Selection Of Cheerleaders In IPL 2024: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) అంటే ప్రతి ఒక్కరికీ గుర్తుకు వచ్చేది సిక్సర్ల మోత. పరుగులు వరద పారించే జట్లు. వీటితోపాటు క్రికెట్‌ ప్రేమికుల దృష్టిని ఆకర్షించేది చీర్‌ లీడర్ల డాన్స్‌ ప్రదర్శన. మ్యాచ్‌ ఆద్యంతం ఇరు జట్లకు చెందిన చీర్‌ లీడర్లు క్రికెట్‌ అభిమానులను తమ డాన్స్‌లతో ఉర్రూతలూగిస్తుంటారు. ఆటగాళ్లు కొట్టే సిక్స్‌, ఫోర్‌, తీసే వికెట్‌కు అభిమానులు ఎంత ఎంజాయ్‌ చేస్తారో.. ఆయా ప్రదర్శనలకు అనుగుణంగా చీర్‌ లీడర్లైన యువతులు చిందేస్తూ క్రికెట్‌ అభిమానులను అలరిస్తూ ఉంటారు. మ్యాచ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసేంత వరకు ఇరు జట్లకు చెందిన చీర్‌ లీడర్లు ఉత్సాహంగా చిందేస్తూనే ఉంటారు. అయితే, చీర్‌ లీడర్లను ఎలా ఎంపిక చేస్తారు..? వారికి ఒక్కో మ్యాచ్‌కు ఎంత మొత్తం ఆయా జట్లు చెల్లిస్తాయి వంటి విషయాల మీకోసం. 


డాన్స్‌లో అనుభవముంటేనే ఎంపిక


చీర్‌ లీడర్లుగా ఎంపిక కావాలంటే ప్రతిభ కావాలి. అద్భుతంగా డాన్స్‌ చేయగలిగే వారికే అవకాశాలు లభిస్తుంటాయి. డాన్స్‌, మోడలింగ్‌, పెద్ద సమూహాల ముందు డాన్స్‌ ప్రదర్శన చేయడంలో అనుభవం ఉన్న వారిని చీర్‌ లీడర్లుగా ఎంపిక చేస్తారు. చీర్‌ లీడర్లను ఇంటర్వ్యూలు, రాత పరీక్ష వంటి వాటి ద్వారా ఎంపిక చేస్తారు. ప్రత్యేకంగా ఆడిషన్స్‌ నిర్వహించి వీరిని ఎంపిక చేస్తుంటారు. ఈ బాధ్యతను ఆయా క్రికెట్‌ టీమ్‌ యాజమాన్యాలు ప్రముఖ మోడలింగ్‌ సంస్థలకు అప్పగిస్తుంటాయి. 


చీర్‌ లీడర్లకు వేతనం ఎంతంటే..?


చీర్‌ లీడర్లకు మ్యాచ్‌కు రూ.14 వేలు నుంచి రూ.20 వేలు వరకు ఆయా జట్లు చెల్లిస్తుంటాయి. ఇంత కంటే తక్కువ తీసుకునే చీర్‌ లీడర్లు ఉంటారు. చీర్‌ లీడర్ల ప్రదర్శన బాగుంటే వారికి ప్రత్యేక బోనస్‌లు ఇస్తుంటారు. ముఖ్యంగా మ్యాచ్‌, ట్రీఫీ గెల్చినప్పుడు వీరికి ఆయా జట్లు యాజమాన్యాలు ప్రత్యేక అలవెన్సులు చెల్లిస్తుంటాయి. కనీసం ఒక్కో జట్లుకు ఆరు నుంచి పది మంది వరకు చీర్‌ లీడర్లు ఉంటారు. ఏటా ఐపీఎల్‌ కోసం విదేశాల నుంచి 60 నుంచి వంద మంది వరకు చీర్‌ లీడర్స్‌ వస్తుంటారు. వీరంతా 18 నుంచి 25 ఏళ్లలోపు వయసు వారే ఉంటారు. చీర్‌ లీడర్స్‌లో ఎక్కువగా రష్యా, ఆస్ర్టేలియా, ఇంగ్లాండ్‌, ఐర్లాండ్‌ వంటి దేశాలకు చెందిన వాళ్లు ఉంటారు. వీరంతా దాదాపు డాన్సర్లే. డాన్స్‌ను వృత్తిగా ఎంచుకున్న వాళ్లే చీర్‌ లీడర్స్‌గా వస్తుంటారు. ఐపీఎల్‌తో చీర్‌ లీడర్స్‌ ఏర్పాటు ప్రక్రియ వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత నుంచి అనేక దేశాల్లో నిర్వహిస్తున్న లీగుల్లోనూ చీర్‌ లీడర్స్‌ ఉంటున్నారు. అంతర్జాతీయ టోర్నీల్లోనూ కొన్నిసార్లు వీరు కనిపిస్తున్నారు. 


కష్టమే అయినా ఇష్టంగా


చీర్‌ లీడర్స్‌ మ్యాచ్‌ జరుగుతున్నంత సేపు పెదాలపై చిరు నవ్వులు చిందిస్తూ డాన్స్‌ చేయాల్సి ఉంటుంది. సిక్స్‌, ఫోర్‌, క్యాచ్‌, వికెట్‌.. ఇలా తమ జట్టుకు సంబంధించి ఉపయోగపడే ప్రతి సందర్భానికి చీర్‌ లీడర్స్‌ చిందేయాల్సి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆటగాళ్ల ప్రదర్శనతోపాటు చీర్‌ లీడర్ల డాన్స్‌ కూడా క్రికెట్‌ అభిమానులను కట్టి పడేస్తుంది. కొన్నిసార్లు చీర్‌ లీడర్ల ప్రదర్శ మ్యాచ్‌ వీక్షించే వారిని మరింత ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది.