IPL 2022, Du Plesiss praised Dinesh Karthik: కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై (Kolkata Knightriders) మ్యాచ్‌ గెలిపించిన దినేశ్‌ కార్తీక్‌పై (Dinesh Karthik) రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ డుప్లెసిస్‌ (Faf Du plesiss) ప్రశంసలు కురిపించాడు. అచ్చం ఎంఎస్‌ ధోనీలాగే (MS Dhoni) ఆఖరి వరకు కామ్‌గా, కంపోజర్‌తో ఉన్నాడని పేర్కొన్నాడు. అతడి నుంచి తాము ఆశించింది ఇదేనని వెల్లడించాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు.


ఐపీఎల్‌ 2022లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bangalore) బోణీ కొట్టింది. ఓవర్‌ కాన్ఫిడెంట్‌గా కనిపించిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను (Kolkata Knightriders) 3 వికెట్ల తేడాతో ఓడించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 129 పరుగుల లక్ష్యాన్ని మరో 4 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఈ ఛేజింగ్‌ ఆఖరి ఓవర్‌ వరకు వెళ్లడంతో అంతా టెన్షన్‌ టెన్షన్‌గా మారింది. దాంతో ఆఖరి ఓవర్లో దినేశ్‌ కార్తీక్‌ వరుసగా ఒక సిక్సర్‌, ఒక బౌండరీ కొట్టి బెంగళూరుకు విజయం అందించాడు.


'మ్యాచులను ముగించడంలో దినేశ్‌ కార్తీక్‌కు ఎంఎస్‌ ధోనీలాంటి అనుభవమే ఉంది. అతడి నుంచి మేం కోరుకున్నది ఇదే! ప్రశాంతంగా ఉండి మ్యాచ్‌ ముగించడమే మాకు కావాలి. బంతులతో పోలిస్తే పరుగులు ఎక్కువేం కాదు. అయితే చేతిలో వికెట్లు ఉండటం ముఖ్యం. దినేశ్‌ కార్తీక్‌ ఆఖరి వరకు ప్రశాంతంగా ఆడాడు. ఎంఎస్‌ ధోనీలా మ్యాచును ముగించాడు' అని డుప్లెసిస్‌ అన్నాడు.


'చాలా సంతోషంగా ఉంది. లీగ్‌ ఆరంభంలో ఇలాంటి స్వల్ప లక్ష్యాలున్న మ్యాచులను గెలవడం అత్యంత ముఖ్యం. అలాగైతేనే జట్టులో జోష్‌ ఉంటుంది. ఏదేమైనా కాంపిటీషన్‌ బాగుంది. సాధారణంగా ఇలాంటి స్వల్ప స్కోర్లను ముందుగానే ఛేదించాలి. కానీ ప్రత్యర్థి బౌలర్లు పవర్‌ప్లేలో అద్భుతంగా బౌలింగ్‌ చేశారు' అని డుప్లెసిస్‌ అన్నాడు. ఉమేశ్‌ యాదవ్‌, టిమ్‌ సౌథీ చెలరేగడంతో మూడు ఓవర్లకే బెంగళూరు అనుజ్‌ రావత్‌, డుప్లెసిస్‌, విరాట్‌ కోహ్లీ వికెట్లు చేజార్చుకుంది.




RCB ఛేజింగ్‌ ఇలా సాగింది!


మరోసారి ఉమేశ్‌ యాదవ్‌ (2/16) తనలోని ఫైర్‌ చూపించాడు. టిమ్‌ సౌథీ (3/20)తో కలిపి ఆర్‌సీబీ టాప్‌ ఆర్డర్‌ను వణికించేశాడు. ఇన్నింగ్స్‌ మూడో బంతికే ఓపెనర్‌ అనుజ్‌ రావత్‌ (0)ను ఔట్‌ చేశాడు. తర్వాతి ఓవర్లో డుప్లెసిస్‌ (5)ను సౌథీ పెవిలియన్‌ పంపించాడు. 2.1వ బంతికి విరాట్‌ కోహ్లీ (12)ను ఉమేశ్‌ ఔట్‌ చేడయంతో ఆర్‌సీబీ 17కే 3 వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో షెర్ఫాన్‌ రూథర్‌ ఫర్డ్‌, డేవిడ్‌ విలే (18) 45 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకున్నారు. జట్టు స్కోరు 62 వద్ద విలేను నరైన్‌ ఔట్‌ చేయడం ఈ జోడీ విడిపోయింది. ఆ తర్వాత వచ్చిన షాబాజ్‌ అహ్మద్‌ చక్కని సిక్సర్లు బాది రన్‌రేట్‌ను అదుపులోకి తీసుకొచ్చాడు. రూథర్‌ఫర్డ్‌తో కలిసి 39 పరుగుల భాగస్వామ్యం అందించిన అతడిని 15.6 బంతికి చక్రవర్తి ఔట్‌ చేశాడు. జాక్సన్‌ వేగంగా స్టంపౌట్‌ చేశాడు. అప్పటికి స్కోరు 101/5. మరో 6 పరుగులకే రూథర్‌ఫర్డ్‌ ఔటవ్వడంతో టెన్షన్‌ పెరిగింది. కానీ హర్షల్‌ పటేల్‌ (10)తో కలిసి దినేశ్‌ కార్తీక్‌ (14) విన్నింగ్‌ అందించాడు.