Dewald brevis | చెన్నై: స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన ఆరోపణలను 'అసత్యం' అని చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కొట్టిపారేసింది. IPL 2025లో డెవాల్డ్ బ్రెవిస్‌ను సంతకం చేయడానికి CSK ఫ్రాంచైజీ సీక్రెట్‌గా ఎక్కువ డబ్బులు ఇచ్చిందని అశ్విన్ సంచలన ఆరోపణలు చేశాడు. వాస్తవానికి, చెన్నై జట్టుకు గుర్జపనీత్ సింగ్ స్థానంలో ప్లేయర్ కావాలి, అతని స్థానంలో గత సీజన్‌లో డెవాల్డ్ బ్రెవిస్ ను సీఎస్కే తీసుకుంది. చాలా జట్లు ఈ యువ దక్షిణాఫ్రికా బ్యాటర్‌ను తమ ఫ్రాంచైజీలో చేర్చుకోవాలని కోరుకున్నాయి. కానీ చెన్నై సూపర్ కింగ్స్ ఎక్కువ డబ్బులు ఆఫర్ చేసి సఫారీ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్‌ను తమ ఫ్రాంచైజీలో చేర్చుకుందని అశ్విన్ ఆరోపించాడు. దీనిని సోషల్ మీడియాలో 'మోసపూరిత ఒప్పందం' అని కూడా పేర్కొన్నాడు.

అశ్విన్ చేసిన ఆరోపణలను తప్పు అని చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తేల్చింది. Xలో పోస్ట్ చేస్తూ, CSK ఫ్రాంచైజీ ఇలా రాసుకొచ్చింది. "డెవాల్డ్ బ్రెవిస్ IPL ప్లేయర్ రెగ్యులేషన్స్ 2025-2027, క్లాజ్ 6.6 ప్రకారం రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా అగ్రిమెంట్ చేసుకున్నాడు. దాంతో బ్రెవిస్‌ను నిబంధనలను అనుసరించి సంతకం చేశారని ఫ్రాంచైజీ నిర్ధారించింది."

రీప్లేస్‌మెంట్‌కు ఎక్కువ మొత్తం చెల్లించరాదు 

IPL 2025లో CSK జట్టు డెవాల్డ్ బ్రెవిస్‌ను 2.2 కోట్ల రూపాయలకు తమ జట్టులో చేర్చుకుంది. గుర్జపనీత్ సింగ్‌ను వేలంలో కొనుగోలు చేసిన మొత్తం సైతం ఇదే. IPLలో రీప్లేస్‌మెంట్ నిబంధనల ప్రకారం, గాయపడిన ఆటగాడికి బదులుగా వేలంలో కొనుగోలు చేసిన దానికంటే ఎక్కువ మొత్తం ఏ ప్లేయర్‌కు ఇవ్వకూడదు. అదే సమయంలో, ఒక ఆటగాడిని సీజన్ మధ్యలో రీప్లేస్‌మెంట్‌గా తీసుకువచ్చినా, జట్టు మిగిలిన మ్యాచ్‌ల ప్రకారం ఆటగాడికి లభించే మొత్తంలో కోత విధించనున్నారని తెలిసిందే.

అశ్విన్ చేసిన ప్రకటనపై వివాదం, సీఎస్కే ఘాటు వ్యాఖ్యలు

తన యూట్యూబ్ ఛానెల్‌లో రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ, " IPL 2025 రెండవ భాగం చాలా బాగుంది. డెవాల్డ్ బ్రెవిస్ కోసం 2-3 జట్లు ప్రయత్నించాయి. కానీ వారు ఎక్కువ డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. దాంతో రంగంలోకి దిగిన CSK బ్రెవిస్‌తో సంతకం చేసుకుంది.

బ్రెవిస్ డిమాండ్ ఏమిటంటే, 'నేను ఇప్పుడు జట్టులో చేరి బాగా ఆడుతున్నాను, కాబట్టి నాకు మరింత డిమాండ్ పెరిగింది. అందువల్ల, నాకు డిమాండ్ తగ్గట్లుగా డబ్బు ఇవ్వాలి.' అని కోరాడు. యువ ఆటగాడితో బేరసారాలు చేసిన మాజీ ఛాంపియన్ సీఎస్కే డేవాల్డ్ బ్రేవిస్‌ను తమ ఫ్రాంచైజీలో చేర్చుకోవడంలో విజయం సాధించింది. దాని ఫలితంగా CSK జట్టు బ్రెవిస్‌ రూపంలో ఒక బెస్ట్ ప్లేయర్‌ను పొందింది. కానీ రూల్స్ విరుద్ధంగా అతడికి రీప్లేస్‌మెంట్ అయిన ఆటగాడికి ఇచ్చే దాని కంటే సీఎస్కే ఎక్కువ చెల్లించి రూల్స్ బ్రేక్ చేసింది. బెస్ట్ ప్లేయర్‌ను సైతం దక్కించుకోవడంలో సఫలమైందని’ అశ్విన్ పేర్కొన్నాడు. అయితే అశ్విన్ నిరాధార ఆరోపణలు చేశాడని సీఎస్కే మేనేజ్‌మెంట్ ఘాటుగా స్పందించింది.