IPL 2025 MI Consecutive Victory: విల్ జాక్స్ ఆల్ రౌండ్ షో (26 బంతుల్లో 36, 3 ఫోర్లు, 2 సిక్సర్లు, 2/14) తోపాటు అద్భుతమైన ప్రణాళికతో ముంబై టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని సాధించింది. ప్రత్యర్థిని బలహీనపర్చేలా పిచ్ ను రూపొందించి ఫాయిదా పొందింది. ఈ క్రమంలో టోర్నీలో మూడో విక్టరీని సొంతం చేసుకుంది. గురువారం వాంఖెడే స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో 4 వికెట్లతో విజయం సాధించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఓ మాదిరి స్కోరును సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ (28 బంతుల్లో 40, 7 ఫోర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక ఛేజింగ్ లో డ్యూ రావడంతో మంబైకీ ఈజీగా మారింది. 18.1 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసి, గెలుపొందింది. సన్ కెప్టెన్ పాట్ కమిన్స్ కి మూడు వికెట్లు దక్కాయి. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపర్చుకోవడంతో, ప్లే ఆఫ్ రేసు వైపు ప్రయాణాన్ని వడివడిగా మొదలు పెట్టింది.
కష్టతరమైన పిచ్.. ఫుల్ బ్యాటింగ్ పవర్ తో నిండిన సన్ రైజర్స్ ని తన వ్యూహంతో ముంబై కట్టిపడేసింది. పరుగులు సాధించడానికి కష్టతరమైన పిచ్ ను రూపొందించింది. లక్ కూడా వాళ్ల వైపే ఉండటంతో టాస్ కూడా నెగ్గారు. ఇక ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ కు అభిషేక్ సూపర్ స్టార్ట్ ఇచ్చాడు. 7 ఫోర్లతో మంచి ఊపుమీద కనిపించాడు. అయితే తను ఔటైన తర్వాత పరుగుల రాక కష్టంగా మారింది. అలాగే ముంబై బౌలర్లు కూడా ఒక ప్లాన్ ప్రకారంగా బౌలింగ్ చేయడంతో ఏ దశలోనూ సన్ భారీ స్కోరు చేస్తుందనిపించాలేదు. ట్రావిస్ హెడ్ (28) నెమ్మదిగా ఆడగా, ఇషాన్ కిషాన్ (2) మరోసారి విఫలమయ్యాడు. నితీశ్ కుమార్ (19) వేగంగా ఆడటానికి ఇబ్బంది పడ్డాడు. ఇక చివర్లో హెన్రిచ్ క్లాసెన్ (37), అనికేత్ వర్మ (18 నాటౌట్) కాస్త వేగంగా ఆడటంతో జట్టు స్కోరు 160 పరుగుల మార్కును దాటింది. బౌలర్లలో విల్ జాక్స్, జస్ప్రీత్ బుమ్రా చాలా చక్కగా బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్ లో గాయం కారణంగా కర్ణ్ శర్మ ఒక్క బంతి కూడా వేయలేదు.
బ్యాటింగ్ ఈజీ..ముంబై ఊహించినట్లుగానే డ్యూ రావడంతో బ్యాటింగ్ ఈజీగా మారిపోయింది. ఆరంభంలో రోహిత్ శర్మ(16 బంతుల్లో 26) సూపర్ టచ్ లో కనిపించాడు. ర్యాన్ రికెల్టన్ (31) వేగంగా ఆడాడు. ఆరంభంలో రోహిత్ తో 32 పరుగులు జోడించిన రికెల్టన్.. జాక్స్ తో కలిసి మరో ఉపయుక్త భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మధ్యలో ర్యాన్ క్యాచౌట్ అయినా, క్లాసెన్ అత్యుత్సాహంతో నాటౌట్ గా బతికిపోయాడు. ఆ తర్వాత రెండు ఫోర్లు బాది, పెవిలియన్ కు రికెల్టన్ చేరాడు. ఈ దశలో జాక్స్ అప్పుడప్పుడు బౌండరీలు బాదుతూ, యాంకర్ ఇన్నింగ్స ఆడగా, సూర్య కుమార్ యాదవ్ (15 బంతుల్లో 26, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మ్యాచ్ ను త్వరగా ముగించాలని వేగంగా ఆడాడు. వీరిద్దరూ మూడో వికెట్ కు 52 పరుగులు జోడించి ఛేజింగ్ ను సునాయాసం చేశారు. ఆ తర్వత సూర్య ఔటైనా, జాక్స్ తన ప్రతాపం చూపించి, ఔటయ్యాడు. తిలక్ వర్మ (21 నాటౌట్), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (21) తో కలిసి జట్టును విజయం వైపు నడిపించి, ఆఖర్లో ఫోర్ కొట్టి జట్టును గెలుపును అందించాడు. ఇక ముంబై బౌలర్లు బాగా వేసిన పిచ్ పై సన్ బౌలర్లు మాత్రం తేలిపోయారు. ముఖ్యంగా మహ్మద్ షమీ మరోసారి తన వైఫల్యాన్ని చూపించాడు. దీంతో మరో ఓవర్ ఉండగానే తనను సబ్ స్టిట్యూట్ గా పెవిలియన్ కు పంపి, రాహుల్ చాహర్ ను జట్టులోకి తీసుకున్నారు. ఏదేమైనా ఐదో పరాజయంతో సన్.. తన ప్లే ఆఫ్స్ అవకాశాలను కాస్త క్లిష్టం చేసుకుంది.