Maxwell Flop Show: చెత్త రికార్డు మూటగట్టుకున్న మ్యాక్సీ.. గుజరాత్ పై డకౌట్.. తొలి మ్యాచ్ లో నిరాశ పర్చిన ఆసీస్ బ్యాటర్
మ్యాక్స్ వెల్ ఐపీఎల్లో అన్ వాంటెడ్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. నిజానికి గుజరాత్ తో మ్యాచ్ లో తనకు రివ్యూ అవకాశం ఉండినా కూడా యూస్ చేసుకోలేదు. రిప్లేలో బంతి వికెట్లని మిస్ అయింది.
IPL 2025 PBKS VS GT Update : కోట్లాది రూపాయలు పెట్టి కొన్న ఆస్ట్రేలియాకు చెందిన గ్లెన్ మ్యాక్స్ వెల్ తొలి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తరపున నిరాశ జనక ప్రదర్శన చేశాడు. గోల్డెన్ డక్ తో అభిమానులను ఉస్సూరుమనిపించాడు. గత సీజన్ లో ఘోరంగా విఫలమై రెప్యుటేషన్ కొల్పోయిన మ్యాక్సీ.. ఈ సీజన్ లో శుభారంభం చేస్తాడనుకుంటే ఫ్లాప్ షో కొనసాగించాడు. సాయి రవికిశోర్ బౌలింగ్ లో తను ఆడిన తొలి బంతినే రివర్స్ స్వీప్ కు ప్రయత్నించి, వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. నిజానికి రివ్యూ చేస్తే తను బతికి పోయేవాడే, కానీ శ్రేయస్ సూచన్ తో నేరుగా పెవిలియన్ వైపు వెళ్లిపోయాడు. దీంతో ఐపీఎల్లో ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టోర్నీలో అత్యధిక సార్లు డకౌట్ అయిన ప్లేయర్ గా నిలిచాడు. 130 ఇన్నింగ్స్ ఆడిన మ్యాడ్ మ్యాక్స్.. తాజాది కలిపి 19వ సారి డకౌట్ అయ్యాడు. దీంతో ఈ లిస్టులో అందరికంటే ముందు నిలిచాడు. భారత స్టార్ రోహిత్ శర్మ (234 ఇన్నింగ్స్ లో 18), దినేశ్ కార్తీక్ (253 ఇన్నింగ్స్ లో 18), పీయూష్ చావ్లా (92 ఇన్నింగ్స్ లో 16), సునీల్ నరైన్ (111 ఇన్నింగ్స్ లో 16) తర్వాతి స్థానాల్లో నిలిచారు. గతంతో విధ్వంసకరంగా ఆడుతాడని పదుల కోట్లలో తనను కొనుగోలు చేసిన ఫ్రాంచైజీలు.. 2024 సీజన్ ప్లాఫ్ షోతో అంతగా తనపై ఆసక్తి చూపించలేదు. దీంతో పంజాబ్ 4.2 కోట్లతో మ్యాక్సీని సొంతం చేసుకుంది. గతంలో కూడా పంజాబ్ తరపున మ్యాక్సీ ఆడాడు.
వైశాక్ ఇంపాక్ట్..
మంగళవారం జరిగిన మ్యాచ్ లో ఆతిథ్య గుజరాత్ జెయింట్స్ పై పంజాబ్ కింగ్స్ 11 పరుగులతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ చివరి దశలో ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన బౌలర్ విజయ్ కుమార్ వైశాక్ మ్యాచ్ ను పూర్తిగా టర్న్ చేశాడు. ఆఫ్ సైడ్ వైడ్ యార్కర్ ను టార్గెట్ చేసుకుని పదే పదే బంతులు విసురుతూ, గుజరాత్ బ్యాటర్లను అసహనానికి గురి చేశాడు. దీంతో పరుగుల రాక మందగించడంతో పంజాబ్ మ్యాచ్ లోకి వచ్చింది. తను వేసిన ఫస్ట్ రెండు ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి సత్తా చాటాడు. దీంతో ఓడిపోతుందనుకున్న పంజాబ్ మ్యాచ్ ను గెలిచింది.
శ్రేయస్ సెల్ఫ్ లెస్ బ్యాటింగ్..
టోర్నీలో చాలాకాలం నుంచి ఆడుతున్నప్పటికీ, సెంచరీ చేయలేదు. 17వ ఓవర్లోనే 90లోకి ప్రవేశించిన శ్రేయస్.. నిస్వార్ధపూరిత బ్యాటింగ్ తో జట్టు గెలుపునకు కృషి చేశాడు. అతను కనుక సెంచరీ కోసం చూసి, కొన్ని బంతులు వేస్ట్ చేసినట్లయితే, పంజాబ్ 243 పరుగులు చేసి ఉండకపోయేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తన తొలి ఐపీఎల్ సెంచరీని జట్టు కోసం త్యాగం చేసి శ్రేయస్ ను పొగుడుతున్నారు. ఏదేమైనా శ్రేయస్ నిజమైన కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడాడని ప్రశంసిస్తున్నారు. ఈ విజయంతో ఈ సీజన్ లో వరుసగా నమోదైన మూడు ఆతిథ్య జట్ల విజయాల పరంపరకు బ్రేక్ వేసింది. పర్యాటక జట్టుగా గుజరాత్ లో ఆడిన పంజాబ్.. అక్కడ విజయం సాధించింది.