Shubman Gill Vs KL Rahul: భారత దిగ్గజ క్రికెటర్ టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ పలకడంతో అతని స్థానం నెం.4ను ఎవరు భర్తీ చేస్తారనేదానిపై సందేహాలు నెలకొన్నాయి. క్లాసిక్ ఫార్మాట్ లో ఈ నెంబర్లో గతంలో దిగ్గజాలు అయిన సచిన్ టెండూల్కర్, కోహ్లీ బ్యాటింగ్ చేశారు. ఇప్పుడు వీరిని మరిపించేలా ప్రదర్శన చేయాలి, లేకపోతే తప్పకుండా పోలిక వస్తుంది. అలాగే ఈ నెంబర్లో బ్యాటింగ్ చేయాలంటే అటు టెక్నిక్ తోపాటు ఇటు క్లాస్ కూడా ఉండాలి. ఈ నేపథ్యంలో ఈ నెంబర్లో బ్యాటింగ్ చేయగల ఆటగాడిని మాజీ ఓపెనర్ వసీం జాఫర్ సూచించాడు. టెస్టు కెప్టెన్ గా అందరూ భావిస్తున్న శుభమాన్ గిలే ఈ బాధ్యత తీసుకోవాలని సూచించాడు. ఇప్పుడు ఇరవ్వైల్లోనే ఉన్న గిల్.. దీర్ఘకాలంలో ఈ స్థానంలో రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక ఇప్పటివరకు వివిధ స్థానాల్లో 32 టెస్టులాడిన గిల్.. కేవలం 35 సగటుతో విమర్శల పాలయ్యాడు. ఈ స్థానంలో కుదురుకుంటే, తన కెరీర్ లో పరుగుల వరదకు ఢోకా ఉండదని విశ్వాసం వ్యక్తం చేశాడు. అతనికంటే సీనియర్ అయిన కేఎల్ రాహుల్ ఈ స్థానానికి బదులు మరో స్థానంలో ఆడాలని సూచించాడు.
టాపార్డర్లోనే..టెస్టుల్లో యశస్వి జైస్వాల్ తో కలిసి ఓపెనింగ్ లోనే కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేయాలని జాఫర్ సూచించాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఈ జోడీ అద్భుతంగా రాణించిన విషయాన్ని గుర్తు చేశాడు. మంచి బ్యాటింగ్ పెయిర్ ను విడగొట్టడం దేనికని, అనవసర ప్రయోగాలు చేయడం అవసరం లేదని పేర్కొన్నాడు. ఇక 33 ఏళ్ల రాహుల్ కంటే కూడా కేవలం 26 ఏళ్ల గిల్ నే నెంబర్ 4లో ఆడించడం కరెక్టని అభిప్రాయపడ్డాడు. ఇక గతంలో ఓపెనర్ గా ఆడిన గిల్.. చటేశ్వర్ పుజారా నుంచి నెం.3 స్థానాన్ని తన సొంతం చేసుకున్నాడు. అయితే ఈ స్థానంలో ఎవరు ఆడాలనే దానిపై జాఫర్ జవాబిచ్చాడు.
అతనైతేనే బెస్ట్..గుజరాత్ టైటాన్స్ తరపున పరుగుల వరద పారిస్తున్న సాయి సుదర్శన్ నెం.3 స్థానానికి అతికినట్లు సరిపోతాడని జాఫర్ విశ్వాసం వ్యక్తం చేశాడు. మంచి టైమింగ్, టెంపర్మెంట్ తన సొంతమని, ఈ ఐపీఎల్లో తను సత్తా చాటాడని గుర్తు చేశాడు. గిల్ స్థానంలో నెం.3లో సుదర్శన్ ను ఆడిస్తే, ఓపెనర్లుగా రాహుల్- జైస్వాల్ జోడీ, సుదర్శన్, గిల్ తో టాప్-4 పటిష్టంగా ఉంటుందని పేర్కొన్నాడు. అయితే టీమ్ మేనేజ్మెంట్ దీనిపై నిర్ణయం తీసుకోవాలి. ఇంగ్లాండ్ లో తొలి టెస్టు సందర్భంగా దీనిపై స్పష్టత వస్తుంది. మరోవైపు నెంబర్ ఫోర్ లో ఆడటానికి చాలామంది బ్యాటర్లు తహతహలాడుతున్నారు. సర్ఫరాజ్ ఖాన్, రజత్ పతిదార్‌తోపాటు శ్రేయస్ అయ్యర్ కూడా ఈ స్థానంపై కన్నేశాడు. వీరిలో తుదిజట్టులో ఎంతమంది ఉంటారో అనే దానిపై సందేహాలు నెలకొన్నాయి. అయితే ప్లేయింగ్ లెవన్ ఎలా ఉండబోతోందో, కోత్త సారథి, హెడ్ కోచ్ గౌతం గంభీర్ ప్రణాళికలు ఏవిధంగా ఉంటాయో చూడటానికి మరో నెలరోజులు ఆగాల్సిందేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.