APL 2025 Latest News: తెలుగు గడ్డపై టీ20 ఫీవర్ ప్రారంభమైంది. ప్రతిష్టాత్మక ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నాలుగో ఎడిషన్ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. అయితే ఈ సీజన్ పై క్రికెట్ ప్రేమికులే కాకుండా ఐపీఎల్ జట్ల స్కౌట్ల బాధ్యులు కూడా దృష్టి సారించారు. గత మూడు ఎడిషన్ల నుంచి బాగా ఆడిన కొంతమంది క్రికెటర్లు ఇప్పటికే ఐపీఎల్ కు ఎంపికయ్యారు. గతేడాది వేలంలో సత్యనారాయణ రాజును ముంబై ఇండియన్స్ కొనుగోలు చేయగా, పైలా అవినాశ్ ను పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. దీంతో ఈసారి సీజన్ లోనూ సత్తా చాటి, ఐపీఎల్ గడప తొక్కాలని ఏపీఎల్ ప్లేయర్లు తహతహ లాడుతున్నారు. ఈసారి ఐపీఎల్ స్కౌట్ల బృందాలు గమనించే వారిలో కింది ముగ్గురు పేసర్లు ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సత్తా చాటితే ఐపీఎల్ బెర్త్ దక్కించుకునే అవకాశముంది. వారు ఎవరంటే..?
హరి శంకర్ రెడ్డి..భీమవరం బుల్స్ కు ప్రాతినిథ్యం వహించే హరి శంకర్ రెడ్డిపై చాలా ఎక్కువ ఫోకస్ ఉంది. రైట్ ఆర్మ్ పేసరైన ఈ ప్లేయర్ గత మూడు సీజన్ల నుంచి నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 17 గేమ్ లు ఆడిన ఈ ప్లేయర్.. 25 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతని బౌలింగ్ స్ట్రైక్ రేట్ కేవలం 14.9 కావడం విశేషం. ఆరంభంలోనే వికెట్లు తీయగల సామర్థ్యం హరి సొంతం. యార్కర్లు, లెగ్ కట్టర్లు, బ్యాక్ ఆఫ్ హేండ్ బంతులతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. గతంలో 2021లో సీఎస్కే బృందంలో తను ఉన్నా, అంతగా అవకాశం రాలేదు. అయితే ఈసారి సత్తా చాటి మరోసారి ఐపీఎల్ గడప తొక్కాలని భావిస్తున్నాడు.
యెద్దల రెడ్డి..సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్టు తరపున ప్రాతినిథ్యం వహించే యెద్దల రెడ్డి ఆకట్టుకుంటున్నాడు. గతేడాది సీజన్ లో తను సూపర్ గా రాణించాడు. ఐదు గేమ్ ల్లోనే 9 వికెట్లు తీశాడు తన స్ట్రైక్ రేట్ 10.2 కావడం విశేషం. ఆట వివిధ దశల్లో భాగస్వామ్యాలు ఏర్పడకుండా, వికెట్లను తీయడం అతని ప్రతిభకు నిదర్శనం. 26 ఏళ్ల ఈ పేసర్.. ఈ సీజన్ లో సత్తా చాటి ఐపీఎల్ కాంట్రాక్టు గెలుచుకోవాలని పట్టుదలగా ఉన్నాడు.
గవ్వల మల్లికార్జున..అమరావతి రాయల్స్ తరపున ఆడుతున్న గవ్వల మల్లికార్జున గత సీజన్ లో తన స్పిన్ మంత్రంతో ఆకట్టుకున్నాడు. 21 ఏళ్ల ఈ స్పిన్నర్ గత సీజన్ లో 8 వికెట్లు తీశాడు. అది కూడా 6.5 ఎకానమీ రేటుతో కావడం విశేషం. మిడిలోవర్లలో తన బౌలింగ్ లో బ్యాటర్లను చికాకు పెడుతూ, భాగస్వామ్యాలను విడదీస్తాడు. ట్రెడిషనల్ స్పిన్నర్ అయిన మల్లికార్జున ఈ సీజన్ లో సత్తా చాటి ఐపీఎల్ గడప తొక్కాలని భావిస్తున్నాడు.