Dasun Shanaka VS Glenn Phillips: గుజ‌రాత్ టైటాన్స్ తన స్క్వాడ్ లో ఒక మార్పు చేసింది. గాయ‌పడిన ఆల్ రౌండ‌ర్ గ్లెన్ ఫిలిప్స్ స్థానంలో మ‌రొ ఆట‌గాడిని తీసుకుంది. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో జ‌రిగిన మ్యాచ్ లో ఫిలిప్స్ గాయ‌ప‌డ్డాడు. ప్ర‌సిధ్ కృష్ణ బౌలింగ్ చేస్తున్న‌ప్పుడు ఇషాన్ కిష‌న్ ప‌రుగు కోసం ప్ర‌య‌త్నించ‌గా, ర‌నౌట్ చేసే క్ర‌మంలో తొడ కండ‌రాల‌గాయానికి ఫిలిప్స్ గుర‌య్యాడు. దీంతో వెంట‌నే అత‌డిని డ్రెస్సింగ్ రూంకి త‌ర‌లించి, చికిత్స అందించారు. ఆ త‌ర్వాత గాయం తీవ్ర‌త తెలియ‌డంతో మెరుగైన చికిత్స కోసం త‌న‌ని న్యూజిలాండ్ పంపించారు. ఈ సీజ‌న్ లో గుజ‌రాత్ త‌ర‌పున ఆడుతున్న ఫిలిప్స్ కు తుదిజట్టులో ఆడే అవ‌కాశం రాలేదు. స‌న్ పై మాత్రం ఫీల్డింగ్ చేసి, అన్ ల‌క్కీగా గాయ‌ప‌డ్డాడు. అత‌ని స్థానంలో శ్రీలంక‌కు చెందిన మాజీ కెప్టెన్ దాసున్ ష‌న‌క‌ను గుజ‌రాత్ టీమ్ తీసుకుంది. దీనికి ఐపీఎల్ మేనేజ్మెంట్ కూడా ఆమోదం తెలిపింది. 

మూడు జ‌ట్ల త‌ర‌పున ఆడిన ఫిలిప్స్.. ఐపీఎల్లో ఇప్ప‌టివ‌ర‌కు మూడు జ‌ట్ల త‌ర‌పున ఫిలిప్స్ ప్రాతినిథ్యం వ‌హించాడు. గ‌తంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్, స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ర‌పున ఆడినా, తుది జ‌ట్టులో ఎక్కువ అవ‌కాశాలు రాలేదు. ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం 8 మ్యాచ్ లే ఆడాడు. ఇక గ‌తేడాది మెగావేలంలో త‌న‌ను గుజ‌రాత్ రూ.2 కోట్ల‌కు కొనుగోలు చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు ఆరు మ్యాచ్ లు ఆడిన‌ప్ప‌టికీ, ఫిలిప్స్ కు తుదిజ‌ట్టులో చాన్స్ దొర‌క‌లేదు. గ‌త చాంపియ‌న్స్ ట్రోఫీలో ఫీల్డ‌ర్ గా అంద‌రి దృష్టిని ఫిలిప్స్ ఆక‌ర్షించిన సంగ‌తి తెలిసిందే.  ఇక స‌బ్ స్టిట్యూట్ ఫీల్డ‌ర్ గా గాయ‌ప‌డ‌టంతో ఈ సీజ‌న్ లో ఫిలిప్స్ ప్ర‌స్థానం ముగిసిన‌ట్ల‌య్యింది. మ‌రోవైపు ష‌న‌కతో రూ. 75 ల‌క్ష‌ల‌కు జీటీ ఒప్పందం చేసుకుంది. 

ఆల్ రౌండ‌ర్ గా గుర్తింపు..లంక ఆల్ రౌండ‌ర్ ష‌న‌కకు ఆల్ రౌండ‌ర్ గా మంచి గుర్తింపు ఉంది. జాతీయ జ‌ట్టు త‌ర‌పున 102 టీ20 మ్యాచ్ ల్లో 5 అర్ద సెంచ‌రీలు చేయ‌గా, 33 వికెట్లు తీశాడు. అలాగే 71 వ‌న్డేలు, 6 టెస్టులు ఆడాడు. ఇక టీ20 ఫార్మాట్ లో జ‌రిగిన ఆసియా క‌ప్ 2022ను లంక గెల‌వ‌డంతో సార‌థిగా ష‌న‌క కీల‌క‌పాత్ర పోషించాడు.ఇక 2023లోనూ రీప్లేస్ మెంట్ గా షనక.. గుజరాత్ తరపున ఆడాడు. ఆ సీజన్ లో కేన్ విలియమ్సన్ గాయపడటంతో అతని స్థానంలో షనకను తీసుకున్నారు. ఈ సీజ‌న్ లో గుజ‌రాత్ అద్భుత ప్ర‌దర్శ‌న చేస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన ఆరు మ్యాచ్ ల్లో నాలిగింటిలో గెలుపొంది, రెండింటిలో ఓడిపోయింది. దీంతో 8 పాయింట్ల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో నెం. 2 పొజిష‌న్ లో ఉంది. 2022 లో చాంపియ‌న్ గా నిలిచిన గుజ‌రాత్,, త‌ర్వాత ఏడాది ర‌న్న‌ర‌ప్ తో స‌రిపెట్టుకుంది. ఇక త‌ర్వాతి మ్యాచ్ ను శ‌నివారం అహ్మాదాబాద్ లో టేబుల్ టాప‌ర్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ తో గుజ‌రాత్ ఆడ‌నుంది.