GT Vs SRH: గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ అద్భుతమైన బ్యాటింగ్ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తోంది. పరుగుల వరద పారిస్తున్న సాయి సుదర్శన్ IPLలో చరిత్ర సృష్టించాడు. జీటీ ఓపెనర్ అత్యంత వేగంగా 1500 IPL పరుగులు చేసిన భారత క్రికెటర్ గా నిలిచాడు. టీ20ల్లో సైతం అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తిచేసుకున్న భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. ఓవరాల్ గా చూస్తే ఐపీఎల్ లో షాన్ మార్ష్ తొలి స్థానంలో ఉన్నాడు..
గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ కేవలం 35 ఇన్నింగ్స్‌లోనే ఐపీఎల్‌లో 1500 పరుగులు సాధించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో సాయి సుదర్శన్ కేవలం 23 బంతుల్లో 48 పరుగులు చేసి ఔటయ్యాడు.
గతంలో సచిన్ టెండూల్కర్, రుతురాజ్ గాయక్వాడ్ 44 ఇన్నింగ్స్‌లో 1500 ఐపీఎల్ రన్స్ చేశారు. సాయి సుదర్శన్ 35 ఇన్నింగ్స్‌లో ఆ ఘనత అందుకున్నాడు. దాంతోపాటు సాయి సుదర్శన్ 2000 T20 పరుగుల మైలురాయి చేరుకున్నాడు. దీనిని అతను కేవలం 54 ఇన్నింగ్స్‌లోనే అందుకోవడం విశేషం. ఆస్ట్రేలియాకు చెందిన షాన్ మార్ష్ మాత్రమే అతడి కంటే ముందున్నాడు. ఆస్ట్రేలియా బ్యాటర్ 53 ఇన్నింగ్స్‌లో 2 వేల టీ20 పరుగులు సాధించాడు. గతంలో సచిన్ 59 ఇన్నింగ్స్‌లలో రెండు వేల టీ20 పరుగుల మార్క్ చేరుకున్నాడు.
సన్‌రైజర్స్ కు 225 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇవ్వడంలో జీటీ ఓపెనర్ సాయి సుదర్శన్ మెరుపు ఇన్నింగ్స్, కెప్టెన్ గిల్ హాఫ్ సెంచరీ తోడయ్యాయి. ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ పై గుజరాత్ విజయం సాధించింది. కాగా, టోర్నీలో జీటీకి ఇది 7వ విజయం కాగా, పాయింట్స్ టేబుల్ లో 2వ స్థానానికి చేరింది. మరోవైపు లీగ్‌లో 7వ ఓటమితో SRH ప్లే ఆఫ్ ఆశలు ఆవిరవుతున్నాయి. సాయి సుదర్శన్ గత మూడు సీజన్లుగా నిలకడగా ప్రదర్శన చేస్తూ టీమిండియాకు ఎంపికయ్యేందుకు ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టులో చేరడానికి అతను సిద్ధంగా ఉన్నాడని కొన్ని నివేదికలు వెల్లడించాయి.
ఆరెంజ్ క్యాప్ అందుకున్న సాయి సుదర్శన్
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందు 9 ఇన్నింగ్స్‌ల్లో సాయి సుదర్శన్ 456 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 475 పరుగులతో ఉండగా, SRHతో జరిగిన మ్యాచ్‌లో 20 స్కోర్ చేసిన వెంటనే సూర్యకుమార్‌ను సాయి అధిగమించాడు.
సాయి సుదర్శన్ (GT) - 504 పరుగులుసూర్యకుమార్ యాదవ్ (MI) - 475 పరుగులువిరాట్ కోహ్లీ (ఆర్‌సిబి) 443 పరుగులు
IPL 2025 లో 500+ పరుగులు చేసిన తొలి ఆటగాడు
IPL 2025లో 400 పరుగుల మార్కును చేరుకున్న తొలి ఆటగాడు సాయి సుదర్శన్. ఇదే క్రమంలో ఈ సీజన్‌లో 500 పరుగులు చేసిన తొలి ఆటగాడిగానూ నిలిచాడు. SRHతో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల మార్క్ చేరుకోగానే సాయి సుదర్శన్ ఈ ఘనతను సాధించాడు. ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 6 అర్ధ సెంచరీలు సాధించగా, సాయి సుదర్శన్ 5 అర్ధ సెంచరీలు సాధించాడు.