Gujarat Titans vs Lucknow Super Giants: ఐపీఎల్‌ 2023 సీజన్ 50వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట గుజరాత్ టైటాన్స్ (GT) మొదట బ్యాటింగ్ చేయనుంది. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా సీజన్‌కే దూరం అయ్యాడు. దీంతో కృనాల్ పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. మరోవైపు గుజరాత్ జెయింట్స్ జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఉన్నాడు. దీంతో ఈ మ్యాచ్ అన్నా తమ్ముళ్ల మధ్య సవాల్‌గా మారింది.


పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ అగ్ర స్థానంలోనూ, లక్నో సూపర్ జెయింట్స్ మూడో స్థానంలోనూ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ గెలిస్తే పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరనుంది. మరోవైపు గెలిచినా ఓడినా గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానంలోనే కొనసాగనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే గుజరాత్ ప్లే ఆఫ్స్ బెర్త్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లే.


లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టు
క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, కరణ్ శర్మ, కృనాల్ పాండ్యా (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, స్వప్నిల్ సింగ్, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్


లక్నో సూపర్ జెయింట్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
ఆయుష్ బదోని, అమిత్ మిశ్రా, డేనియల్ సామ్స్, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్.


గుజరాత్ టైటాన్స్ తుది జట్టు
వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ


గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
అల్జారీ జోసెఫ్, దాసున్ షనక, కేఎస్ భరత్, శివం మావి, జయంత్ యాదవ్.


మరో వైపు కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) గాయం తీవ్రమైనదేనని తేలింది! దాంతో ఐపీఎల్‌ 2023 మిగిలి సీజన్‌, ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అతడు దూరమయ్యాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మ్యాచులో అతడు గాయపడిన సంగతి తెలిసిందే. అతడి గాయాన్ని పరీక్షించిన బీసీసీఐ వైద్యబృందం శస్త్రచికిత్స చేయాల్సిందిగా సూచించింది. 


ఎకనా స్టేడియం వేదికగా సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడ్డాయి. ఆర్సీబీ ఇన్నింగ్సు ఆరంభంలోనే ఒక బౌండరీని ఆపబోయిన రాహుల్‌ గాయపడ్డాడు. బంతిని ఆపే క్రమంలో కొందపడ్డాడు. నొప్పితో విలవిల్లాడాడు. అతడిని మైదానం నుంచి తీసుకెళ్లడానికి స్ట్రెచర్‌ సైతం తీసుకొచ్చారు. అయితే నొప్పి భరించిన రాహుల్‌ సపోర్ట్ స్టాఫ్‌ సాయంతోనే డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లాడు. ఫిజియోల సాయంతో కాస్త రికవర్‌ అయ్యాడు. అయితే జట్టు ఓటమి అంచున ఉండటంతో ఆఖరి వికెట్‌గా క్రీజులోకి వచ్చాడు.


కేఎల్‌ రాహుల్‌ను స్కానింగ్ కోసం ఆస్పత్రికి తీసుకెళ్లగా హ్యామ్‌స్ట్రింగ్‌ ప్రాంతంలో వాపు ఉన్నట్టు వైద్యులు చెప్పారు. వాపు తగ్గేంత వరకు స్కానింగ్‌ తీయడానికి వీలుండదని పేర్కొన్నారు. దాంతో అతడు తిరిగొచ్చి జట్టుతో కలిశాడు. చెన్నై మ్యాచులో ఆడలేదు. మ్యాచ్‌ ముగిశాక రాత్రికి ముంబయికి వెళ్లి బీసీసీఐకి రిపోర్టు చేశాడు. అతడిని పరీక్షించిన వైద్యులు శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచించారు.