Delhi Capitals vs Royal Challengers Bangalore: ఐపీఎల్‌ 2023 సీజన్ 50వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఢిల్లీ క్యాపిటల్స్‌ భారీ విజయం సాధించింది. 182 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం ఓవర్లలోనే 16.4 మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఏడు వికెట్లతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.


ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటరల్లో ఓపెనర్ ఫిల్ సాల్ట్ (87: 45 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక బెంగళూరు బ్యాటర్ల విషయానికి వస్తే... విరాట్ కోహ్లీ (55: 46 బంతుల్లో, ఐదు ఫోర్లు) అత్యధిక స్కోరు సాధించాడు. మహిపాల్ లొమ్రోర్ (54 నాటౌట్: 29 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు) అర్థ సెంచరీ కొట్టాడు.


సాల్ట్ సూపర్ హిట్టింగ్
182 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (22: 14 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), ఫిల్ సాల్ట్ (87: 45 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరు మొదటి వికెట్‌కు కేవలం 5.1 ఓవర్లలోనే 60 పరుగులు జోడించారు. వీరిద్దరూ బౌండరీలు, సిక్సర్లతో చెలరేగారు. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో ఢిల్లీకి ఇదే అత్యధిక పవర్ ప్లే స్కోరు.


ఆ తర్వాత ఫిల్ సాల్ట్‌కు మిషెల్ మార్ష్ (26: 17 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) జతకలిశాడు. మిషెల్ మార్ష్ కూడా మొదటి బంతి నుంచే బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరోవైపు ఫిల్ సాల్ట్ కూడా జోరు పెంచాడు. ఈ క్రమంలోనే ఫిల్ సాల్ట్ అర్థ సెంచరీ కూడా పూర్తయింది. ఈ జోడి రెండో వికెట్‌కు 5.2 ఓవర్లలోనే 59 పరుగులు జోడించింది. తన మొదటి ఓవర్లోనే మిషెల్ మార్ష్‌ను అవుట్ చేసిన హర్షల్ పటేల్ ఈ పార్ట్‌నర్ షిప్‌ను విడదీశాడు.


రిలీ రౌసో (35 నాటౌట్: 22 బంతుల్లో, ఒక ఫోర్, మూడు సిక్సర్లు), ఫిల్ సాల్ట్ కలిసి ఛేజ్‌ను ముందుకు తీసుకువెళ్లారు. రిలీ రౌసో అయితే ఎక్కువగా సిక్సర్లతోనే డీల్ చేశాడు. హర్షల్ పటేల్ వేసిన ఒక ఓవర్లో ఫిల్ సాల్ట్ ఒక సిక్సర్, రిలీ రౌసో ఒక బౌండరీ, రెండు సిక్సర్లు కొట్టారు. దీంతో లక్ష్యానికి ఢిల్లీ మరింత చేరువైంది. ఫిల్ సాల్ట్ సెంచరీ చేస్తాడనుకున్న దశలో కరణ్ శర్మ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయి వెనుదిరిగాడు. ఈ జోడి మూడో వికెట్‌కు ఐదు ఓవర్లలోనే 52 పరుగులు జోడించింది. అయితే అక్షర్ పటేల్‌తో (8 నాటౌట్: 3 బంతుల్లో, ఒక సిక్సర్) కలిసి రిలీ రౌసో పని పూర్తి చేశాడు. 


అదరగొట్టిన మహిపాల్, విరాట్
టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ఫాఫ్ డు ప్లెసిస్ (45: 32 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్), విరాట్ కోహ్లీ (55: 46 బంతుల్లో, ఐదు ఫోర్లు) బెంగళూరుకు మంచి ఆరంభం ఇచ్చారు. మొదటి వికెట్‌కు 62 బంతుల్లోనే 82 పరుగులు జోడించారు. అయితే మిషెల్ మార్ష్ ఇన్నింగ్స్ 11వ ఓవర్లో ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లను (0: 1 బంతి) వరుస బంతుల్లో అవుట్ చేశాడు.


ఆ తర్వాత మహిపాల్ లోమ్రోర్ (54 నాటౌట్: 29 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు), విరాట్ కోహ్లీ బెంగళూరు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరు మూడో వికెట్‌కు 32 బంతుల్లోనే 51 పరుగులు జోడించారు. అర్థ సెంచరీ చేసిన కాసేపటికే విరాట్ కోహ్లీ వికెట్‌ను ముకేష్ కుమార్‌ పడగొట్టాడు. అయితే మహిపాల్ లోమ్రోర్ మాత్రం చివర్లో చాలా వేగంగా ఆడాడు. బౌండరీలు, సిక్సర్లతో చెలరేగాడు. దీంతో ఆర్సీబీ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు సాధించింది.  ఢిల్లీ బౌలర్లలో మిషెల్ మార్ష్‌కు రెండు వికెట్లు పడగొట్టాయి.