IPL 2024 Playoff Qualification Scenarios:  ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(IP)లో ప్లే ఆఫ్‌ సమరం రసవత్తరంగా మారింది. ప్లే ఆఫ్‌కు చేరే ఆ నాలుగు జట్లు ఏవనే చర్చ అభిమానుల్లో తీవ్రంగా జరుగుతోంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఉన్న స్థానాల ప్రకారం ఐదుసార్లు ఐపీఎల్ విజేతలుగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్(CSK), ముంబై ఇండియన్స్(MI) తొలి నాలుగు స్థానాల బయట ఉండడం ఈ సీజన్‌లో ఆసక్తి రేపుతోంది. రాజస్థాన్ రాయల్స్‌(RR)పై ఒక పరుగు తేడాతో విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్  మొదటి నాలుగు స్థానాల్లోకి దూసుకొచ్చింది. ఇక ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఎలిమినేషన్ ముప్పును ఎదుర్కొంటున్నాయి. ప్లేఆఫ్‌కు చేరాలంటే కనీసం 16 పాయింట్లు కావాలి. ఈ సీజన్‌లో మొత్తం 10 జట్ల ప్లే ఆఫ్ అర్హత అవకాశాలు ఎలా ఉన్నాయంటే..?


చెన్నై సూపర్ కింగ్స్: చెన్నైకు ఇంకా నాలుగు మ్యాచులు మిగిలి ఉన్నాయి. పంజాబ్, గుజరాత్, బెంగుళూరు జట్లతో చెన్నై మ్యాచులు ఆడాల్సి ఉంది. ప్లేఆఫ్ స్పాట్ కోసం పోటీలో ఉండాలంటే చెన్నై కనీసం రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాలి. మూడు విజయాలు సాధిస్తే చెన్నై 16 పాయింట్ల మార్క్‌ను చేరుకుంటుంది. మొత్తం నాలుగు మ్యాచుల్లో గెలిస్తే చెన్నైకు మొత్తం 18 పాయింట్లు దక్కి మిగతా ఎవరితో సంబంధం లేకుండా ప్లే ఆఫ్‌కు చేరుతుంది.


రాజస్థాన్ రాయల్స్: రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి ప్లే ఆఫ్‌కు దాదాపుగా చేరింది. రాజస్థాన్‌ 16 పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. అయినా సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ అధికారికంగా ప్లే ఆఫ్ బెర్త్‌ను ఇంకా పొందలేకపోయింది. రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు ప్లేఆఫ్స్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడటం లేదు, వారికి ఇంకా 4 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. అందులో ఒక్కటి గెలిస్తే చాలు


కోల్‌కతా నైట్ రైడర్స్: 9 మ్యాచ్‌లలో 12 పాయింట్లతో ఉంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. కోల్‌కత్తాకు ఇంకా అయిదు మ్యాచ్‌లు ఉన్నాయి. ముంబై ఇండియన్స్ (2 మ్యాచ్‌లు), గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్‌తో కోల్‌కత్తా ఆడాలి. ఇందులో కనీసం 3 మ్యాచ్‌లు గెలిస్తే కోల్‌కత్తా ప్లే ఆఫ్‌కు చేరుతుంది. 


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అట్టడుగున ఉంది. పది మ్యాచ్‌ల్లో కేవలం 3 విజయాలతో బెంగళూరు వద్ద ఆరే పాయింట్లు ఉన్నాయి. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే బెంగళూరు వద్ద 14 పాయింట్లను మాత్రమే చేరుకుంటుంది. అయినా ప్లే ఆఫ్‌ ఆశలు కష్టమే. బెంగళూరు ఒక్క మ్యాచ్ ఓడిపోయినా అధికారికంగా ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది.


ముంబై ఇండియన్స్: 10 మ్యాచ్‌లలో 7 ఓటములతో ముంబై ఇండియన్స్ వద్ద కేవలం 6 పాయింట్లే ఉన్నాయి. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించినా ముంబైకు 14 పాయింట్లే వస్తాయి. ప్రస్తుత రేసును బట్టి చూస్తే ముంబై ప్లే ఆఫ్‌కు అర్హత సాధించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ముంబై ఒక్క మ్యాచ్ ఓడిపోయినా అధికారికంగా ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది.


పంజాబ్ కింగ్స్: పంజాబ్ కింగ్స్ 10 మ్యాచ్‌లలో 4 గెలిచి 8 పాయింట్లతో ఉంది. ప్లేఆఫ్‌కు చేరాలంటే మిగిలిన నాలుగు మ్యాచుల్లో పంజాబ్‌ గెలవాలి. ఒక్క మ్యాచ్‌ ఓడిపోయినా పేలవమైన నెట్ రన్ రేట్ -0.662 ఉన్న పంజాబ్‌ ప్లే ఆఫ్‌ ఆశలు సంక్లిష్టంగా మారుతాయి. అప్పుడు అన్ని మ్యాచులు గెలిచినా వేరే జట్ల గణాంకాల మీద ఆధారపడాల్సి ఉంటుంది.


గుజరాత్ టైటాన్స్: ప్లే ఆఫ్‌ చేరుకునేందుకు గుజరాత్ టైటాన్స్ తీవ్రంగా పోరాడుతోంది. గుజరాత్ 10 మ్యాచ్‌లు ఆడి 4 మాత్రమే గెలిచి ప్రస్తుతం 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. గుజరాత్‌ నెట్ రన్ రేట్ ఇతర జట్ల కంటే అధ్వాన్నంగా ఉంది. గుజరాత్ టైటాన్స్ అన్ని మ్యాచ్‌లు గెలిస్తే 16 పాయింట్లు వస్తాయి. అయినా ప్లే ఆఫ్‌కు చేరడం కష్టమే. అన్ని మ్యాచులు గెలిచినా వేరే జట్ల గణాంకాల మీద ఆధారపడాల్సి ఉంటుంది.


ఢిల్లీ క్యాపిటల్స్: ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్తుతం 11 మ్యాచ్‌లలో 5 విజయాలతో 10 పాయింట్లతో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ 16 పాయింట్లను చేరుకోవాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలవాలి. కానీ వారి మిగిలిన 3 మ్యాచ్‌లు గెలిచినా ప్లేఆఫ్ బెర్త్ గ్యారెంటీ కాదు. అన్ని మ్యాచులు గెలిచినా వేరే జట్ల గణాంకాల మీద ఆధారపడాల్సి ఉంటుంది.


సన్‌రైజర్స్ హైదరాబాద్: ఈ ఏడాది ఐపీఎల్‌లో పాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ బాగా ఆడుతోంది. 10 మ్యాచ్‌లలో 6 విజయాలతో 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. హైదరాబాద్‌ ఇంకా 4 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ప్లేఆఫ్ బెర్త్‌ను పదిలపరుచుకోవాలంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్‌లలో కనీసం 3 మ్యాచ్‌లలో తప్పక గెలవాలి. రెండు మ్యాచుల్లోనే గెలిస్తే ఇతర జట్ల ప్రదర్శనలపై ఆధారపడవలసి వస్తుంది.


లక్నో సూపర్ జెయింట్: లక్నో సూపర్ జెయింట్స్ ఆడిన 10 మ్యాచ్‌ల్లో 6 గెలిచి 12 పాయింట్లతో ఉంది. లక్నో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. లక్నో ఇంకో నాలుగు మ్యాచులు ఆడాల్సి ఉంది. ప్లేఆఫ్ అర్హత సాధించాలంటే లక్నో కనీసం 3 మ్యాచ్‌లలో విజయం సాధించాలి. లక్నో 2 మ్యాచ్‌లను మాత్రమే గెలవగలిగితే, వారి విధి ఇతర జట్ల ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది.