IPL 2025 PBKS Commanding Victory: ఉత్కంఠభరిత మ్యాచ్ లో మొత్తానికి ఊహించిన ఫలితమే వచ్చింది. ఫస్ట్ బ్యాటింగ్ లో భారీ స్కోరు చేసిన పంజాబ్ కింగ్స్.. బౌలింగ్ లోనూ కీలక దశలో సత్తా చాటి ఈ సీజన్ లో బోణీ కొట్టింది. మంగళవారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆతిథ్య గుజరాత్ టైటాన్స్ పై 11 పరుగులతో విజయం సాధించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 243 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ (42 బంతుల్లో 97 నాటౌట్, 5 ఫోర్లు, 9 సిక్సర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అనంతరం ఛేదనలో ఓవర్లన్నీ ఆడిన గుజరాత్ 5 వికెట్లకు 232 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్ (41 బంతుల్లో 74, 5 ఫోర్లు, 6 సిక్సర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. తాజా విజయంతో ఈ సీజన్ లో వరుసగా ఆతిథ్య జట్లు సాధిస్తున్న విజయాల పరంపరకు పంజబ్ బ్రేక్ వేసింది. ఆతిథ్య పంజాబ్ ను ఓడించి, ఈ సీజన్ లో బోణీ కొట్టింది.
గుజరాత్ సర్ప్రైజ్ డెసిషన్.. భారీ చేధనకు బరిలోకి దిగిన గుజరాత్ సర్ప్రైజ్ డెసిషన్ తీసుకుంది. ఓపెనర్ గా విధ్వంసక ప్లేయర్ జోస్ బట్లర్ (33 బంతుల్లో 54, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కు బదులుగా సాయి సుదర్శన్ ను పంపించింది. అయితే పవర్ ప్లేలో ఈ నిర్ణయం బెడిసి కొట్టింది. అనుకున్నంత వేగంగా సుదర్శన్ ఆడలేకపోవడంతో వీలైనంత దూకుడుగా ఆడిన కెప్టెన్ శుభమాన్ గిల్ (33) ఒత్తిడికి లోనై వికెట్ పారేసుకున్నాడు. ఆ తర్వాత సుదర్శన్, బట్లర్ జంట జట్టును గెలిపించేందుకు ప్రయత్నించారు. వీరిద్దరూ వేగంగా ఆడుతూ, ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు. ముఖ్యంగా చివర్లో వేగంగా ఆడిన సుదర్శన్ 31 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుని ఔటయ్యాడు.
మ్యాచ్ ను మలుపు తిప్పిన వైశాఖ్..ఆ తర్వాత షెర్ఫేన్ రూథర్ ఫర్డ్ ( 28 బంతుల్లో 46, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) తో కలిసి బట్లర్ కాస్త వేగంగా ఆడటంతో పరుగులు ధారళంగా వచ్చాయి. ఈ దశలో మ్యాచ్ గుజరాత్ వైపే మొగ్గింది. అయితే ఇక్కడే ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన విజయ్ కుమార్ వైశాఖ్.. మ్యాచ్ ను ములుపు తిప్పాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లలో బౌలింగ్ కు వచ్చిన వైశాఖ్.. కట్టుదిట్టమైన బౌలింగ్ తో గుజరాత్ కు ముకుతాడు వేశాడు. ఆ తర్వాత మిగతా బౌలర్లు కూడా పుంజుకోవడంతో గుజరాత్ కు ఓటమి తప్పలేదు. బౌలర్లలో అర్షదీప్ సింగ్ బాగా బౌలింగ్ చేయడంతోపాటు రెండు వికెట్లు తీశాడు.