IPL 2025 GT 2nd Win: ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు షాక్ తగిలింది. రెండు మ్యాచ్ లు గెలిచి, జోరుమీదున్న ఆర్సీబీ.. సొంతగడ్డపై మంగళవారం జరిగిన మ్యాచ్ లో 8 వికెట్లతో పరాజయం పాలైంది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లక 169 పరుగులు చేసింది. ఆల్ రౌండర్ లియామ్ లివింగ్ స్టన్ (40 బంతుల్లో 54, 1 ఫోర్, 5 సిక్సర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం గుజరాత్ ఛేదనను 17.5 ఓవర్లలో 2 వికెట్లకు 170 పరుగులు చేసి, పూర్తి చేసింది. బ్యాటర్ జోస్ బట్లర్ (39 బంతుల్లో 73 నాటౌట్, 5 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసక ఫిఫ్టీతో చెలరేగాడు. తాజా విజయంతో గుజరాత్ పాయింట్ల పట్టికలో టాప్-4కి ఎగబాకింది.
ఆదుకున్న లివింగ్ స్టన్.. ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఆర్సీబీకి శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు విరాట్ కోహ్లీ (7), ఫిల్ సాల్ట్ (14), దేవదత్ పడిక్కల్ (4), కెప్టెన్ రజత్ పతిదార్ (12) త్వరగా ఔటవడంతో ఓ దశలో 42-4తో కష్టాల్లో పడింది. ఈ దశలో లివింగ్ స్టన్, జితేశ్ శర్మ (33) జంట ఆదుకుంది. ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఈ జంట.. వేగంగా పరుగులు సాధించింది. ముఖ్యంగా లివింగ్ స్టన్ తన సత్తా చాటింది. ఐదో వికెట్ కు 52 పరుగులు జోడించాక, జితేశ్ ఔటయ్యాడు. అయితే మరో ఎండ్ లో లివింగ్ స్టన్ మాత్రం చెలరేగి, 39 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. చివర్లో టిమ్ డేవిడ్ (32) వేగంగా ఆడాడు. సాయి కిశోర్ కు రెండు వికెట్లు దక్కాయి.
సుదర్శన్, బట్లర్ హవా..ఓ మాదిరి టార్గెట్ తో బరిలోకి గుజరాత్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ శుభమాన్ గిల్ (14) వికెట్ త్వరగానే కోల్పోయింది. ఈ దశలో సాయి సుదర్శన్ (36 బంతుల్లో 49, 7 ఫోర్లు, 1 సిక్సర్), బట్లర్ జంట.. దూకుడుగా ఆడింది. సుదర్శన్ ఆరంభంలో నెమ్మదిగా ఆడి, ఆ తర్వాత గేర్ చేంజ్ చేయగా.. బట్లర్ మాత్రం సంయమనంతో ఆడాడు. వీరిద్దరూ అలవోకగా ఆర్సీబీ బౌలర్లను ఎదుర్కొని, రెండో వికెట్ కు 75 పరుగులు జోడించారు. అయితే ఫిఫ్టీకి ఒక్క పరుగు దూరంలో రాంప్ షాట్ కు ప్రయత్నించి సుదర్శన్ ఔటయ్యాడు. ఆ తర్వాత షేర్ఫేన్ రూథర్ ఫర్డ్ (30 నాటౌట్) తో కలిసి జట్టును బట్లర్ విజయతీరాలకు చేర్చాడు. విజయానికి దగ్గరగా వచ్చే వరకు ఓపికగా ఆడిన బట్లర్.. ఆ తర్వాత వేగంగా ఆడి, మ్యాచ్ ను ఖతం చేశాడు. ఈక్రమంలో 31 బంతుల్లోనే ఫిఫ్టీ ని బట్లర్ పూర్తి చేశాడు. దీంతో మరో 13 బంతులు మిగిలి ఉండగానే జీటీ విజయం సాధించింది. బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్ వుడ్ కు తలో వికెట్ దక్కింది. సిరాజ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.