Indian Premier League | చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా జరుగుతున్న మూడో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) బ్యాటింగ్లో అంతగా రాణించలేదు. చెన్నై సూపర్ కింగ్స్ తో చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ 4 వికెట్లు పడగొట్టగా, ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు తీశాడు. అశ్విన్, నాథన్ ఇల్లీస్ చెరో వికెట్ దక్కించుకున్నారు. తొలి మ్యాచ్ ఓడిపోవడం తమ సాంప్రదాయం అన్నట్లుగా ముంబై బ్యాటింగ్ కొనసాగింది.
తొలి ఓవర్ లోనే ముంబైకి షాక్..
మాజీ ఛాంపియన్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ అంటే చాలా అంచనాలు ఉంటాయి. ఎల్ క్లాసికో అంటూ అభిమానులు వీరి పోరు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. కానీ ఈ మ్యాచ్లో ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ డక్ అవుట్ అయి ముంబై అభిమానులను నిరాశ పరిచాడు. ఖలీల్ అహ్మద్ రోహిత్ వికెట్ పడగొట్టాడు. ఇన్నింగ్స్ మూడవ ఓవర్ లో ఖలీల్ ముంబై మరో ఓపెనర్ రియాన్ rickleton అవుట్ చేశాడు. దాంతో 21 పరుగులకే ముంబై ఓపెనర్లను కోల్పోయింది.
నూర్ అహ్మద్ తిప్పేశాడు..
అశ్విన్ బౌలింగ్లో విల్ జాబ్స్ ఆడిన బంతిని దూబే క్యాచ్ పట్టడంతో నిరాశగా వెనుతిరిగాడు. పేసర్ ఖలీల్ అహ్మద్ మొదలు పెట్టిన వికెట్ల పతనాన్ని.. స్పిన్నర్ నూర్ అహ్మద్ కొనసాగించాడు. వరుస విరామాల్లో ముంబై బ్యాటర్ల భరతం పట్టాడు. ముంబై బ్యాటర్లలో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (29), తిలక్ వర్మ (31) పరవాలేదనిపించారు. చివర్లో దీపక్ చాహర్ (15 బంతుల్లో 28 నాటౌట్) మెరుపులు మెరూపించడంతో ముంబాయి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.