన్న డైలమా అధికార పార్టీలో కూడా ఉందని టాక్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న 9 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది టీఆర్ఎస్ నుంచి రెండు సార్లు గెలిచిన వారున్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
గుబులు పుట్టిస్తున్న పీకే సర్వేలు
జిల్లాలో ప్రశాంత్ కిషోర్ సర్వేలు కలకలం రేపుతున్నాయ్. జిల్లాలో కొంత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు, మళ్లీ టికెట్ ఇస్తే వారు గెలుస్తారా లేదా అన్న దానిపై టీఆర్ఎస్ అధిష్ఠానం సర్వే చేయించిందని రిపోర్ట్స్ కూడా సిద్ధం చేసిందని ప్రచారంలో ఉంది. అయితే అందులో ఎవరికి టికెట్ ఇస్తారు. ఎవరిని పక్కన పెడతారో అన్న ఆందోళనలో కొందరు నేతలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయ్.
ఉమ్మడి జిల్లాలో ఇప్పుడున్న అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో ఎంత మందికి టికెట్ వస్తుందో అన్నదానిపై ఆయా నాయకుల్లో ఒకింత ఆందోళనైతే ఉన్నట్లు తెలుస్తోంది. పీకే సర్వేల్లో ఏ ఎమ్మెల్యేకు ప్లస్, ఏ ఎమ్మెల్యేకు మైనస్ అన్నది గుబులు రేపుతోంది. ఉమ్మడి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేల్లో కొందరిపై ప్రజా వ్యతిరేకత ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్ లో టాక్ నడుస్తోంది.
బీజేపీ వైపు చూస్తున్న కొందరు ప్రజా ప్రతినిధులు
దేశంలో బీజేపీకి చరిష్మా ఏ మాత్రం తగ్గలేదని మొన్నటి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రుజువైంది. అదే ఊపు తెలంగాణలో కూడా నిపిస్తుందని బీజేపీ లీడర్లు స్పీచ్‌లు ఇస్తున్నారు. అధికార పార్టీపై మూకుమ్మడి దాడి తీవ్రం చేశారు. ఇదే అధికార పార్టీ నేతలను కంగారు పెట్టిస్తున్న అంశం. 2019 ఎన్నికల్లో కేసీఆర్ హవా నడిచినా ఇందూరు జిల్లా వాసులు బీజేపీ నుంచి ఎంపీగా అరవింద్ ను గెలిపించారు. నిజామాబాద్ నగరంలో మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కాషాయం పార్టీని ఆదరించారు. బీజేపీ చేయిస్తున్న సర్వేల్లో కూడా మంచి ఫలితాలు వస్తున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ స్పష్ఠమైన ప్రభావం చూపుతుందన్న నమ్మకం ఆ పార్టీ నాయకత్వంలో గట్టిగా ఉంది. జిల్లాలో పార్టీ పూర్వం కన్నా బలం పుంజుకుంది.
ఆ ఇద్దరు డౌటే
ఇప్పుడున్న కొందరు ఎమ్మెల్యేల్లో టీఆర్ఎస్ నుంచి టికెట్ రాకుంటే అలాగే అంతకుముందే బీజేపీలో చేరాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓ ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీ నాయకులతో టచ్‌లో కూడా ఉంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయ్. కామారెడ్డి జిల్లాలో కూడా ఓ ఇద్దరు నేతలు కాషాయం పార్టీ వైపు కన్నేస్తున్నట్లు తెలుస్తోంది.
కొందరు నేతలు ఇంటర్నల్‌గా తాము గెలుస్తామా లేదా అన్న దానిపైనా సర్వేలు చేయించుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో తగ్గుతున్న ఆధరణతో ఆ పార్టీలోనూ చాలా మంది నేతలు బీజేపీ వైపు చూసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరికొంత కాలం రాజకీయ పరిస్థితులను అనాలిసిస్ చేసుకుని ఫ్యూచర్ పాలిటిక్స్ పై ఓ క్లారిటీ వస్తారన్న చర్చ అయితే జిల్లాలో జోరుగా సాగుతోంది.