Delhi Capitals vs Royal Challengers Bangalore: ఐపీఎల్ 2023 సీజన్ 50వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (55: 46 బంతుల్లో, ఐదు ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మహిపాల్ లొమ్రోర్ (54 నాటౌట్: 29 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు) అర్థ సెంచరీ సాధించాడు. ఢిల్లీ బౌలర్లలో మిషెల్ మార్ష్‌కు రెండు వికెట్లు దక్కాయి.
ఢిల్లీ పిచ్ చాలా స్లోగా ఉంటుంది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. ఈ పిచ్‌పై 160 పరుగులు దాటితే అది దాదాపు భారీ స్కోరే. కానీ ఈ మ్యాచ్‌లో ఢిల్లీ విజయానికి 120 బంతుల్లో 182 పరుగులు కావాలి.
అదరగొట్టిన మహిపాల్, విరాట్
టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ఫాఫ్ డు ప్లెసిస్ (45: 32 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్), విరాట్ కోహ్లీ (55: 46 బంతుల్లో, ఐదు ఫోర్లు) బెంగళూరుకు మంచి ఆరంభం ఇచ్చారు. మొదటి వికెట్‌కు 62 బంతుల్లోనే 82 పరుగులు జోడించారు. అయితే మిషెల్ మార్ష్ ఇన్నింగ్స్ 11వ ఓవర్లో ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లను (0: 1 బంతి) వరుస బంతుల్లో అవుట్ చేశాడు.
ఆ తర్వాత మహిపాల్ లోమ్రోర్ (54 నాటౌట్: 29 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు), విరాట్ కోహ్లీ బెంగళూరు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరు మూడో వికెట్‌కు 32 బంతుల్లోనే 51 పరుగులు జోడించారు. అర్థ సెంచరీ చేసిన కాసేపటికే విరాట్ కోహ్లీ వికెట్‌ను ముకేష్ కుమార్ పడగొట్టాడు. అయితే మహిపాల్ లోమ్రోర్ మాత్రం చివర్లో చాలా వేగంగా ఆడాడు. బౌండరీలు, సిక్సర్లతో చెలరేగాడు. దీంతో ఆర్సీబీ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు సాధించింది. ఢిల్లీ బౌలర్లలో మిషెల్ మార్ష్‌కు రెండు వికెట్లు పడగొట్టాయి.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ పదో స్థానంలోనూ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐదో స్థానంలోనూ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ తేడాతో గెలిస్తే పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరే అవకాశం ఉంది. తక్కువ తేడాతో గెలిస్తే ఐదో స్థానంలోనే ఉంటారు. మరోవైపు ఢిల్లీది కూడా ఇదే పరిస్థితి. భారీ తేడాతో గెలిస్తేనే పాయింట్ల పట్టికలో ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఓడితే మాత్రం దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు
విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), కేదార్ జాదవ్, వనిందు హసరంగా, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
హర్షల్ పటేల్, సుయాష్ ప్రభుదేసాయి, విజయ్‌కుమార్ వైషాక్, మైఖేల్ బ్రేస్‌వెల్, షాబాజ్ అహ్మద్.
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, రిలీ రోసౌ, మనీష్ పాండే, అమన్ హకీమ్ ఖాన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్
ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
చేతన్ సకారియా, లలిత్ యాదవ్, రిపాల్ పటేల్, ప్రవీణ్ దూబే, అభిషేక్ పోరెల్.