IPL 2024: క్రికెట్ పిచ్చోడు. గంభీర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పదమే కరెక్ట్. గెలవాలన్నా కసి,అవతలి వాడు ఎవడనేది లెక్కపెట్టని తత్వం ఇలాంటి లక్షణాలెన్నో గంభీర్ టీమిండియాకు అత్యుత్తమ ఓపెనర్ అయ్యేలా చేశాయి. ఐపీఎల్‌లో కోల్‌కతాకు రెండు ట్రోఫీలు తెచ్చిపెట్టాయి. ఆటగాడిగా క్రికెట్‌కు దూరమైనా అపర చాణక్యుడిలా వ్యూహాలతో కోల్‌కతాను ఇప్పుడు విజయాలతో దూసుకెళ్లేలా చేస్తున్నాడు గంభీర్.
గతేడాది వరకూ లక్నో సూపర్ జెయింట్స్‌తో కలిసి పని చేసిన గంభీర్.. ఈ సీజన్‌కు తనకిష్టమైన కోల్‌కతా టీమ్‌కు తిరిగి వచ్చేశాడు. షారూఖ్ గంభీర్‌కు మెంటార్ బాధ్యతలను అప్పగించాడు. వస్తూ వస్తూనే తన మార్క్ చూపించిన గౌతీ బౌలింగ్ ఆల్ రౌండర్ నరైన్‌ను ఓపెనర్‌గా పంపించాలనే టాక్టిక్‌ను అమలు చేశాడు. గతంలో గంభీర్ కోల్‌కతాలో ఉన్నప్పుడు సక్సెస్ అయిన నరైన్‌ది ఓపెనర్ ఫార్మూలాను మళ్లీ తన రాకతోనే మొదలుపెట్టాడు. ఫలితం కోల్‌కతాకు అద్భుతమైన ఆరంభాలు ఇస్తున్నాడు కరీబియన్ ఆటగాడు సునీల్ నరైన్.
మూడేళ్లుగా బ్యాటర్‌గా విఫలమవుతున్న నరైన్ ఈసారి మాత్రం ఓపెనర్‌గా చెలరేగిపోతున్నాడు. ఆడిన మూడు మ్యాచుల్లో 134 పరుగులు చేశాడు. నిన్న జరిగిన ఢిల్లీ మ్యాచ్‌లో అత్యధికంగా 85 పరుగులు చేసి తన కెరీర్ బెస్ట్ నమోదు చేశాడు. మూడు మ్యాచుల్లో 12 సిక్సులు బాదిన నరైన్... బౌలర్ ఎవరనేది చూడకుండా పవర్ ప్లేల్లో తన పించ్ హిట్టింగ్‌తో భారీ స్కోర్లు సాధించేలా టీమ్‌కి కావాల్సిన బూస్టింగ్ ఇస్తున్నాడు. ఫలితమే నిన్న ఢిల్లీపై కోల్‌కతా సాధించిన 272పరుగుల భారీ స్కోరు. తృటిలో మిస్సైంది కానీ లేదంటే సన్ రైజర్స్ కొట్టిన 277 పరుగుల అత్యధిక పరుగుల రికార్డు కూడా బద్ధలయ్యేదే.
ఈ మార్పునే కాదు టీనేజ్ కుర్రాడు రఘువంశీని వన్ డౌన్ ఆడించాలని బౌలింగ్ కోసం వైభవ్ అరోరాను తీసుకోవటం ఇలా తనదైన శైలిలో టీమ్ కూర్పులో భాగం అవుతూ గంభీర్ తన మాస్టర్ మైండ్ ఏంటో నిరూపించుకుంటున్నాడు. అవతలివైపు పాంటింగ్, గంగూలీ లాంటి లెజండ్స్ ఉన్నా... అగ్రెసివ్ డెసిషన్స్ తో తన మార్క్ చూపిస్తున్నాడు గంభీర్.