IPL 2025 PBKS VS LSG Updates : ఈ సీజ‌న్లో కొత్త కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ వ‌చ్చాక పంజాబ్ కింగ్స్ అద్భుతంగా ఆడుతోంది. వ‌రుస‌గా రెండో మ్యాచ్ లో గెలిచి, టాప్-2కి చేరుకుంది. సోమ‌వారం ల‌క్నోలోని ఏక‌నా స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్ లో ఆతిథ్య ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ పై 8 వికెట్ల‌తో పంజాబ్ విజ‌యం సాధించింది. టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన ల‌క్నో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల‌కు 171 ప‌రుగులు చేసింది. నికోల‌స్ పూరన్ (30 బంతుల్లో 44, 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ తో త‌న ఆరెంజ్ క్యాప్ హోల్డ‌ర్ గా నిలిచాడు. పేసర్ అర్ష‌దీప్ సింగ్ మూడు వికెట్ల‌తో స‌త్తా చాటాడు. ఇక ఛేద‌న‌ను సునాయాసంగా పంజాబ్ పూర్తి చేసింది. కేవ‌లం 16.2 ఓవ‌ర్లలో రెండు వికెట్ల‌కు 177 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ ప్ర‌భు సిమ్రాన్ సింగ్ ప్ర‌తాపం (34 బంతుల్లో 69, 9 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) చూపెట్ట‌డంతో పంజాబ్ ఈజీ విక్ట‌రీ సొంతం చేసుకుంది. దిగ్వేశ్ రాఠీకి రెండు వికెట్లు ద‌క్కాయి. ఇక ఈ మ్యాచ్ లో ఆయుష్ బ‌దోనీ, రవి బిష్ణోయ్ ద్వ‌యం ప‌ట్టిన రిలే క్యాచ్ టోర్నీకే హైలైట్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. అప్ప‌టివ‌ర‌కు దూకుడుగా సెంచ‌రీ వైపు వెళుతున్న ప్ర‌భ్ సిమ్రాన్ సింగ్.. ఈ క్యాచ్ తో ఉస్సూరుమంటూ పెవిలియిన్ కు చేరాడు. 

11వ ఓవ‌ర్లో..ఈ అద్భుత‌మైన రిలే క్యాచ్ 11వ ఓవ‌ర్లో వేసింది. దిగ్వేశ్ వేసిన 11 వ ఓవ‌ర్ తొలి బంతిని ప్ర‌భ్ స్లాగ్ స్వీప్ షాట్ ఆడ‌గా, బౌండ‌రీ వ‌ద్ద ఉన్న ఆయుష్ బ‌దోనీ పైకి ఎగిరి దాన్ని క్యాచ్ గా అందుకున్నాడు. అయితే ఈ క్ర‌మంలో బ్యాలెన్స్ కోల్పోవ‌డంతో బౌండ‌రీ ఆవ‌త‌ల ప‌డిపోయాడు. అంత‌కుముందే బంతిని పైకి క్యాచ్ రూపంలో విసిరేశాడు. డీప్ స్క్వేర్ లెగ్ లో ఉన్న ర‌వి బిష్ణోయ్ అప్ప‌టికే వేగంగా ప‌రుగెత్తుకుంటూ వ‌చ్చి, డైవ్ కొడుతూ, క‌ళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. దీంతో ప్ర‌భ్ ఔట‌య్యాడు. తాజాగా ఈ క్యాచ్ తాలుకూ క్లిప్పింగ్ సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తోంది. నెటిజ‌న్లు ఇద్ద‌రి ద్వ‌యాన్ని కొనియాడుతూ కామెంట్లు చేస్తూ, లైకులు, షేర్లు చేస్తున్నారు. 

దిగ్వేష్ కు జ‌రిమానా..ఇక మ్యాచ్ లో అనుచితంగా ప్ర‌వ‌ర్తించినందుకుగాను స్పిన్న‌ర్ దిగ్వేశ్ రాఠీపై ఐపీఎల్ యాజ‌మాన్యం కొర‌డా ఝ‌ళిపించింది. ఓపెన‌ర్ ప్రియాంశ్ ఆర్యా ను ఇన్నింగ్స్ మూడో ఓవ‌ర్లో దిగ్వేశ్ ఔట్ చేశాడు. ఔటై పెవిలియ‌న్ వైపు వెళుతుండ‌గా, నోట్ బుక్ లో ఏదో రాస్తున్న‌ట్లుగా సిగ్న‌ల్ చేస్తూ, ఆర్యాను దిగ్వేశ్ ట్రోల్ చేశాడు. అయితే దీనిపై ఐపీఎల్ యాజ‌మాన్యం క‌న్నెర్ర చేసింది. ప్లేయ‌ర్ల ప్ర‌వ‌ర్త‌న నియామావ‌ళిని ఉల్లంఘించినందుకుగాను గాను అత‌నికి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించ‌డంతోపాటు ఒక డీమెరిట్ పాయింట్ ను కేటాయించింది. ఇక దేశ‌వాళీల్లో దిగ్వేశ్, ఆర్యా ఒకే టీమ్ కు ఆడుతుండ‌టం విశేషం. ఆ చ‌నువుతోనే అత‌డిని ట్రోల్ చేయ‌గా, ఆర్యా కూడా ఏమీ స్పందించ‌కుండా సైలెంట్ గా పెవిలియ‌న్ కు వెళ్లిపోయాడు.