IPL 2023, CSK vs GT: గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓ మోస్తరు స్కోరును సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ధోని సేన 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు సాధించింది. రుతురాజ్ గైక్వాడ్ (92: 50 బంతుల్లో, నాలుగు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గుజరాత్ విజయానికి 120 బంతుల్లో 179 పరుగులు కావాలి.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై బ్యాటింగ్‌కు దిగింది. చెన్నైకి ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ డెవాన్ కాన్వేను (1: 6 బంతుల్లో) మహ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 14 పరుగులకే చెన్నై మొదటి వికెట్ కోల్పోయింది. కానీ వన్‌డౌన్‌లో వచ్చిన మొయిన్ అలీ (23: 17 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్), మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (92: 50 బంతుల్లో, నాలుగు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు) మెరుపు వేగంతో ఆడారు. వీరు రెండో వికెట్‌కు 21 బంతుల్లోనే 36 పరుగులు జోడించారు. చెన్నై సూపర్ కింగ్స్ 5.4 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును చేరుకుంది. కానీ ఈ దశలో రషీద్ ఖాన్ చెన్నైని గట్టి దెబ్బ కొట్టాడు. వరుస ఓవర్లలో మొయిన్ అలీ, బెన్ స్టోక్స్‌లను (7: 6 బంతుల్లో, ఒక ఫోర్) అవుట్ చేశాడు.  దీంతో చెన్నై 70 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.


అనంతరం వచ్చిన అంబటి రాయుడు (12: 12 బంతుల్లో, ఒక సిక్సర్), రుతురాజ్ గైక్వాడ్‌కు చక్కటి సహకారం అందించాడు. వీరు నాలుగో వికెట్‌కు 51 పరుగులు జోడిస్తే... అందులో రాయుడువి కేవలం 12 పరుగులే. రుతురాజ్ గైక్వాడ్ సిక్సర్లతో చెలరేగాడు. కేవలం 24 బంతుల్లోనే అర్థ సెంచరీని సాధించాడు. అల్జారీ జోసెఫ్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో ఏకంగా మూడు సిక్సర్లు కొట్టడం విశేషం. వీరి భాగస్వామ్యం చెన్నైని భారీ స్కోరు దిశగా తీసుకెళ్తున్న దశలో రాయుడు అవుటయ్యాడు. దీంతో రుతురాజ్ గైక్వాడ్ కూడా నెమ్మదించాడు.


శివం దూబే (19: 18 బంతుల్లో, ఒక సిక్సర్) వేగంగా ఆడలేకపోవడంతో ఆ ఒత్తిడి రుతురాజ్‌పై పడింది. దీంతో భారీ షాట్లకు ప్రయత్నించి సెంచరీకి దగ్గరలో అవుటయ్యాడు. ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోని (14 నాటౌట్: 7 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) ఒక ఫోర్, ఒక సిక్సర్ కొట్టి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు. దీంతో ఒక దశలో 200 పరుగులను అలవోకగా కొడుతుందనుకున్న చెన్నై 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులకే పరిమితం అయింది.


గుజరాత్ టైటాన్స్ తుది జట్టు
వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్, కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, జాషువా లిటిల్, యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్


సబ్‌స్టిట్యూట్స్ (వీరిలో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకోవచ్చు)
ఆర్ సాయి సుదర్శన్, జయంత్ యాదవ్, మోహిత్ శర్మ, అభినవ్ మనోహర్, శ్రీకర్ భరత్


చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు
డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్


సబ్‌స్టిట్యూట్స్ (వీరిలో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకోవచ్చు)
తుషార్ దేశ్‌పాండే, సుభ్రంషు సేనాపతి, షేక్ రషీద్, అజింక్య రహానే, నిషాంత్ సంధు