DC Hattrick Win: చెన్నై సూపర్ కింగ్స్ హ్యాట్రిక్ ఓటములు నమోదు చేసింది. శనివారం డబుల్ హెడర్ లో భాగంగా చెన్నై చేపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 25 పరుగుల తేడాతో చెన్నై పై విజయం సాధించింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 183 పరుగలు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ విధ్వంసక ఫిఫ్టీ (51 బంతుల్లో 77, 6 ఫోర్లు, 3 సిక్సర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో ఖలీల్ అహ్మద్ కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం ఛేదనలో ఓవర్లన్నీ ఆడిన చెన్నై 5 వికెట్లకు 153 పరుగులు చేసి ఓడిపోయింది. విజయ్ శంకర్ ( 54 బంతుల్లో 69 నాటౌట్, 5 ఫోర్లు, 1 సిక్సర్) చాల స్లోగా అజేయ ఫిఫ్టీ చేసి, టాప్ స్కోరర్ గా నిలిచినా ఫలితం లేకుండా పోయింది. బౌలర్లలో విప్రజ్ నిగమ్ కు 2 వికెట్లు దక్కాయి. ఈ విజయంతో ఢిల్లీ టాప్ పొజిషన్ కు చేరింది. అలాగే 15 సంవత్సరాల తర్వాత చేపాక్ లో ఢిల్లీ గెలిచింది.
రాహుల్ వన్ మేన్ షో..ఈ మ్యాచ్ లో వికెట్ కీపర్ బ్యాటర్ రాహుల్ వన్ మేన్ షో ను చూపించాడు. ఓపెనర్ గా వచ్చిన రాహుల్ దాదాపు చివరికంటా బౌలింగ్ చేసి, ట్రిక్కీ పిచ్ పై ఢిల్లీ కి భారీ స్కోరు అందించాడు. నిజానికి ఆరంభంలో ఓపెనర్ జాక్ ఫ్రేజర్ డకౌటయ్యాడు. ఈ దశలో అభిషేక్ పోరెల్ (33)తో కలిసి రాహుల్ మంచి పునాది వేశాడు. ఆరంభంలో రాహుల్ యాంకర్ రోల్ ను పోషించగా, పోరెల్ దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 54 పరుగులు జోడించారు. ఆ తర్వాత కెప్టెన్ అక్షర్ పటెల్ (20), సమీర్ రజ్వీ (20), ట్రిస్టన్ స్టబ్స్ (24 నాటౌట్) తలో చేయి వేయడంతో భారీ స్కోరును చెన్నై సాధించింది. ఇక 33 బంతుల్లో ఫిఫ్టీ చేసిన రాహుల్ , ఆ తర్వాత స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో ఔటయ్యాడు.
మళ్లీ అదే కథ.. ఈ సీజన్ లో కాస్త నిరాశ పూరితంగా ఆడుతున్న చెన్నై.. ఈ మ్యాచ్ లోనూ అలాగే ఆడింది. భారీ టార్గెట్ ను ఛేదించే క్రమంలో బ్యాటర్ల నుంచి మద్ధతు రాలేదు. ఆరంభంలోనే రచిన్ రవీంద్ర (3) , కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (13), డేవన్ కాన్వే (13) ఔటవడంతో ఛేజింగ్ లో చెన్నై వెనుక బడింది. శంకర్ ఫిఫ్టీ చేసినా, దూకుడుగా ఆడలేదు. ఇక మిడిలార్డర్ లో శివమ్ దూబే (18) రవీంద్ర జడేజా (2) విఫలం కావడంతో చెన్నై ఓటమి వైపు పయనించింది. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (30 నాటౌట్) వచ్చినా, తను కూడా వేగంగా ఆడలేకపోయాడు. దీంతో రన్ రేట్ విపరీతంగా పెరుగుతూ వెళ్లి, మ్యాచ్ చెన్నై నుంచి చేజారి వెళ్లి పోయింది. చివరకు ధోనీ, శంకర్ 84 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసినా, అది ఓటమి అంతరాన్ని తగ్గించడానికే సరిపోతయింది.