IPL 2025: వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్‌లో ముంబై మొదటి మ్యాచ్‌లో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఆడబోవట్లేదు. వచ్చే ఏడాది జరగబోయే మ్యాచ్‌లో హార్థిక్ ఆడట్లేదని ఇప్పుడే ఎలా తెలిసిందనుకుంటున్నారా? అయితే ఇది చదవండి


లఖ్‌నవూ సూపర్ కింగ్స్ తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లొ ముంబై ఇండియన్స్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. చివరి మ్యాచ్‌ను సైతం అవమానకర రీతిలో లఖ్‌నవూకు కోల్పోయిన ముంబైకి ఈ మ్యాచ్ అనంతరం మరో ఎదురుదెబ్బ తగిలింది.  స్లో ఓవర్ రేట్ కారణంగా జట్టు కెప్టెన్ హార్థక్ పాండ్యాపై రూ. 30 లక్షలు పెనాల్టీ, ఒక ఐపీఎల్ మ్యాచ్ నిషేధం పడింది. ముంబై శుక్రవారం ఆడింది తమ చివరి లీగ్ మ్యాచ్, అలాగే ముంబై ప్లే ఆఫ్స్ కి కూడా క్వాలిఫై కాలేదు కాబట్టి.. ఈ సీజన్ లో ముంబై కథ ఇక్కడితో ముగిసినట్లే. అలాంటప్పుడు హార్థిక్ పై పడ్డ ఒక్క మ్యాచ్ నిషేధం వచ్చే సీజన్‌కి క్యారీ అవ్వుద్దనమాట. అంటే హార్థిక్ పాండ్యా వచ్చే సీజన్ 2025లో ముంబై ఆడనున్న మొదటి ఐపీఎల్ మ్యాచ్ ఆడేందుకు వీల్లేదన్నమాట. 


మూడోసారీ.. 


ఈ సీజన్‌లో ముంబై మూడు సార్లు స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేసింది. దీంతో బీసీసీఐ పాండ్యాపై మ్యాచ్ నిషేధం విధించింది.  హార్థిక్‌కు 30 లక్షలు జరిమానా వేయగా, ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడిన రోహిత్ శర్మతో పాటు మిగతా ప్లేయర్లందరికీ  12 లక్షలు, లేదా మ్యాచ్ ఫీజులో సగం (ఏది తక్కువైతే అది) కోత పడనుంది. ఇదే సీజన్‌లో గతంలో సైతం లఖ్‌నవూతోనే జరిగిన మ్యాచ్ ‌లో ముంబై స్లో ఓవర్ రేట్ మెయింటేన్ చేసింది.  అప్పుడు కూడా హార్థిక్‌ కు రూ. 24 లక్షలు జరిమానా పడింది. మిగతా ప్లేయర్లు కూడా రూ. 6 లక్షలు గానీ, 25 శాతం మ్యాచ్ ఫీజు గానీ కోల్పోయారు. 


అసలేంటీ స్లో ఓవర్ రేట్


స్లో ఓవర్ రేట్ అంటే బౌలింగ్ చేసే టీమ్ మ్యాచ్‌కు నిర్ణయించిన సమయం కంటే ఎక్కువగా తీసుకోవడం.  సాధారణంగా టీములు స్ట్రాటజిక్ టైమ్ అవుట్లతో కలిపి  20 ఓవర్లను 90 నిమిషాల్లో ముగించాలన్నది నిబంధన. ఈ నిబంధన అతిక్రమణతో మ్యాచ్‌లు ఆలస్యం అవుతుండటంతో బీసీసీఐ గత కొన్నేళ్లుగా స్లో ఓవర్ రేట్ తో బౌలింగ్ చేసిన టీములపై చర్యలు తీసుకుంటోంది. ఈ నిబంధనలను అంతకంతకూ కఠిన తరం చేస్తోంది. వర్షం కారణంగానో, ప్లేయర్లకు గాయాలైనప్పుడో తప్పించి సాధారణంగా జరిగే మ్యాచ్‌లలో  ఎక్కువగా టైమ్ తీసుకునేందుకు వీల్లేదు. ఈ తప్పు మొదటి సారి ఆ టీమ్ కెప్టెన్‌కు రూ . 12 లక్షలు, రెండో సారి చేస్తే  రూ. 24 లక్షలు, మూడో సారి చేస్తే.. కెప్టెన్‌పై  రూ. 30 లక్షల జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం విధిస్తారు.  ఇప్పటి వరకు రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్, హార్థిక్ పాండ్యా ఈ విధంగా స్లో ఓవర్ రేట్ అఫెన్స్‌లకు పాల్పడగా పాండ్యా ఏకంగా మడోసారి ఇదే తప్పు చేసి మ్యాచ్ నిషేధం ఎదుర్కోవడం విశేషం. 


Also Read: మ్యాచులు ఉండగానే బ్యాగ్‌లు సర్దేస్తున్న ఫారెన్ ప్లేయర్స్