IPL 2025 Deepak Chahar Vs MS Dhoni: ఐపీఎల్ 2025లో ఆదివారం ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజ బ్యాటర్ ఎంఎస్ ధోనీని ముంబై ఇండియన్స్ పేసర్ దీపక్ చాహర్ స్లెడ్జ్ చేయాలని చూశాడు. అతను బ్యాటింగ్ కు వచ్చిన సమయంలో సిల్లీ మిడాఫ్ లో నిలబడి, చప్పట్లు చరుస్తూ దీపక్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. అదే విధంగా ఏదో మాట్లాడుతూ.. చిన్నగా స్లెడ్జింగ్ చేసినట్లు అనిపించింది. దీంతో చెన్నై స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. అయితే అప్పటికే చెన్నై విజయం ఖాయం అయిపోవడంతో తను సరదాగానే ఇలా చేస్తున్నట్లు అందరికీ అర్థం అయింది.
ఇక ఈ మ్యాచ్ లో ధోనీ రెండు బంతులాడి పరుగలేమీ చేయలేదు. మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర సిక్సర్ తో మ్యాచ్ ను ముగించాడు. మ్యాచ్ ముగిశాక ప్లేయర్లు కరచాలనం చేసేటప్పుడు అత్యుత్సాహం ప్రదర్శించిన చాహర్ కు తన దైన శైలిలో రిప్లై ఇచ్చాడు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. అభిమానులు తమకు తోచిన కామెంట్లు చేస్తూ, లైకులు, షేర్లు చేస్తున్నారు.
బ్యాట్ తో కొట్టిన ధోనీ..
ప్లేయర్లు కరాచలనం చేసేటప్పుడు తన దగ్గరికి వచ్చిన చాహర్ ను చూసి నవ్వుతూ, తన బ్యాట్ తో వెనకాల ధోనీ ఒక్కటిచ్చాడు. ఈ సీన్ అక్కడున్న వారిని పులకరింప చేసింది. నిజానికి ధోనీ, చాహర్ మధ్య గురు శిష్యుల అనుబంధం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అనామకంగా ఉన్న చాహర్ ను సీఎస్కేలోకి తీసుకుని, తనని మేటి పేసర్ గా మలిచాడు ధోనీ. అతని శిక్షణలో రాటు దేలిన చాహర్.. ఏకంగా టీమిండియాలోకి అరంగేట్రం చేశాడు. ఇప్పుడు ముంబైకి ప్రధాన పేసర్లలో ఒకడిగా మారాడు.
రాత మారని ముంబై..
ఐపీఎల్లో ముంబో మరో చెత్త రికార్డును మూటగట్టుకుంది. సీజన్ తొలి మ్యాచ్ ను వరుసగా 13వ సారి ఓడిపోయిన జట్టుగా నిలిచింది. ఎప్పుడో 2012లో సీజన్ తొలి మ్యాచ్ ను గెలిచిన ముంబై, ఆ తర్వాత ఆడిన ప్రతి తొలి మ్యాచ్ ఓడిపోతూ వస్తోంది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ మారిన ముంబై రాత మారలేదు. కొత్త సారథి సూర్య కుమార్ యాదవ్ సైతం జట్టును గెలిపించలేక పోయాడు. ఇక ఐపీఎల్లో ముంబైపై చెన్నై ఆధిపత్యం కొనసాగుతోంది. కరోనా తర్వాత ఆడిన ఏడు మ్యాచ్ ల్లో ఆరింటిలో చెన్నై విజయం సాధించింది. దీంతో ఈ సీజన్లో సొంతగడ్డపై ఆడిన తొలి మ్యాచ్ లో విజయం సాధించిన రెండో టీమ్ గా నిలిచింది.