IPL 2025 SRH 7th Loss Hurts it's Playoff Chances: గ‌త మ్యాచ్ లో ఎదురైన ఘోర ప‌రాజ‌యం నుంచి అద్భుతంగా గుజ‌రాత్ టైటాన్స్ కోలుకుంది. శుక్ర‌వారం స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో జ‌రిగిన మ్యాచ్ లో 38 ప‌రుగుల‌తో ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో టోర్నీలో ఏడ‌వ విజ‌యంతో టాప్-2కి చేరుకుంది. మ‌రోవైపు ఏడ‌వ ప‌రాజ‌యంతో ప్లే ఆఫ్ అవ‌కాశాలు స‌న్ కు స‌న్న‌గిల్లాయి. అన్ని రంగాల్లో విఫ‌ల‌మై, గుజ‌రాత్ చేతిలో సీజ‌న్ లో వ‌రుస‌గా రెండోసారి ఓడిపోయింది. టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్ల‌కు 224 ప‌రుగుల భారీ స్కోరు సాధించింది. శుభ‌మాన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ (38 బంతుల్లో 76, 10 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. జ‌య‌దేవ్ ఉనాద్క‌ట్ చివ‌ర్లో మూడు వికెట్లు తీసి రాణించాడు. అనంత‌రం ఛేద‌న‌లో ఓవ‌ర్ల‌న్నీ ఆడిన స‌న్ రైజ‌ర్స్ 6 వికెట్ల‌కు 186 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ (41 బంతుల్లో 74, 4 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) తో జ‌ట్టును గెలిపించేందుకు ప్ర‌య‌త్నం చేశాడు. బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ సిరాజ్, ప్ర‌సిధ్ కృష్ణ‌కు రెండేసి వికెట్లు ద‌క్కాయి. 

సూప‌ర్ భాగ‌స్వామ్యం.. ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ కు ఓపెన‌ర్లు భారీ పార్ట్న‌ర్ షిప్ అందించారు. ముఖ్యంగా సూప‌ర్ ఫామ్ లో ఉన్న సాయి సుద‌ర్శ‌న్ (23 బంతుల్లో 48, 9 ఫోర్లు)తో క‌లిసి గిల్.. ప‌ర్యాట‌క బౌల‌ర్ల‌ను చిత‌క్కొట్టాడు. వీరిద్ద‌రూ ఆరంభం నుంచే దూకుడుగా ఆడ‌టంతో ప‌వ‌ర్ ప్లేలోనే 82 ప‌రుగులు వ‌చ్చాయి. పేల‌వ బౌలింగ్ కు తోడు, ఫీల్డింగ్ వైఫ‌ల్యం కూడా స‌న్  కొంప ముంచింది. తొలి వికెట్ కు 87 ప‌రుగులు జోడించాక‌, సుద‌ర్శ‌న్ ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన జోస్ బ‌ట్ల‌ర్ (37 బంతుల్లో 64, 3 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) తాండ‌వం ఆడాడు. గిల్ తో క‌లిసి జోరును కొన‌సాగించ‌డంతో స్కోరు బోర్డు ప‌రుగులు పెట్టింది. వీరిద్ద‌రూ రెండో వికెట్ కు 62 ప‌రుగులు జోడించ‌డంతో భారీ స్కోరు వైపు గుజ‌రాత్ దూసుకుపోయింది. ఈ క్ర‌మంలో 25 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టిన గిల్ ర‌నౌట్ అయ్యాడు. అయితే బ‌ట్ల‌ర్ దూకుడుగా ఆడి, 31 బంతుల్లోనే 50 చేశాడు. ఈక్ర‌మంలో 220+ ప‌రుగుల‌ను దాటింది. 

https://x.com/divaa_0387/status/1918370433470021868

అభిషేక్ ఒంటరి పోరు..రెండో ఇన్నింగ్స్ లో డ్యూ వ‌స్తుంద‌నుకున్న స‌న్ అంచ‌నాలు త‌ప్పాయి. పిచ్ నెమ్మ‌దించ‌డంతో ప‌రుగుల రాక మంద‌గించింది. అయితే ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ (20)తో క‌లిసి అభిషేక్ చ‌క్క‌ని శుభారంభాన్నిచ్చాడు. వీరిద్ద‌రూ దూకుడుగా ఆడ‌టంతో ఓవ‌ర్ కు ప‌ది ప‌రుగుల‌కు పైగా ప‌రుగుల వ‌చ్చాయి. అయితే జోరుగా సాగుతున్న ఈ భాగ‌స్వామ్యాన్ని ర‌షీద్ అద్భుత క్యాచ్ తో విడ‌దీశాడు. హెడ్ గాల్లోకి షాట్ ఆడ‌గా, బౌండ‌రీ లైన్ వ‌ద్ద ర‌షీద్ ఖాన్ ప‌రుగుత్తుకుంటూ వ‌చ్చి, అద్భుత‌మైన క్యాచ్ ప‌ట్టాడు. ఓ ఎండ్ లో అభిషేక్ దూకుడుగా ఆడ‌గా, ఇషాన్ కిషాన్ (13) చాలా బంతులు వేస్ట్ చేశాడు. ఆ త‌ర్వాత మిడిలార్డ‌ర్ విఫ‌లం కావ‌డంతో స‌న్ కు ఓట‌మి త‌ప్ప‌లేదు. ఓ ఎండ్ లో 28 బంతుల్లో ఫిఫ్టీ చేసుకుని అభిషేక్ చెల‌రేగుతుండ‌గా, మిగ‌తా బ్యాట‌ర్లు విఫ‌ల‌మ‌య్యారు. హెన్రిచ్ క్లాసెన్ (23) కూడా అనుకున్నంతగా రాణించ‌లేదు. రిక్వ‌యిర్డ్ ర‌న్ రేట్ కొండ‌లా పెరిగిపోతుండ‌టంతో దాన్ని ఛేదించ‌లేక స‌న్ రైజ‌ర్స్ బ్యాట‌ర్లు చ‌తికిల ప‌డ్డారు. ఈ ఫ‌లితంతో టోర్నీలో 7వ ప‌రాజ‌యంతో ప్లే ఆఫ్ ఆశ‌ల‌ను స‌న్ రైజ‌ర్స్ క్లిష్టం చేసుకుంది.  మ‌రో ఎండ్ లో 7వ విజ‌యంతో 14 పాయింట్ల‌తో టాప్-2కి ఎగ‌బాకింది.