IPL 2025 CSK VS MI Live Updates: సొంతగడ్డపై తనకు తిరుగులేదని చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి నిరూపించింది. చిరకాల ప్రత్యర్థి ముంబై ఇండియన్స్ పై 4 వికెట్లతో ఘన విజయం సాధించింది. ఆదివారం చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు సాధించింది. తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ (31) టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో నూర్ అహ్మద్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం ఛేదనను 19.1 ఓవరల్లో 6 వికెట్లకు 158 పరుగులు చేసి విజయం సాధించింది. రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్, 2 ఫోర్లు, 4 సిక్సర్లు ) , రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ ఇన్నింగ్స్ (26 బంతుల్లో 53, 6 ఫోర్లు, 3 సిక్సర్లు)తో టాప్ స్కోరర్లు గా నిలిచారు. బౌలర్లలో డెబ్యూటెంట్ విఘ్నేష్ పుతూర్ కు మూడు వికెట్లు దక్కాయి. ఈ విజయంతో ఈ ఎల్ క్లాసికో మ్యాచ్ లో చెన్నై ఆధిపత్యం ప్రదర్శించింది.
జట్టును గెలిపించిన రచిన్..రచిన్ రవీంద్ర తనెంతటి ప్రమాదకర ఆటగాడో మరోసారి నిరూపించాడు. స్పిన్ కు అనుకూలిస్తున్న వికెట్ పై పరుగుల రాక కాస్త కష్టమైన వేళ, చివరికంటా నిలిచి జట్టును విజయ పథంలో నడిపాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా వెరవకుండా, అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. నిజానికి టార్గెట్ చేజింగ్ ఆరంభంలోనే రాహుల్ త్రిపాఠి (2) ఔటవడంతో చెన్నైకి షాక్ తగిలింది. ఈ దశలో రచిన్-రుతురాజ్ ద్వయం జట్టును ఆదుకుంది. రచిన్ యాంకర్ పాత్ర పోషించగా, రుతురాజ్ ధనాధన్ ఆటతీరుతో మ్యాచ్ గతినే మార్చేశాడు. తాను ఉన్నంత సేపు భారీ షాట్లు ఆడుతూ ముంబై బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. ఈ క్రమంలో 22 బంతుల్లోనే ఫిఫ్టీ చేసుకుని, భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. దీంతో రెండో వికెట్ కు కేవలం 37 బంతుల్లోనే నమోదైన 67 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
మిడిలార్డర్ ఫెయిల్..ఒక దశలో 78-1తో పటిష్టంగా కనిపించిన చెన్నై మిడిలార్డర్ ఫెయిల్ కావడంతో 116-5తో ఒత్తిడిలో పడిపోయింది. కొత్త కుర్రాడు విఘ్నేశ్ ధాటికి చెన్నై బ్యాటర్లు బోల్తా కొట్టారు. శివం దూబే (9), దీపక్ హూడా (3), శామ్ కరన్ (4) త్వరగా ఔటవడంతో స్టేడియం ఒక్కసారిగా సైలెంట్ అయ్యింది. ఈ దశలో రవీంద్ర జడేజా (17) తన అనుభవన్నాంత రంగరించి జట్టును దాదాపు గట్టున పడేశాడు. చివర్లో తను రనౌటైనా, ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ కు దిగి ప్రేక్షకులను అలరించాడు. చివర్లో సిక్సర్లతో విరుచుకుపడిన రచిన్.. 42 బంతుల్లో తన ఫిఫ్టీని పూర్తి చేసుకుని, అదే జోరులో మ్యాచ్ ను కూడా ముగించాడు. నూర్ అహ్మద్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.