IPL 2024: ఇన్నాళ్ల క్రికెట్ ఒకెత్తు...ఇప్పుడో ఎత్తు. కోట్లమంది క్రికెట్ అభిమానులను అలరించేందుకు, మండువేసవిలో ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్‌మెంట్ అందించేందుకు మన ముందుకొచ్చేసింది ఇండియన్ ప్రీమియర్‌లీగ్ 2024. అభిమాన ఆటగాళ్ల జెర్సీలు మారిపోయాయి. టీంలు మారిపోయాయి. ఇక అల్లంత దూరాన ఉన్న ఆ టెటిల్ కోసం ఆయా వేటగాళ్ల ఆట మాత్రమే మిగిలింది. ముఖ్యంగా ఐపీయల్ అంటే చెలరేగిపోయే ఇండియన్ క్రికెటర్లు ఈసారి ఎలాంటి ఆటతీరు కనబరుస్తారో అని కోట్ల కళ్లు ఎదురుచూస్తున్నాయి. ఒక్క టైటిల్ కోసం ఇంకా కొన్ని జట్టు వేట కొనసాగిస్తుంటే, ఆ కల తీర్చుకొని ఆ జట్లను కొత్త నాయకత్వంలో ఆడిస్తున్న జట్లు మరికొన్ని. ఇలా బ్యాటింగ్ విజృంభణలు, బౌలింగ్ ప్రదర్శనలు, కళ్లుచెదిరే ఫీల్డింగ్ విన్యాసాలతో మన ముందుకొచ్చిన ఐపీయల్2024 లో ఈ సారి కొంతమంది ఇండియన్ క్రికెటర్ల మీద అందరి కళ్లు ఉన్నాయి... మరి ఎవరో ఆ ఆటగాళ్లు చూద్దాం మీరూ రండి.
నువ్వెక్కడుంటే
ఐపీయల్ లో అందరి కళ్లు మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni)మీద ఉంటాయి. ఈ లెజెండ్ కి ఇదే చివరి ఐపీయల్ అన్న అనుమానాలకు తోడుగా చాలా కూల్‌గా తన కెప్టెన్సీ వదిలేసి మరింత షాక్ కి గురిచేశాడు తలా ధోని. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో ధోనీని చూడలేమన్న భావనలో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ధోనీ అభిమానులు. ముఖ్యంగా ఇండియా ఫ్యాన్స్ ధోనీ కోసమే ఈ సారి చెన్నై మ్యాచ్‌లు చూస్తారనడంలో సందేహం లేదు. కాబట్టి ఈ సారి అందరి కళ్లు ముందు వెతుకుతోంది ధోనీ గురించే.
రోహిత్ కి కోపమొచ్చిందా
ఇక ముంబయ్ ఇండియన్స్ ఆటగాడు, టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)గురించి. రికార్డ్ స్థాయిలో తమ టీంకు 5 టైటిళ్లు అందించిన రోహిత్ ను కాదని హార్ధిక్‌పాండ్యా(Hardik Pandya )ని ఈ సారి కెప్టెన్ ని చేశారు ముంబై ఇండియన్స్ యాజమాన్యం. రోహిత్ ను కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టడంతో నెట్టింట్లో మీమ్స్ బాగా వైరల్ అయ్యాయి. కానీ, ప్రాక్టీస్‌లో అందరితో కలిసి పాల్గొనడం, హార్ధిక్‌తో మామూలుగానే ఉండటం రోహిత్ మీద ఈ ఎఫెక్ట్ ఏమీలేదని నమ్ముతున్నారు అభిమానులు. కానీ మ్యాచ్ లు జరిగే కొద్దీ ఎలా ఉంటుందనేది కొంచెం ఆసక్తికర అంశంగా చెప్పొచ్చు.
విరాట్ ఈ సారైనా
ఇక టీంఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(Virat Kohli). టన్నుల కొద్దీ పరుగులున్నాఛాంపియన్స్‌గా నిలవలేదు అన్నలోటు బెంగళూరు ఆటగాళ్లతో పాటు అభిమానులను కలవరపరుస్తోంది. దీంతో ఈ సారి ఎలాగైనా కప్ కొడతాం అందుకు ఏం చేయాలో అంతా చేస్తాం అన్న విరాట్ మాటలతో, అలాగే బెంగళూరు అమ్మాయిలు విమెన్ టైటిల్ సాధించడంతో... మరి మెన్స్ క్రికెట్ టీం ఏం చేస్తుందో అన్న చర్చ ఊపందుకోవడంతో రాయల్ ఛాలెంజర్స్ ఈ సారి మరింత కసిగా కప్ వేటలో బరిలోకి దిగనుందని అర్ధవమవుతోంది. కాబట్టి అభిమానులు కళ్లు విరాట్‌తో పాటు ఆర్సీబీ మీద కూడా ఉంటాయనడంలో సందేహంలేదు.
వీళ్ల మీదా కళ్లుంటాయి
ఇక గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకొని ఈ ఐపీయల్‌కి అందుబాటులోకొచ్చిన రిషబ్‌పంత్(Rishabh Pant) ఈ సారి ఎట్రాక్షన్ ప్లేయర్‌గా ఉన్నాడు. వికెట్ కీపర్‌గా తన ప్రదర్శన ఎలా ఉండబోతోంది అన్న ఆసక్తి కలుగుతోంది. దాదపు 15 నెలలు క్రికెట్‌కి దూరంగా ఉన్న రిషబ్ ప్రాక్టీస్‌లో ఫిట్‌గానే కనిపించాడు. అలాగే ముంబై పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మళ్లీ లీగ్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఇంగ్లాడ్‌తో టెస్ట్ సిరీస్‌లో దుమ్ము రేపే ప్రదర్శరన ఇచ్చిన ఈ రేసుగుర్రం ఈ సారి ముంబయ్‌కి బలం అవ్వనున్నాడు. ఇక కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, గాయంతో గతంలో లీగ్ మధ్యలో దూరమైన కే.యల్.రాహుల్ ఈ సారి అందుబాటులోకి రావడంతో అందరి కళ్లు వీళ్లమీద ఉన్నాయి.
సెలెక్టర్ల దృష్టి వీళ్ల మీదే
వీరితో పాటు అందరి చూపు... ముఖ్యంగా టీం ఇండియా సెలెక్టర్ల చూపు ఉన్న ఆటగాళ్లు జితేశ్‌శర్మ(jitesh sharma), సంజూ శాంసన్(Sanju Samson). టీ-20 ప్రపంచకప్‌నకు రిషబ్‌పంత్ పూర్తి ఫిట్‌నెస్ సాధించని పక్షంలో పంజాబ్ కింగ్స్‌కి ఆడుతున్న జితేశ్ శర్మ, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూశాంసన్ టీంఇండియా వికెట్ కీపర్ల జాబితాలో ముందు వరుసలో ఉంటారు. ఇప్పటికే పంత్ గైర్హాజరీలో కొన్ని మ్యాచ్‌లు ఆడిన జితేశ్, సంజూ ఈ ఐపీయల్ ప్రదర్శన ని బట్టి టీంఇండియా ప్రపంచకప్ విమానమెక్కే ఆటగాళ్లలో ముందుంటారు. సో, ఇన్ని టీములు, ఇంతమంది స్టార్ ఆటగాళ్లు ఐపీయల్ ఆడుతున్నా ఈ సారి మాత్రం వీరు కాస్త స్పెషల్ అని చెప్పొచ్చు.