IPL 2022 Always Tension When MS Dhoni Is Batting Says KKR Skipper Shreyas Iyer: ఎంఎస్‌ ధోనీ (MS Dhoni) క్రీజులో ఉన్నంత వరకు టెన్షన్‌గానే అనిపించిందని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) అన్నాడు. ఐపీఎల్‌ 2022 సీజన్లో (IPL 2022) మొదటి మ్యాచ్‌ (CSK vs KKR) గెలిచినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. అజింక్య రహానె (Ajinkya Rahane) అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడని, ఉమేశ్ యాదవ్‌ (Umesh Yadav) బౌలింగ్‌కు తిరుగులేదని వెల్లడించాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు.


'ఎంఎస్‌ ధోనీ బ్యాటింగ్‌ చేస్తున్నంత సేపు టెన్షన్‌ ఉంటుంది. మంచు కురుస్తుండటంతో మూమెంటమ్‌ వారివైపు వెళ్తుందని తెలుసు. బంతిపై పట్టు దొరకడం చాలా కష్టం. కొత్త ఫ్రాంచైజీని ఎంజాయ్‌ చేస్తున్నాను. అక్కడి సీఈవో, మేనేజ్‌మెంట్‌, సహాయ సిబ్బంది చాలా బాగున్నారు. ఇదే జోరును సీజనంతా కొనసాగించాలి. పిచ్‌ మేం ఊహించిన దానికన్నా ఎక్కువ స్పాంజీ బౌన్స్‌తో ఉంది' అని శ్రేయస్‌ అయ్యర్‌ అన్నాడు.


శ్రేయస్‌ అయ్యర్‌ స్వస్థలం ముంబయి. అతడు వాంఖడేలోనే (Wankhede stadium) ఎక్కువ రంజీ మ్యాచులు ఆడాడు. 'నేను ఎక్కువ ప్రేమించే ప్రాంతం ఇది. నేనిక్కడే పెరిగాను. పిచ్‌ ఫ్లాట్‌గా ఉంటుందనుకున్నా. మాకున్న బౌలింగ్‌ లైనప్‌తో పని సులువైంది.  ఉమేశ్‌ యాదవ్‌ నెట్స్‌లో ఎంతో కష్టపడ్డాడు. ప్రాక్టీస్‌ గేముల్లోనూ రాణించాడు. మ్యాచులో అతడి బౌలింగ్‌ చూసి సర్‌ప్రైజ్‌ అయ్యాను' అని శ్రేయస్‌ తెలిపాడు.


Kolkata KnightRiders బోణీ


ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్... చెన్నై సూపర్ కింగ్స్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. మహేంద్ర సింగ్ ధోని (50 నాటౌట్: 38 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా 18.3 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి ఛేదించింది. కోల్‌కతా బ్యాటర్లలో అజింక్య రహానే (44: 34 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.


ఆడుతూ పాడుతూ...


స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు లక్ష్య చేదనలో అడ్డంకులు ఎదురుకాలేదు. పవర్ ప్లేలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా కోల్‌కతా 43 పరుగులు చేసింది. ఓపెనర్లు అజింక్య రహానే (44: 34 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్), వెంకటేష్ అయ్యర్ (16: 16 బంతుల్లో, ఒక ఫోర్) చెన్నై బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు. అయితే ఏడో ఓవర్లో వెంకటేష్ అయ్యర్‌ను అవుట్ చేసి బ్రేవో చెన్నైకి తొలి వికెట్ అందించాడు.


లక్ష్యం ఎక్కువ లేకపోవడంతో కోల్‌కతాకు పెద్దగా ఒత్తిడి కూడా ఎదురవలేదు. నితీష్ రాణా (21: 17 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), శామ్ బిల్లింగ్స్ (25: 22 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) రాణించారు. చివర్లో శ్రేయస్ అయ్యర్ (20 నాటౌట్: 19 బంతుల్లో, ఒక ఫోర్) మ్యాచ్‌ను ముగించాడు. చెన్నై బౌలర్లలో బ్రేవోకు మూడు వికెట్లు దక్కగా... మిషెల్ శాంట్నర్ ఒక వికెట్ తీశాడు.