IPL 2023 Schedule Announced: ఐపీఎల్ 2023 షెడ్యూలును బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఈ 16వ సీజన్ మార్చి 31వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఈ మ్యాచ్ జరగనుంది.
ఐపీఎల్ 2023 ప్రారంభ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ 16వ సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ టోర్నమెంట్ చివరి లీగ్ మ్యాచ్ మే 21వ తేదీన జరుగుతుంది. అయితే బీసీసీఐ ఇంకా ఐపీఎల్ 2023 ప్లేఆఫ్ మ్యాచ్‌ల తేదీలను వెల్లడించలేదు.
రెండో రోజు డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడనున్నాయి. ఇక ఏప్రిల్ 2వ తేదీన కూడా రెండు మ్యాచ్‌లను బీసీసీఐ నిర్వహించనుంది. సాయంత్రం సమయంలో జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుండగా, రాత్రి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌ల మధ్య హై వోల్టేజ్ పోరు జరగనుంది.
హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ 2022లో ఫైనల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. 2023 ఐపీఎల్‌లో 12 వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. 10 హోమ్ వేదికలతో పాటు ధర్మశాల, గౌహతిలో కూడా మ్యాచ్‌లు జరగనున్నాయి.
IPL 2023 మొదటి ఐదు మ్యాచ్‌లను చూడండి
చెన్నై సూపర్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్ - మార్చి 31వ తేదీ.
పంజాబ్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడ్స్ - ఏప్రిల్ 1వ తేదీ.
లక్నో సూపర్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ - ఏప్రిల్ 1వ తేదీ.
సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్ - ఏప్రిల్ 2వ తేదీ.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ - ఏప్రిల్ 2వ తేదీ
మే 21వ తేదీన చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది. 18 డబుల్ హెడర్లతో కలిపి మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రతి జట్టు ఒక్కొక్కటి ఏడు మ్యాచ్‌లు హోమ్ గ్రౌండ్‌లో, ఏడు మ్యాచ్‌లు బయటి గ్రౌండ్‌లో ఆడనుంది.
జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు-ఏలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్టు గ్రూపు-బిలో ఉన్నాయి. అహ్మదాబాద్, మొహాలీ, లక్నో, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, జైపూర్, ముంబై, గౌహతి, ధర్మశాల వేదికలుగా మ్యాచ్‌లు జరగనున్నాయి.
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి ఎడిషన్ షెడ్యూల్‌ను బీసీసీఐ కొద్ది రోజుల క్రితమే ప్రకటించింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్ తొలి మ్యాచ్ మార్చి 4వ తేదీన జరగనుంది. ఫైనల్ మ్యాచ్ మార్చి 26వ తేదీన జరగనుంది. మహిళల ప్రీమియర్ లీగ్ ముగిసిన తర్వాతే ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది.